ఆకేసి..చికెనేసి...

ఒట్టి ఆకుకూరలంటే కష్టమేమో కానీ.. వాటికి సరైన నాన్‌వెజ్‌ జోడీ దొరికితే  ఆ రుచి అదిరిపోదూ!  గోంగూర పచ్చిరొయ్యలు, గోంగూర మటన్‌ అలాంటి రుచులే. అవేకాదు మరికాస్త భిన్నంగా ఆకుకూర- నాన్‌వెజ్‌ రుచులు ప్రయత్నిద్దాం అనుకొనేవారు వీటిని చదివేయండి...

Published : 04 Dec 2022 00:31 IST

ఒట్టి ఆకుకూరలంటే కష్టమేమో కానీ.. వాటికి సరైన నాన్‌వెజ్‌ జోడీ దొరికితే  ఆ రుచి అదిరిపోదూ!  గోంగూర పచ్చిరొయ్యలు, గోంగూర మటన్‌ అలాంటి రుచులే. అవేకాదు మరికాస్త భిన్నంగా ఆకుకూర- నాన్‌వెజ్‌ రుచులు ప్రయత్నిద్దాం అనుకొనేవారు వీటిని చదివేయండి...


 గోంగూర బోటీ

కావాల్సినవి: శుభ్రం చేసిన బోటీ- 300గ్రా, గోంగూర కట్టలు- రెండు, నూనె- మూడున్నర చెంచాలు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు, టొమాటోలు- రెండు(చిన్నవి), అల్లంవెల్లులిపేస్ట్‌- చెంచా, ధనియాలపొడి- చెంచా, కారం- రెండు చెంచాలు, పసుపు- పావుచెంచా, గరంమసాలాపొడి- చెంచా, ఉప్పు- తగినంత

తయారీ: కుక్కర్‌లో తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి బోటీని మెత్తగా ఉడికించుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి వేడెక్కాక కొద్దిగా నూనె వేసి అందులో గోంగూరని మెత్తగా మగ్గించుకోవాలి. మరొక కడాయి తీసుకుని అందులో మిగిలిన నూనె పోసి వేడెక్కాక.. ఉల్లిపాయముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి మగ్గాక, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనివ్వాలి. ధనియాలపొడి, గరంమసాలా, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కాసేపటికి నూనె వేరవుతుంది. అప్పుడు ఉడికించిన బోటీని నీళ్లతో సహా వేసుకోవాలి. ఓ పది నిమిషాలకు కూర దగ్గరవుతున్నప్పుడు ఉడికించిన గోంగూర వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలకు వేడివేడి గోంగూర బోటీ కూర సిద్ధం.


మెంతికూర మటన్‌

కావాల్సినవి: బోన్‌లెస్‌ మటన్‌- 500గ్రా, ఉల్లిపాయముక్కలు- ఒకటిన్నర కప్పు, టొమాటోలు- మూడు, మెంతాకు- ఒకటిన్నర కప్పు, దాల్చినచెక్క- చిన్నముక్క, లవంగాలు- మూడు, యాలకులు- రెండు, షాజీర- పావుచెంచా, ధనియాలపొడి- అరచెంచా, గరంమసాలా- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- మూడు చెంచాలు, కారం- ఒకటిన్నర చెంచా, పసుపు- తగినంత, పచ్చిమిర్చి- నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచాన్నర

తయారీ: మటన్‌కి ఉప్పు, పసుపు, కారం పట్టించి ఓ అరగంటపాటు పక్కన పెట్టేయాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి  దాల్చినచెక్క, యాలకులు, షాజీర, లవంగాలు వేసి తక్కువ మంట మీద వేడిచేశాక ఉల్లిపాయముక్కలు, మిర్చి, ఉప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చిన వాసన పోయాక మెంతాకు వేసుకోవాలి. దానిలో నీరు పోయి దగ్గరకు వచ్చేంతవరకూ ఆగి... తర్వాత మారినేట్‌ చేసి పెట్టుకున్న మటన్‌ వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించుకోవాలి. కూరలోని నీరంతాపోయి పొడిగా అయ్యాక కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా ఉడకనివ్వాలి. చివరిగా గరంమసాలా, ధనియాలపొడి వేసుకుంటే రుచికరమైన మేతి మటన్‌ రెడీ.


చుక్కకూర చికెన్‌

కావాల్సినవి: చికెన్‌- అరకేజీ, చుక్కకూర- నాలుగు కప్పులు, పచ్చిమిర్చి- మూడు, నూనె- ఐదు చిన్న చెంచాలు, కారం- ఒకటిన్నర చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, ఉల్లిపాయ- ఒకటి, ధనియాలపొడి- ఒకటిన్నర చెంచా, గరంమసాలా- చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు

తయారీ: చికెన్‌కి అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు, ఉప్పు పట్టించి అరగంటపాటు పక్కన పెట్టేయాలి. స్టౌపై కడాయి పెట్టి వేడెక్కాక నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలను బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, వేగాక మారినేట్‌ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి అందులోని నీరంతా పోయేంతవరకూ ఉడికించుకోవాలి. అప్పుడు కప్పున్నర నీళ్లు పోసి, ఉడుకుతున్నప్పుడు చుక్కకూర, ధనియాలపొడి, గరంమసాలా, ఉప్పు వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.


సోయకూర లివర్‌ఫ్రై

కావాల్సినవి: తరిగిన సోయకూర- కప్పు, మటన్‌ లివర్‌- 150గ్రా, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిరపకాయలు- మూడు, టొమాటో-1, జీలకర్రపొడి- చెంచా, ధనియాలపొడి- చెంచా, గరంమసాలా- చెంచా, కొత్తిమీర- కొద్దిగా, నూనె- మూడు చెంచాలు, ఉప్పు, కారం- తగినంత అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కారం- చెంచా,

తయారీ: స్టౌపై కడాయి పెట్టి, వేడెక్కాక అందులో నూనె పోసుకోవాలి.  ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చివాసన పోనివ్వాలి. అప్పుడు కాసిని నీళ్లు పోసుకుని దానిలో లివర్‌ మటన్‌ వేసుకోవాలి. దాన్ని గరిటెతో కలుపుతూ కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, గరంమసాలా వేసి కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడావేసి వాటినీ మగ్గనివ్వాలి. అవి కూడా ఉడికాక కొద్దిగా నీళ్లుపోసి, సోయకూరని సన్నగా తరిగి కూరలో వేసి మూతపెట్టేయాలి. మరో ఐదునిమిషాలకు కూర దగ్గరకు వచ్చి సోయకూర లివర్‌ఫ్రై రెడీ అవుతుంది.


తోటకూర కాడలు- రొయ్యల పులుసు

కావాల్సినవి: తోటకూర కాడలు- రెండు కప్పులు, రొయ్యలు- కప్పు, ఉల్లిపాయలు- రెండు, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- రెబ్బ, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, ఎండుమిర్చి- రెండు, జీలకర్రపొడి- చెంచా, ధనియాలపొడి- చెంచా, గరంమసాలా- చెంచా, కారం- చెంచా

తయారీ: స్టౌ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కాక నూనె పోసి,  కరివేపాకు, ఎండుమిర్చిని తుంచి వేసి బాగా వేగనివ్వాలి. అందులో తరిగిన తోట కూర కాడల్ని వేసి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మిక్సీజార్‌లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, గరంమసాలా, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ మసాలాని ఉడికిన తోటకూర కాడల్లో వేసుకోవాలి. అవి ఉడుకుతున్నప్పుడే ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే రొయ్యల్ని వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉంటే రొయ్యల నుంచి నీరు వస్తుంది. అది కూడా ఇగిరిపోయేంతవరకూ ఉంచి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేయాలి. ఐదుపది నిమిషాలకు కూర సిద్ధమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని