సీమ ప్రత్యేకం ఒట్టి తునకల కూర!

ఒట్టి తునకల పేరు ఎప్పుడైనా విన్నారా.. మటన్‌తో తయారు చేసే ఈ ఒరుగుల్ని ఏడాదంతా ఎప్పుడైనా వాడుకోవచ్చట.

Updated : 14 May 2023 03:39 IST

ట్టి తునకల పేరు ఎప్పుడైనా విన్నారా.. మటన్‌తో తయారు చేసే ఈ ఒరుగుల్ని ఏడాదంతా ఎప్పుడైనా వాడుకోవచ్చట. మేకని కోసినప్పుడు అదంతా ఒక్కసారే ఖర్చవ్వకపోవచ్చు. దానికోసం కనిపెట్టినవే ఈ ఒట్టి తునకలు. పాతకాలంలో రాయలసీమలో మాత్రమే ఇవి చేసుకునేవారు. ఇప్పుడైతే అందరికీ ఉపయోగపడేవే కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈ మటన్‌ ఒరుగులని చేసుకుంటున్నారు. మెత్తటి మటన్‌లో అల్లంవెల్లుల్లి, పసుపు, కారం, మసాల వేసి వారం రోజులపాటు ఎండ బెడతారు. తర్వాత వాటిని భద్రపరచుకుంటే సంవత్సరంలో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. మరి వీటితో కూర ఎలా వండుతారో చదివేయండి..

కావల్సినవి: ఒట్టి తునకలు- కప్పు, అల్లంవెల్లుల్లి మిశ్రమం- రెండు చెంచాలు, గరం మసాల- చెంచా, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, పచ్చిమర్చి- నాలుగు, కొత్తిమీర- కొద్దిగా, నూనె, ఉప్పు, కారం- తగినంత, పసుపు- పావు చెంచా, బిర్యానీ ఆకులు- రెండు, లవంగాలు- మూడు, యాలకులు- రెండు, దాల్చినచెక్క- చిన్నది, టొమాటో ముక్కలు- అరకప్పు.

తయారీ: ఓ గిన్నెలో కొద్దిగా వేడినీళ్లు తీసుకొని దాంట్లో ఒట్టి తునకల్ని వేసుకొని నానబెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని దాంట్లో కూరకి సరిపడా నూనె వేసుకొని కాగాక బిర్యానీ దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మగ్గాక అల్లంవెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకూ కలపాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి కలియబెట్టాలి. ఇప్పుడు మటన్‌ ఒరుగులు నానబెట్టుకున్న నీటిని కడాయిలో పోసి మటన్‌ మెత్తగా ఉడికేంత వరకూ ఉంచాలి. చివర్లో మసాల పొడి, కొత్తిమీర చల్లి కలిపి దింపేసుకోవటమే. వేడివేడి ఒట్టితునకల కూర రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని