అతని దైన్యం కదిలించింది...!

నిఖిల్‌ వినోద్‌ చంద్ర... ప్లస్‌ టూ విద్యార్థి. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉంటాడు. ఆ మధ్య స్కూల్లో ‘చాట్‌ షో’ ఒకటి ఏర్పాటుచేస్తే- ఎప్పట్లాగే చిర్నవ్వుతో తన కుటుంబం గురించి వివరించసాగాడు.

Published : 11 Feb 2024 00:10 IST

నిఖిల్‌ వినోద్‌ చంద్ర... ప్లస్‌ టూ విద్యార్థి. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉంటాడు. ఆ మధ్య స్కూల్లో ‘చాట్‌ షో’ ఒకటి ఏర్పాటుచేస్తే- ఎప్పట్లాగే చిర్నవ్వుతో తన కుటుంబం గురించి వివరించసాగాడు. అతనైతే నవ్వుతూ చెప్పాడుకానీ- దాన్ని చూసినవాళ్ళందరూ ఏడ్చేశారు. అంతగా ఏముందీ అంటే- అతని తల్లిదండ్రులు వినోద్‌, షీలా జోసఫ్‌లది మతాంతర వివాహం. దాంతో ఇరువైపులా బంధువులు వెలేశారు. అయినాసరే- పట్టుదలగా దుబాయ్‌లో ఉద్యోగం సాధించారు. నిఖిల్‌ అక్కడే పుట్టాడు. ఆ తర్వాత పుట్టిన తమ్ముడు నాథన్‌కి ఆటిజం ఉన్నట్టు తేలింది. అందువల్ల వాళ్ళమ్మ పిల్లల్ని తీసుకుని తిరువనంతపురం వచ్చేసింది. ఇంతలో గుండెపోటుతో నిఖిల్‌ తండ్రి చనిపోవడం ఆ కుటుంబాన్ని కుదేలుచేసింది. ఆ బాధని పంటిబిగువున భరించి వాళ్ళమ్మ మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌ అయ్యింది. అమ్మ పనికెళితే తమ్ముణ్ణి చూసుకోవడం నుంచి వంటావార్పులు చేయడందాకా అన్ని పనులూ తనే చూసుకునేవాడు నిఖిల్‌. రెండేళ్ళకిందట వాళ్ళపైన మరో పిడుగుపడింది. తల్లి పార్కిన్సన్‌ వ్యాధి వచ్చి మంచానికే పరిమితమైంది. నిఖిల్‌ ఆమెకీ తల్లిగా మారాడు. అన్ని పనులూ చేశాకే బడికొస్తున్నాడు. ఇదంతా చెప్పిన అతని వీడియో వైరల్‌ అయ్యింది. మీడియా కూడా వాళ్ళమ్మనీ ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత స్కూల్‌ యాజమాన్యం అతని ఫీజుని మాఫీ చేసింది. స్కూల్‌ ట్రస్టు మరో అడుగు ముందుకేసి సొంతిల్లు కట్టిస్తామని ప్రకటించింది! మంచి విషయం కదూ?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..