సొగసులు టాప్‌ గేర్‌

ఆల్‌ ఈజ్‌ వెల్‌.. అనుకున్నప్పుడు ఫ్యాషన్లు పరుగులు పెట్టకుండా ఉంటాయా? కరోనా సమయంలో కోల్పోయిన సొగసుల తిరునాళ్లను ఈ ఏడాది అటు సినిమా తారలు, ఇటు కుర్రకారు పరుగులు పెట్టించారు.

Updated : 30 Dec 2023 03:30 IST

ఆల్‌ ఈజ్‌ వెల్‌.. అనుకున్నప్పుడు ఫ్యాషన్లు పరుగులు పెట్టకుండా ఉంటాయా? కరోనా సమయంలో కోల్పోయిన సొగసుల తిరునాళ్లను ఈ ఏడాది అటు సినిమా తారలు, ఇటు కుర్రకారు పరుగులు పెట్టించారు. అది అంతర్జాతీయ వేదిక అయినా.. ఆముదాలవలస వీధి అయినా.. ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా చెలరేగిపోయారు. కుర్రాళ్ల విషయానికొస్తే.. జెండర్‌ న్యూట్రల్‌ ఫ్యాషన్‌ బాగా సందడి చేసింది. దీనికి బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ సింగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా వేసుకోగలగడం వీటి ప్రత్యేకత. టైలర్డ్‌ సూట్లు, స్లాచీ జీన్స్‌, స్లీక్‌ జంప్‌సూట్లు, డెనిమ్‌ ప్యాంట్లు... వీటిలో కొన్ని. ఈ ఏడాది అమ్మాయిలు అత్యధికంగా ఆదరించింది క్రోచెట్‌లనే. ఆధునికంగా, సౌకర్యంగా ఉండటం వీటి ప్రత్యేకత.

బార్బీ బొమ్మ స్ఫూర్తితో బార్బీకోర్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ సందడి చేసింది. హాలీవుడ్‌ నుంచి దిగుమతైన ఈ గులాబీ సొగసు.. బాలీవుడ్‌నీ చుట్టేసింది. ఈ ఏడాది బాగా ఆకట్టుకున్న మరో ఫ్యాషన్‌ యుటిలిటేరియన్‌ ట్రెండ్‌. కార్గో ప్యాంట్లకే కొద్దిపాటి మార్పులు చేసి దీన్ని సృష్టించారు ఫ్యాషన్‌ గురూలు. సాటిన్‌, సిల్క్‌, ఆర్గాంజాలాంటి ఫ్యాబ్రిక్స్‌తో తయారయ్యే ఈ ఔట్‌ఫిట్స్‌ అత్యంత సౌకర్యంగా ఉండటంతో సామాన్య కుర్రకారుకీ ఇష్టంగా మారాయి. కృతి సనన్‌, అలియా భట్‌, జాన్వీ కపూర్‌లు చాలా సందర్భాల్లో వీటితో దర్శనమిచ్చారు. ఆధునికంగా ఉండాలనుకునే అమ్మాయిలు మాక్సీ స్కర్టులకు తమ ఒంటిపై చోటిచ్చారు. డెనిమ్‌లు, లెగ్గింగ్స్‌.. లాంటి ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్ల హవా ఈ ఏడాదీ కొనసాగింది.

కుర్రాళ్లూ ఈ ఫ్యాషన్‌ బరిలో మేమూ ఉన్నామన్నారు. స్వెట్‌షర్ట్‌ల్లాగే స్వెట్‌ప్యాంట్‌లు ఈసారి కొత్తగా దర్శనమిచ్చాయి. ఫ్లోరల్‌ ప్రింట్లు, డెనిమ్‌ ఓవర్‌ డెనిమ్‌లు, వైడ్‌ లెగ్‌ ప్యాంట్లు అబ్బాయిలు ఇష్టంగా ధరించిన దుస్తులు. రోజువారీ వాడకానికి లార్జ్‌ చెక్డ్‌ చొక్కాల డిజైన్లు ఎంచుకున్నారు. సంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు, పెళ్లిళ్ల లాంటి సందర్భాల్లో మగానుభావులు కుర్తా, పైజామాలకే ఓటేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని