ఏఐయారే..ఈ భామ అందం!

పక్కనున్న ఈ భామని చూస్తే.. ‘ఎంతందంగా ఉన్నావే.. ఎవరే నువ్వూ..’ అని పాడాలనిపిస్తుంది కదూ! ఔను.. తను అందగత్తెనే. ప్రపంచంలోనే హాటెస్ట్‌ మోడల్‌. పేరు ఎమిలీ పెల్లెగ్రినీ. వయసు 23. ఇటలీ మోడల్‌. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో మకాం. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారానే లక్షలు సంపాదిస్తోంది.

Updated : 02 Mar 2024 07:52 IST

పక్కనున్న ఈ భామని చూస్తే.. ‘ఎంతందంగా ఉన్నావే.. ఎవరే నువ్వూ..’ అని పాడాలనిపిస్తుంది కదూ! ఔను.. తను అందగత్తెనే. ప్రపంచంలోనే హాటెస్ట్‌ మోడల్‌. పేరు ఎమిలీ పెల్లెగ్రినీ. వయసు 23. ఇటలీ మోడల్‌. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో మకాం. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారానే లక్షలు సంపాదిస్తోంది. అందుకే మన పేజీలోకి వచ్చింది. ఇంకా తన విశేషాలు చాలానే ఉన్నాయి. ఈ అమ్మడు ఇన్‌స్టా ఖాతా ప్రారంభించిన వారంలోనే రెండు లక్షల మంది ఫాలోయర్లు వచ్చారు. రీల్స్‌, వాణిజ్య సంస్థల ప్రచారం, ప్రకటనల ద్వారా నెలకు ఏకంగా రూ.9లక్షలు సంపాదిస్తోంది. తక్కువ సమయంలోనే ఎందరో సూపర్‌ మోడళ్లకి సాధ్యం కాని పాపులారిటీ సంపాదించింది.

తనేం పెద్ద సెలెబ్రిటీ కాకపోయినా.. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. కొందరు ఫ్రెండ్షిప్‌ కోసం రిక్వెస్టులు పంపితే.. ఇంకొందరు డిన్నర్లు, డేటింగ్‌లకూ పిలిచారు. మరికొందరైతే దుబాయ్‌లో షాపింగ్‌ చేద్దామనీ.. భారీ బహుమతులిస్తామని ఆఫర్లూ చేశారు. వీళ్లలో సామాన్యుల నుంచి సినిమా సెలెబ్రిటీలు క్రీడాకారులు.. రాజకీయ నాయకులు, బిలియనీర్లూ ఉన్నారు.

 ఇక అసలు విషయానికొచ్చేద్దాం..

ఎమిలీ అసలు అమ్మాయి కాదు! కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఓ మోడల్‌. ఎవరూ గుర్తించలేనంతగా.. తను నిజమైన మోడలే అన్నట్టుగా.. ఆమెను తీర్చిదిద్దాడు అమెరికాకు చెందిన ఒక కమ్యూనికేషన్‌ ఏజెన్సీ ప్రోగ్రామర్‌. ఒక సగటు కుర్రాడి డ్రీమ్‌గర్ల్‌ ఎలా ఉంటుందో చెప్పమంటూ.. ముందు చాట్‌ జీపీటీని అడిగాడట. నలుపు, గోధుమ రంగు మిళితం అయిన జుత్తు.. పొడవాటి కాళ్లు.. తేనెలూరే పెదాలు.. నీలిరంగు కళ్లు.. ఇలా చాట్‌ జీపీటీ చెప్పిన ఫీచర్లతో ఈ హైపర్‌ రియలిస్టిక్‌ భామను సృష్టించాడు. అందంగా, అచ్చమైన అమ్మాయిగా కనిపించడం కోసం ఎన్నో నెలలు కష్టపడ్డాడట. ఇప్పటికీ తన ఫొటోలు, వీడియోలు రూపొందించి, ఇన్‌స్టాలో పంచుకోవడానికి రోజుకి ఎనిమిది గంటల చొప్పున కష్టపడుతున్నాడు ఆ సృష్టికర్త. అన్నట్టు తనిప్పుడు మేటి ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌. ప్రపంచంలోనే హాటెస్ట్‌ సూపర్‌మోడల్‌. అంతర్జాలంలోకి వచ్చిన కొద్దినెలలకే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఎమిలీ.. భవిష్యత్తులో ఇంకెన్ని కోట్లమంది కుర్రాళ్లను తన సొగసులతో మాయ చేస్తుందో చూడాలి.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని