బ్రాండ్‌.. ఇదే యువత ట్రెండ్‌

రేబాన్‌ కళ్లద్దాలు.. నడుముకి లాకాస్ట్‌ బెల్ట్‌... చేతిలో స్మార్ట్‌ ఐఫోన్‌.. షాపింగ్‌కి జారా బ్యాగ్‌... ఒంటిపైన దుస్తుల నుంచి ఇంటిలోని గ్యాడ్జెట్ల దాకా యువత బ్రాండ్‌ మంత్రం జపిస్తోంది... బ్రాండెడ్‌ వస్తువులు వాడితేనే గ్రాండ్‌గా ఉంటుందనే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది.

Updated : 25 Nov 2023 01:41 IST

రేబాన్‌ కళ్లద్దాలు.. నడుముకి లాకాస్ట్‌ బెల్ట్‌... చేతిలో స్మార్ట్‌ ఐఫోన్‌.. షాపింగ్‌కి జారా బ్యాగ్‌... ఒంటిపైన దుస్తుల నుంచి ఇంటిలోని గ్యాడ్జెట్ల దాకా యువత బ్రాండ్‌ మంత్రం జపిస్తోంది... బ్రాండెడ్‌ వస్తువులు వాడితేనే గ్రాండ్‌గా ఉంటుందనే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. అందులో మంచీచెడుల మతలబులివి.

నెలలోనే యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 15 మోడల్‌ విడుదల చేసింది. దాన్ని సొంతం చేసుకోవడానికి కుర్రకారు ఒకరోజు ముందే షాపుల ముందు పడిగాపులు కాశారు. ఈ ఒక్క సంఘటన చాలు.. బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం మనోళ్లు ఎంతలా పరితపిస్తున్నారో చెప్పడానికి! యువత ఇలా మారడం వెనక బోలెడు సాకులున్నాయి. బ్రాండెడ్‌ దుస్తులు, ఉపకరణాలతో నాణ్యత, నమ్మకం, మన్నిక అన్నది వాస్తవం. వాటి కన్నా మిన్నగా అవి తమ హోదాకు ఓ చిహ్నంలా భావిస్తోంది ఈతరం. ఫ్యాషన్‌గా, ట్రెండీగా.. కనిపించాలనుకోవడం కోసమూ ఈ బ్రాండ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. అందుకే తలపై పెట్టుకునే టోపీ నుంచి పాదరక్షల దాకా అదే మోజులో పడిపోతున్నారు. బ్రాండెడ్‌ అప్పరెల్‌, యాక్సెసరీలు, బ్యాగులు, డిజైనర్‌ దుస్తులు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు.. ఇవి ఎంత ఖరీదైనా కొనడానికి వెనకాడటం లేదు. గతేడాది రూ.లక్ష పైన ధర ఉండే ఐఫోన్లు ఇరవై లక్షలు అమ్ముడయ్యాయంటే ఈ ధోరణి ఎంతలా పెరిగిపోతోందో అర్థమవుతోంది. ఇలాంటి బ్రాండ్ల అమ్మకాల విలువ ఏడాదికి రూ.ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్లపైనే. ఒంట్లోకి యవ్వనం తొంగి చూసే దశలోనే అమ్మాయిలు, అబ్బాయిలు ఈ బ్రాండెడ్‌ మోజులో పడిపోతున్నా యంటున్నాయి అధ్యయనాలు.

కాలేజీ ముగిసేసరికి ఈ ధోరణి పీక్‌కి చేరుతోంది. పట్టణాలు, నగరాల్లోని ఈ మోజు అత్యధికం. ఇలా యువత బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారడం వెనక ప్రధానంగా స్నేహితుల ప్రభావమే ఉంటోంది. ‘తమలాగే డిజైనర్‌ దుస్తులు ధరించాలనీ.. బ్రాండెడ్‌ గ్యాడ్జెట్లు వాడాలనీ పీర్‌ గ్రూప్స్‌ నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అలా చేయకపోతే తమని చులకనగా చూస్తారనే భయం వాళ్లలో మొదలవుతుంది. ఖరీదైన దుస్తులు, ఉపకరణాలు వాడితే స్టైల్‌ ఐకాన్లుగా గుర్తిస్తారనీ,  ప్రత్యేకంగా చూస్తారనే మనస్తత్వం చాలామందిని బ్రాండ్‌ విధేయులుగా మార్చేస్తోంది’ అంటూ ఈ ట్రెండ్‌ వెనక మర్మమేంటో వివరించే ప్రయత్నం చేస్తున్నారు ముంబయికి చెందిన సైకాలజిస్ట్‌ ఆయుష్‌ చావ్లా. దీనికితోడు సామాజిక మాధ్యమాలు, మీడియా ప్రభావం ఉండనే ఉంటుంది. డిస్కౌంట్లు, ఆఫర్ల పేరిట ఆకట్టుకునేలా ఆయా కంపెనీలు విపరీతంగా ప్రచారం చేయడం.. సెలెబ్రిటీలు సైతం మేం ఇవే వాడుతున్నామంటూ వాణిజ్య ప్రకటనల్లో కనిపించడం.. యువతని బ్రాండ్ల వెంట పరుగులు తీసేలా చేస్తున్నాయి.

పరిధి మించితే..

సౌకర్యం, నాణ్యత కోరుకుంటే ఓకేగానీ.. బ్రాండ్‌ మోజులో కొనుగోలు వ్యసనంలా మారితే.. ఎవరికైనా తలకు మించిన భారమే. బ్రాండెడ్‌ దుస్తులు, గ్యాడ్జెట్ల కోసం కొంతమంది యువత విపరీతంగా ఖర్చు పెట్టడం.. అవి సొంతం కాకపోతే మానసికంగా కుంగిపోవడం.. లాంటివీ చేస్తున్నారు. తమిళనాడులో ఓ యువకుడు ఐఫోన్‌ కొనడానికి కిడ్నీని అమ్ముకోవడానికి సిద్ధపడ్డ వైపరీత్యం చూశాం. యువత ఒక్కసారి బ్రాండ్‌లకు అతి విధేయులుగా మారితే.. బయట పడటం కష్టం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయితే.. ఇష్టపడే బ్రాండ్‌కి సంబంధించి ఏ ఉత్పత్తి బయటికొచ్చినా అవసరం లేకపోయినా కొనేస్తుంటారు. తమ తాహతుకు మించినదైనా.. అప్పు చేసైనా కొనేస్తుంటారు. అంతకుమించి నాణ్యమైనవి అందుబాటులో ఉన్నా పట్టించుకోరు. తాము ఆ ఊబిలో పడిపోవడమే కాదు.. ఇతరులూ ఆ గ్యాడ్జెట్‌, డ్రెస్‌, వస్తువు కొనేలా పదేపదే పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటారు.

జాగ్రత్త పడదామిలా

ప్రభావం: ఒక బ్రాండ్‌కి వీరవిధేయుడిగా మారడం వెనక తారల ప్రచారం, స్నేహితుల ఆర్భాటం, ఇతర వాణిజ్య ప్రకటనలు.. ఇలాంటివి ప్రభావం చూపిస్తుంటాయి. కొనుగోలు వ్యసనం, బ్రాండెడ్‌ ఊబి నుంచి బయట పడాలంటే వీటిని పట్టించుకోవద్దు.

ప్రాధాన్యం: అసలు మన అవసరాలేంటి? ప్రాధాన్యాలేంటి? అని మనకు మనమే ఆలోచించుకోవాలి. ఒక కాలేజీ కుర్రాడికి లక్ష రూపాయల ఫోన్‌ అవసరమా? చిరుద్యోగి వేల ఖరీదు చేసే దుస్తులు తొడగొచ్చా? ఇలా ఎవరికి వారే ప్రశ్నించుకుంటే.. బ్రాండ్‌ లాయల్టీ నుంచి బయట పడొచ్చు.

ప్రత్యామ్నాయం: ఒక బ్రాండ్‌కి విధేయత చూపిస్తే ఫర్వాలేదు. కానీ ఫ్యాషన్‌, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ... లాంటి రంగాల్లో మార్పులు వేగంగా వస్తుంటాయి. అదే నాణ్యత, సౌకర్యంతో తక్కువ ధరలో ఉత్పత్తులు దొరుకుతుంటే.. పాత బ్రాండ్‌కే అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఏంటని ఆలోచించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని