‘హీరామండి’ హొయల వెనక..

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లంతా ఆమె దుస్తులకి ఫిదాలే.. బాలీవుడ్‌లో భారీ సినిమాల్లో ఆమె ముద్ర ఉండాల్సిందే! తనే హర్వీన్‌ కౌర్‌. తాజాగా ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సిరీస్‌లో ప్రధాన నాయికలకందరికీ రాజసం ఉట్టిపడేలా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసి మరోసారి ఫ్యాషన్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.

Published : 04 May 2024 00:15 IST

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లంతా ఆమె దుస్తులకి ఫిదాలే.. బాలీవుడ్‌లో భారీ సినిమాల్లో ఆమె ముద్ర ఉండాల్సిందే! తనే హర్వీన్‌ కౌర్‌. తాజాగా ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సిరీస్‌లో ప్రధాన నాయికలకందరికీ రాజసం ఉట్టిపడేలా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసి మరోసారి ఫ్యాషన్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.

నేపథ్యం: హర్వీన్‌ సొంతూరు దిల్లీ. వస్త్ర అలంకరణపై మొదట్నుంచీ మక్కువ. బంధువులు, సన్నిహితుల పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు ఎవరేం ధరించారు అని చూసేదట. ఏవైనా కొత్త డిజైన్స్‌ కనిపిస్తే.. వాటి పూర్తి వివరాలు తెలుసుకునేదాకా వదిలేది కాదు. ఆ ఆసక్తి ఇష్టమైన వ్యాపకంగా మారాక.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కూడా చేసింది. తర్వాత పేరున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ హర్‌ప్రీత్‌ని పెళ్లాడింది. ఇద్దరు కలిసి దిల్లీలో సొంత బ్రాండ్‌ ‘రింపుల్‌ నరూలా’ ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే బ్రైడల్‌వేర్‌కి అది దేశంలోనే టాప్‌ బ్రాండ్‌ అయ్యింది.

తారలు మెచ్చేలా: బాలీవుడ్‌ ప్రస్తుతం ఎక్కువమంది సెలెబ్రిటీలు ఇష్టపడే డిజైనర్‌ తనే. దీపికా పదుకోణ్‌, కరీనా కపూర్‌, మాధురీ దీక్షిత్‌, బిపాసా బసు, కృతి సనన్‌, హుమా ఖురేషీ, నేహా శర్మ, ప్రీతి జింతా, కాజల్‌ అగర్వాల్‌, అనన్య పాండే, కత్రినా కైఫ్‌, అలియా భట్‌, అదితీరావ్‌ హైదరీ, రణ్‌బీర్‌ కపూర్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌సింగ్‌, అర్జున్‌ రాంపాల్‌.. వీళ్లకి వ్యక్తిగత కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తోంది. తను రూపొందించిన దుస్తులతో శిల్పాశెట్టి, యామీ గౌతమ్‌, కియారా ఆడ్వాణీలాంటి తారలు క్యాట్‌వాక్‌ చేశారు. ‘హౌస్‌ఫుల్‌4’, ‘భూల్‌ భులయ్యా’, ‘పద్మావత్‌’, ‘గంగూభాయి కథియావాడీ’కి తనే డిజైనర్‌.

‘హీరామండి’ మాయ: సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌లో నాయికల కాస్ట్యూమ్స్‌కి విపరీతంగా పేరొస్తోంది. ఈ సిరీస్‌ కోసం పెద్ద యజ్ఞమే చేశానంటోంది హర్వీన్‌. 1920లలో ఉన్నత స్థాయి వర్గాలు, వేశ్యలు ధరించే దుస్తుల్ని పరిశీలించడానికి తమ పూర్వీకుల ఊరైన పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా వెళ్లి, కొన్నాళ్లు గడిపింది. వారణాసి, ఆగ్రాల నుంచి ముడి సరకు తెప్పించి, మగ్గాలపై ప్రత్యేకంగా దుపట్టాలు నేయించింది. లెహెంగాలు, అనార్కలీ సెట్లు, ఘాగ్రాలు... తనే స్వయంగా డిజైన్‌ చేసింది. సినిమాలోని నటులు ధరించిన షేర్వాణీలు, కుర్తా పైజమాలు, బాంద్‌ గాలాల వివరాల కోసం సీనియర్‌ డిజైనర్ల సలహాలు తీసుకుంది. ఇందులోని ముఖ్య పాత్రధారుల కోసమే ఏకంగా 320 వరకు వేర్వేరు డిజైన్లు తయారు చేసిందట హర్వీన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని