పెదాల కోసం రూ.20లక్షలు

రికార్డులు సృష్టించడం అంటే చాలామందికి సరదా! బల్గేరియా కుర్రది ఆండ్రియా ఇవనోవా సైతం అదే రకం. తనవి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద పెదాలు. దానికోసం అష్టకష్టాలు పడి ఏకంగా రూ.20లక్షలు కూడా ఖర్చు చేసింది

Updated : 06 Jan 2024 04:49 IST

రికార్డులు సృష్టించడం అంటే చాలామందికి సరదా! బల్గేరియా కుర్రది ఆండ్రియా ఇవనోవా సైతం అదే రకం. తనవి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద పెదాలు. దానికోసం అష్టకష్టాలు పడి ఏకంగా రూ.20లక్షలు కూడా ఖర్చు చేసింది

 పెదాలకు అంత డబ్బు పోయాలా? అసలు అదేం తెలివి తక్కువ ఆలోచన? అంటారా. కానీ సోఫియా తెలివైన అమ్మాయే! జర్మన్‌ ఫిలాసఫీ చదివింది. నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. చదువులో టాపర్‌. యూనివర్సిటీలో ఉండగా ఒక లావు పెదాల అమ్మాయిని చూసి తనకి ఈ ఆలోచన వచ్చిందట. కోరిక అమ్మడిని కుదురుగా ఉండనీయలేదు. 2018లో మొదటిసారి 22 ఏళ్ల వయసులో లిప్‌ సర్జరీ చేయించుకుంది. అది మొదలు ఆ సంఖ్య 26కి చేరింది. దీనికోసం యూరోప్‌ మొత్తం తిరిగిందట.

దొండపండులాంటి పెదాలు ఉంటే చాలానుకుంటుంది ఏ అమ్మాయైనా. కానీ ఏకంగా పనస పండు అంత కావాలనుకుంది సోఫియా. మొత్తానికి ఆపసోపాలు పడి, రూ.20లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఈమధ్యే అనుకున్న రికార్డు కొట్టేసింది. అయినా అంతటితో ఆగిపోదట. ప్రపంచంలోనే అతిపెద్ద చెక్కిళ్లు ఉన్న అమ్మాయిగా నిలవాలనే కార్యక్రమానికీ శ్రీకారం చుట్టింది. ఇంట్లో వాళ్లు ‘ఇలాంటివి వద్దు.. మొహమంతా మారిపోతోంది మొర్రో’ అని ఎంత మొత్తుకున్నా.. తగ్గేదేలే అంటూ ముందుకెళ్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని