మనసుని మాయ చేసి..నా నుంచి మాయమైంది!

చలాకీగా ఉండే ఏ అమ్మాయిని చూసిన ఆమె సోగ కళ్లే గుర్తొస్తాయి. తుళ్లిపడే ఏ పడుచు కనపడ్డా.. నా అమ్ములు చేసిన సందడే కళ్లముందు మెదులుతుంది. కానీ తనిప్పుడు గతం.

Updated : 18 Nov 2023 07:07 IST

చలాకీగా ఉండే ఏ అమ్మాయిని చూసిన ఆమె సోగ కళ్లే గుర్తొస్తాయి. తుళ్లిపడే ఏ పడుచు కనపడ్డా.. నా అమ్ములు చేసిన సందడే కళ్లముందు మెదులుతుంది. కానీ తనిప్పుడు గతం.

చదువు పూర్తై ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రోజులవి. కళ్లని చక్రాల్లా తిప్పుతూ.. అందరితో కలుపుగోలుగా ఉండే ఒకమ్మాయి నన్నాకట్టుకుంది.. తనే అమ్ములు. మనసులో కల్మషం లేని తనంటే మెల్లగా ఇష్టం మొదలైంది. నా బ్యాడ్‌లక్‌.. మాట కలుపుదాం అనుకునేలోపే నా కళ్ల ముందు నుంచి కనుమరుగైంది. ఆమె కోసం చాలా వెతికా.. ఆరా తీశా. మళ్లీ కనిపించదేమో అనుకున్న సమయంలో సడెన్‌గా ప్రత్యక్షమైంది. సంద్రంలో అలలు ఎగిసినట్టుగా, నాలో సంతోషం పరవళ్లు. వెళ్లి ‘హాయ్‌’ అన్నా. చొరవగా చేయందించింది. నరాలు జివ్వుమన్నాయ్‌. ‘అర్జెంట్‌ పని ఉండటంతో ఊరెళ్లా’నంది. మోముపై చిరునవ్వు చెరగనీయని తనకి చేరువ కావాలనుకున్నా. ఎలాగో తన నెంబర్‌ సంపాదించా. సెప్టెంబర్‌ 20 అమ్ములు పుట్టినరోజు. అంతకన్నా మంచి సందర్భం ఏముంటుంది? విష్‌ చేద్దామని ఫోన్‌ కలిపా. ‘నీకెవరు చెప్పారు? ఈరోజు నా పుట్టినరోజు కాదు’ అంటూ కట్‌ చేసింది. నా ఉత్సాహం నీరుగారిపోయింది. బాగా ఫీలయ్యా. ఆ బాధకి మందు వేస్తున్నట్టు.. మరుసటి రోజు తనే ఫోన్‌ చేసింది. ‘సారీ.. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చింది. కాఫీకెళ్దామా’ అంది. లడ్డూ కావాలా నాయనా... అనడిగితే ఎవరైనా వద్దంటారా? రెక్కలు కట్టుకొని వాలిపోయా. తర్వాత మరింత ముందుకెళ్లాలని ఓరోజు మెసేజ్‌ చేశా. సమాధానంగా వీడియోకాల్‌ చేసింది. అలా మా ప్రయాణం పరుగందుకుంది. మాకోసమా అన్నట్టుగా తర్వాత వినాయక చవితి వచ్చింది. నవరాత్రులూ మాకు పండగే! చేతిలో చేయేసుకొని రోజూ దర్శనానికెళ్లాం. గణేషుడి ముందు సెల్ఫీలు దిగాం. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యేదాక చాటింగ్‌, ఫోన్‌కాల్స్‌ షరా మామూలే.
ఓ ఆదివారం యాదాద్రి వెళ్లాం. బస్‌లో పక్కపక్కనే కూర్చున్నాం. ఆ ప్రయాణం మేం జీవితాంతం కలిసి చేసే ప్రయాణానికి తొలి మెట్టు కావాలనుకున్నా. ఆ లక్ష్మీనరసింహుడి సమక్షంలో నీతో ఏడడుగులు నడుస్తానని అమ్ములుతో చెప్పా. ఆ క్షణం తన కళ్లలో మెరుపు చూశా. ఆ వెనకే భయం. ఓ సుదీర్ఘ నిట్టూర్పు విడిచి ‘నువ్వంటే నాకూ ఇష్టమే సాయీ. కానీ ప్రేమకి రెండు మనసులతో పాటు పెద్దల ఆమోదం ఉండాలి. సమాజం ఒప్పుకోవాలి. మన విషయంలో అది జరిగేలా లేదు..’ తన మాటలు పూర్తికాకముందే నా గుండె చెరువైంది. నెలలు గడిచినా ఆ బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎప్పుడైతే తను నా ప్రేమ తిరస్కరించిందో.. అప్పట్నుంచి ఆమె నాకు దగ్గరున్నా దూరంగానే అనిపించేది. కారణం ఏదైనా.. అసలు ప్రయత్నమే చేయకుండా పెళ్లి ఆలోచనల్ని గుండెల్లోనే సమాధి చేసుకుందాం అనడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అయినా అమ్ములు మీద నాకెలాంటి కోపం లేదు. తను నా సొంతం కాకపోయినా ఆమె మిగిల్చిన జ్ఞాపకాలు శాశ్వతం. నేను ఉన్నంతవరకు అవి నాతో ఉంటాయి. ఆమె నాలో ఎప్పటికీ ఉంటుంది.                                   

సాయి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని