ఒక్కసారి బదులివ్వు..

రోడ్డుపై వెళ్తుంటే ఎదురుగా ఓ అమ్మాయిల గుంపు. అందులో.. చారడేసి కళ్లు.. ఆ కళ్లకి కాటుక.. పొడవాటి జడ.. నుదుటిన విభూతి పెట్టుకున్న ఓ అమ్మాయి నన్ను ఆకర్షించింది

Updated : 06 Jan 2024 07:01 IST

మనసులో మాట

రోడ్డుపై వెళ్తుంటే ఎదురుగా ఓ అమ్మాయిల గుంపు. అందులో.. చారడేసి కళ్లు.. ఆ కళ్లకి కాటుక.. పొడవాటి జడ.. నుదుటిన విభూతి పెట్టుకున్న ఓ అమ్మాయి నన్ను ఆకర్షించింది. ఎందుకో.. తను దగ్గరవుతున్నకొద్దీ నా మనసు సంద్రపు కెరటాల్లా ఎగిసిపడుతోంది. ఇది ఏళ్ల కిందట జరిగింది. తర్వాత తను నాకు దగ్గరైంది.. నా సొంతం కాకుండానే దూరమైంది.

ఒకరోజు మా స్కూల్‌ ఫ్రెండ్‌ పెళ్లికి నా స్నేహితులంతా వెళ్లారు. నేనిష్టపడ్డ అమ్మాయీ ఆ గ్యాంగ్‌లో ఉంది. నా దురదృష్టంకొద్దీ ఒక అత్యవసరమైన పని ఉండటంతో నేను వెళ్లలేకపోయా. పెళ్లెలా జరిగిందో తెలుసుకుందామని ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశా. వాడు స్పీకర్‌ ఆన్‌ చేశాడు. ఆ విషయం నాకు తెలియదు. పెళ్లి సంగతులు మాట్లాడాకా.. ‘మున్నీ అక్కడే ఉందా? తను ఓణీ వేసుకుందా.. శారీలో వచ్చిందా?’ అన్నా. వాడు పక్కకెళ్లాడు. సాయంత్రం తను ఫోన్‌ చేసింది. ‘ఏంటీ.. నా గురించి అడిగావు’ అంటూ. తనని రోడ్డుపై చూడటం.. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌లా నా గుండెల్లో గిటార్లు మోగడం.. అన్నీ చెప్పేసి.. ‘నీ పలకరింపు నా మనసుకి తొలకరింపు.. నువ్వు చూసే చూపులు నా కళ్ళల్లో మెరుపులు.. నీ మాటలు నా మనసును దోచిన పూదోటలు.. నీ నవ్వు నాకు మరీ మరీ ప్రత్యేకం’ అంటూ ఓ వాక్బాణం వదిలా. నవ్వుతో బదులిచ్చింది.

తర్వాత మా ప్రేమ పట్టాలెక్కాక మాధ్య ఎన్నెన్నో తీపి సందర్భాలు. తనతో కలిసి వరంగల్‌ భద్రకాళి టెంపుల్‌లో అమ్మవారిని దర్శించుకున్న రోజు అయితే జీవితంలో అస్సలు మర్చిపోలేను. ఆమె పుట్టినరోజుని యూనివర్సిటీలో సంతోషంగా జరుపుకున్నాం. తర్వాత కాలం గడిచింది. మా మధ్య దూరం పెరిగింది. కాదు కాదు.. తనే దూరం పెంచేది. ఎందుకో తెలియదు. ప్రతి కథలో మలుపులు ఉన్నట్టే.. నా ప్రేమ సైతం ఊహించని మలుపు తీసుకుంది. ఓరోజు నాకు ఫోన్‌ చేసి ‘నా పెళ్లి ఇన్విటేషన్‌ పంపాను చూడు’ అంది మున్నీ. ఆ మాటతో నా గుండె ముక్కలైంది. ‘నన్నెందుకు దూరం పెట్టావ్‌? వేరొకర్ని పెళ్లెందుకు చేసుకుంటున్నావ్‌?’ అని నిలదీయాలనుకున్న మాట గొంతులోనే ఆగిపోయింది.

కొన్నాళ్ల తర్వాత మున్నీనే ఫోన్‌ చేసింది. ‘గొడవలతో అమ్మానాన్నలు విడిపోయారు. ప్రస్తుతం అమ్మతోనే ఉంటున్నా. అమ్మా నాన్నలిద్దరికీ కావాల్సిన బంధువుల అబ్బాయి సంబంధం వచ్చింది. వాళ్లు కలుస్తారనే ఆశతో ఒప్పుకున్నా’ తను చెప్పిన కారణం.. నా కన్నీళ్లను ఆపలేకపోయింది. ఎంతైనా నా మనసు మొత్తాన్ని ఆక్రమించిన అమ్మాయి కదా! వద్దనుకుంటూనే తన గురించి ఆరా తీశా. బాధాకరమైన విషయాలు తెలిశాయి. తను ఆశ పడ్డట్టు మున్నీ పెళ్లితో ఆమె అమ్మానాన్నలిద్దరూ ఒక్కటవ్వలేదు. పైగా తనకీ దుఃఖమే మిగిలింది. పెళ్లైన కొన్నాళ్లకే ఆ అబ్బాయితో గొడవలు మొదలయ్యాయి. తను సరిగా చూసుకోడు. అతడితో వేగలేక పుట్టింటి కొచ్చేసింది. ఇప్పుడో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నేను ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయట్లేదు. మెసేజ్‌కి రిప్లై ఇవ్వదు. అప్పుడు నన్ను ఎందుకు దూరం పెట్టిందో తెలియలేదు. ఇప్పుడూ ఎందుకు పెడుతుందో తెలియదు. అయినా తనకి దగ్గర కావాలని నేనేమీ కొత్తగా ప్రయత్నించడం లేదు. తనెప్పటికీ నాలోనే ఉంది. ‘మున్నీ.. నీతో కలిసి ఎన్నో సంతోషాలు పంచుకున్నా. నీ బాధలు, కష్టాల్లో తోడుండటానికీ సిద్ధంగా ఉన్నా. ఒక్కసారి బదులివ్వు.
సాయి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని