నాన్న ఒప్పుకోరు.. చంపేస్తారన్నాడు!
నాకు కొత్తా, పాతా తేడాలేం ఉండవు. ఎలాంటి వారితో అయినా ఇట్టే కలిసిపోతా. మనసులో ఉన్నది మాటలా దూసుకొచ్చేస్తుంటుంది. ఈ తీరుతో చాలాసార్లు చిక్కుల్లో పడ్డా. అయినా నా స్టైల్ నాదే.
నాకు కొత్తా, పాతా తేడాలేం ఉండవు. ఎలాంటి వారితో అయినా ఇట్టే కలిసిపోతా. మనసులో ఉన్నది మాటలా దూసుకొచ్చేస్తుంటుంది. ఈ తీరుతో చాలాసార్లు చిక్కుల్లో పడ్డా. అయినా నా స్టైల్ నాదే.
అప్పుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. కొన్నాళ్లకి ఒక తెలుగమ్మాయి చేరింది. పేరు స్వప్న. ఒద్దికగా, పద్ధతిగా, అందంగా ఉండేది. ఓసారి లంగావోణీతో ఆఫీసుకి వచ్చింది. జీన్స్‌లు, మిడీలు, చుడీదార్‌ల లోకంలో ఆ సంప్రదాయ సింగారానికి ఫిదా అయ్యా. మనసాగక ‘భలే ఉన్నారు మేడమ్’ అన్నా. ముసిముసి నవ్వుతో ‘థాంక్స్’ అంది. ఆ చిరునవ్వు నా గుండెకి గాలమేసింది. ఆఫీసుకి రాగానే అప్రయత్నంగా నా కళ్లు తనని వెతికేవి.
ఓసారి కొలీగ్స్ అంతా కలిసి సినిమాకెళ్దామనుకున్నాం. లక్కీగా తనని పికప్ చేసుకునే బాధ్యత నాకు పడింది. ఛాన్స్ దొరికితే.. నేనొదులుతానా? అల్లుకుపోయా. ఎప్పుడైనా తనకి బస్ మిస్ అయితే బైక్‌తో సిద్ధంగా ఉండేవాడిని. ఆఫీసులో ఎంతోమంది ఉండగా.. తను నాతోనే క్లోజ్‌గా మాట్లాడేది. మిగతా వాళ్లు ఏడుస్తుంటే.. నేను నవ్వుకునేవాడిని.
ఏదేమైనా తనతో నిండా ప్రేమలో మునిగిపోయా. కానీ స్వప్న మనసులో ఏముందో తెలియదు. పైగా మా ఇద్దరి సామాజిక వర్గాలు వేరు. తనకి ఆ ఫీలింగ్ లేకపోతే ఉన్న ఫ్రెండ్షిప్ కాస్తా పోతుందని భయం. అందుకే ‘ఐ లవ్యూ’ అనే పదం ఎన్నోసార్లు గొంతుదాకా వచ్చి ఆగిపోయేది.
అన్నట్టు లవ్‌లో పడి నేను ఏనాడూ పనిని నిర్లక్ష్యం చేయలేదు. అయినా సరైన గుర్తింపు ఉండేది కాదు. దాంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశా. వేరేచోట మంచి జీతంతో చేరుతున్నా అనే సంతోషం కన్నా తనని మిస్ అవుతున్నాననే బాధే ఎక్కువగా ఉండేది. ఆఫీసులో చివరి రోజు ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అందరూ నా గురించి మాట్లాడు తున్నారు. స్వప్న వంతు రాగానే ఏడుస్తూ బయటి కెళ్లిపోయింది. ఆ క్షణం నా గుండె ఆగిపోయింది. ‘అలా చేసినందుకు సారీ.. ఆల్ ది బెస్ట్. నిన్ను కచ్చితంగా మిస్ అవుతాను’ అని సాయంత్రం తనే మెసేజ్ చేసింది. ఓ నిట్టూర్పు విడిచా.
దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందనేది నిజం. ఆఫీసులు వేరయ్యాక మేం మరింత దగ్గరయ్యాం. రోజూ గంటలకొద్దీ మాట్లాడుకునేవాళ్లం. ఓరోజు సాయంత్రం రెస్టరెంట్‌లో కలుసుకున్నాం. ప్రత్యేకంగా తయారై వచ్చింది. ఏంటి స్పెషల్ అని అడిగా. పెళ్లిచూపులు జరిగాయంది. ఆ క్షణం నా మైండ్‌లో లక్ష సందేహాలు. నేనంటే ఇష్టం లేదా? అబ్బాయి నచ్చి ఓకే చెప్పేసిందా? తను నాకంటే బాగుంటాడా? ఇలా.. అప్రయత్నంగానే నా కంట్లో చెమ్మ. అది గమనించిందేమో.. ‘నచ్చలేదు అని చెప్పేశాలే...’ అంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగానే.. ‘నేనెందుకు వద్దన్నానో నీకు తెలుసా’ అంటూ సూటిగా నా కళ్లలోకి చూసింది. తన చెంపలు ఎరుపెక్కాయి. పెదాలు అదురుతున్నాయి. నాకు విషయం అర్థమైంది. ‘నేనే నీకు ప్రపోజ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నా. కానీ నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అనే భయం’ అంటూ నసిగా. తర్వాత చాలా విషయాలే మాట్లాడుకొని అక్కడ్నుంచి కదిలాం.
నెలరోజులు చాలా కలలు కన్నాం. అంగరంగవైభవంగా జరగబోయే పెళ్లి, పిల్లల గురించి ఊహించుకున్నాం. అయితే పెద్దల ఆమోదంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ప్రేమ విషయం ముందు వాళ్ల తమ్ముడికి చెప్పి, సాయం కోరాం. ‘నాన్న పెళ్లికి ఒప్పుకోరు.. చంపేస్తారు’ అన్నాడు. మరోరోజు ముగ్గురం కలిసి వెళ్లి అడుగుదాం అనుకున్నాం. ‘మీతోపాటు నన్నూ చితకబాదేస్తారు. మా నాన్న గురించి మీకు తెలియదు. ఇది జరిగే పని కాదు’ అని తెగేసి చెప్పాడు. అప్పటిదాకా కాస్త ధైర్యంగా ఉన్న తను డీలా పడిపోయింది. ఇంట్లో ఒప్పుకోరేమో అని ఏడవడం మొదలు పెట్టింది. ఒక్కడిని వెళ్లి అడగడానికి నాకూ ధైర్యం చాల్లేదు. ఈలోపు మా ప్రేమ విషయం పెద్దలకి ఎలాగైనా తెలిసి, వాళ్లే పిలిచి ఆశీర్వదిస్తారేమో అని ఆశించాం. మా దురదృష్టంకొద్దీ ఏ అద్భుతమూ జరగలేదు.
చాలారోజులు ఏడ్చాం. తర్వాత మా మనసులకు అయిన గాయాలకు కాలమే మందు వేయసాగింది. ప్రాక్టికల్‌గా ఆలోచించి చివరికి ఎవరి దారి వాళ్లం చూసుకోవాలనుకున్నాం. కానీ సంవత్సరాలు గడుస్తున్నా.. మేం కలిసి ఉన్న నాటి జ్ఞాపకాలు ఇంకా ముళ్లలా గుచ్చుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పదలచుకుంది ఏంటంటే.. పిరికివాళ్లకు ప్రేమలో పడే హక్కు లేదు. అందులో విఫలమైతే జీవితాంతం ఏడవొద్దు.
సుబ్బు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్
-
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు
-
Paris: బీచ్‌లు, పార్కుల్లో ధూమపానంపై నిషేధం!