ఎసెమ్మెస్‌ ప్రేమలో.. ఎన్ని మజిలీలో!

‘మిస్డ్‌కాల్‌ ప్రేమలు.. ఆన్‌లైన్‌ లవ్‌ అంతా ట్రాష్‌.. అదొట్టి ఆకర్షణే. అసలు ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరెలాంటివారో తెలుసుకోకుండా ప్రేమలో ఎలా పడతారు?’

Updated : 20 Jan 2024 06:52 IST

‘మిస్డ్‌కాల్‌ ప్రేమలు.. ఆన్‌లైన్‌ లవ్‌ అంతా ట్రాష్‌.. అదొట్టి ఆకర్షణే. అసలు ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరెలాంటివారో తెలుసుకోకుండా ప్రేమలో ఎలా పడతారు?’ అని నా సందేహం. అలా ఎప్పటికీ చేయొద్దు అనుకునేదాన్ని. కానీ జరిగింది అదే.

నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మాది. వెటర్నరీ డిప్లొమా చేయడానికి కరీంనగర్‌ కాలేజీలో చేరాను. కోర్సు పూర్తయ్యాక వరంగల్‌లో నెలరోజులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడో అమ్మాయి పరిచయమైంది. ఈ కొద్ది సమయంలోనే మేం మంచి స్నేహితులమయ్యాం. తర్వాత సొంతూళ్లు తిరిగెళ్లాం.

‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో..’ పాట వింటూ తన్మయత్వంలో ఉన్నానారోజు. దాన్ని డిస్ట్రబ్‌ చేస్తూ ‘హాయ్‌’ అంటూ నా ఫోన్‌కి ఓ మెసేజ్‌. అదీ తెలియని ఫోన్‌ నెంబర్‌ నుంచి. పట్టించుకోలేదు. రోజులు, వారాలు, నెలలు.. ఇదేవరస. ‘హై’, ‘గుడ్‌ మార్నింగ్‌’, ‘గుడ్‌ నైట్‌’ అంటూ సందేశాల వరద. చిరాకొచ్చేది. ఓసారి నా ఫ్రెండ్‌తో ఈ విషయం చెప్పా. ఆ నెంబర్‌ చూసి ‘తను వెంకీనే.. నా ఫ్రెండే. మనలాగే వెటర్నరీ కోర్సు చేశాడు. చాలా మంచోడు’ అంది. మేం కలిసి ఉన్నప్పుడు ఓసారి నన్ను చూశాడట. నా వివరాలు అడిగాడట. సరేలే ఓ ఎసెమ్మెస్‌ చేస్తే పోయేదేం ఉందని రిప్లై ఇచ్చా. ఎగిరి గంతేశాడు. తర్వాత ప్రతి సందేశానికి ఓ నవ్వు ఎమోజీ జోడించేవాడు. కొన్నాళ్లకి లవ్‌ సింబల్‌ది కూడా. తన తీరు బాగుండేది. మాటలు హద్దుల్లోనే ఉండేవి. ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశలు.. అన్నీ పంచుకునేవాళ్లం. వయసు ప్రభావమో.. అతడిపై ఇష్టమో.. రోజూ తన ఎసెమ్మెస్‌ కోసం ఎదురుచూసే స్థితికి చేరా. తను లేని జీవితం ఊహించుకోలేకపోయా. అందుకే అమ్మాయినైనా నేనే ఓరోజు ‘ఐ లవ్యూ చిన్నా’ అని చెప్పేశా. నేనూ ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నా అన్నాడు. ఆపై మా ప్రేమ ప్రయాణం మూడేళ్లు సాగింది. ఫోన్‌ చేసుకోకుండా.. బయట కలుసుకోకుండా.. కేవలం చాటింగ్‌ ద్వారానే.

 కొన్నాళ్లకి ఇంట్లోవాళ్లు నా పెళ్లి చేస్తామన్నారు. నా జీవితంలో వెంకీకి తప్ప మరొకరికి చోటు లేదు. ఆ మాట ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. చెప్పినా.. మా సామాజికవర్గాలు వేరు కావడంతో ఒప్పుకుంటారనే నమ్మకమూ లేదు. నీ దగ్గరికొచ్చేస్తానని వెంకీతో చెప్పా. ‘వెల్‌కమ్‌.. ఎదురుచూస్తూ ఉంటా’ అన్నాడు. కరీంనగర్‌లోని ఓ బస్టాప్‌లో దిగా. మనసులో ఓ రకమైన ఉద్విగ్నత. తననెలా గుర్తు పట్టాలో తెలియదు. ఎందరో అబ్బాయిలు వస్తూ, వెళ్తూ ఉన్నారు. నా కళ్లు అందర్నీ చూస్తున్నాయిగానీ.. మనసు మాత్రం వెంకీ కోసం వెతుకుతోంది. నా గుండెలో కొలువైన మనిషి కోసం అన్వేషిస్తోంది. ఓ పది నిమిషాలయ్యాక.. ఒక చేయి నన్ను తాకింది. ఆ స్పర్శతో పులకించిపోయాను. సంతోషంతో నా కళ్ల వెంట నీళ్లు. నా దగ్గరగా వచ్చాడు తను. ఆ దగ్గరితనం జీవితాంతం ఉండాలనుకున్నా. తర్వాత వాళ్లింటికి తీసుకెళ్లాడు. వాళ్ల పిన్ని, అన్నయ్య.. కొద్దిమంది సమక్షంలో మా పెళ్లి జరిపించారు. చూస్తుండగానే నాలుగేళ్లు గడిచాయి. ఈ కాలంలో మా మధ్య ప్రేమ పెరిగిందేగానీ.. చిన్న మనస్పర్థ కూడా రాలేదు. అప్పటికే మేం ఉద్యోగాల్లో స్థిరపడ్డా.. నాకు పోలీసు కావాలని ఉండేది. పరీక్షలు రాశా. నా కలలు నిజమై, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. తను వెటర్నరీ ఉద్యోగి. అన్నట్టు చిలకాగోరింకల్లా ఉన్న మా జీవితాల్లోకి ఇంకో సంతోషం వచ్చి చేరింది. వాడే మా అబ్బాయి రిషివర్ధన్‌. జీవితం నేను ఊహించిన దానికంటే హాయిగా సాగిపోతోంది. ఆలోచిస్తుంటేే.. ఇప్పటికీ ఇదొక మిరకిల్‌లాగే ఉంది.                               

 -స్నేహలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని