Manasulo Maata: కడదాకా నీ వెంటే ఉంటా..

కల్మషం లేని అమ్మాయి కష్టాల పాలైంది. మంచి మనసున్నా మనువు బంధంలో దగా పడింది. ఆమె ఆరాధించే స్నేహితుడేం చేశాడు?

Updated : 28 Oct 2023 08:54 IST

కల్మషం లేని అమ్మాయి కష్టాల పాలైంది. మంచి మనసున్నా మనువు బంధంలో దగా పడింది. ఆమె ఆరాధించే స్నేహితుడేం చేశాడు?

తనది పచ్చందాల కోనసీమ. నాది పోరాటాల ఓరుగల్లు. చదువులమ్మ ఒడిలో కలిశాం మేం. ఎన్నడూ కలవని రైలు పట్టాల్లా ఉండేవి మా అభిప్రాయాలు. నేను నిప్పు అయితే తను ఉప్పు. ఎప్పుడూ చిటపటలే. సినిమాలు.. రాజకీయాలు.. ప్రేమ.. ప్రతిదాంట్లో భిన్న వాదనలే. ఆ గిల్లికజ్జాలు పక్కన పెడితే.. తన సాయం చేసే గుణం నన్నాకట్టుకునేది. చదువులో నా తెలివితేటలు తనని కట్టిపడేసేవి. ఒకర్నొకరం తిట్టుకుంటూ.. మెచ్చుకుంటూ బీటెక్‌ పూర్తి చేశాం. ‘రేయ్‌.. హరీష్‌.. మనం ఎక్కడున్నా మన స్నేహం ఇలాగే కొనసాగాలి’ అంది చేతిలో చేయేసి. ‘ష్యూర్‌’ అన్నా. తర్వాత తనూరెళ్లిపోయింది. నేను కొలువులో చేరా. ఓ ఆర్నెల్లు బాగానే ఉన్నాం. తర్వాత సడెన్‌గా తన నుంచి ఎలాంటి కబురూ లేదు. ఫోన్‌ నెంబర్‌ పని చేయలేదు. ఆన్‌లైన్‌లోనూ కనుమరుగైంది. వెతికివెతికి విసిగిపోయా.

మళ్లీ మూడేళ్ల తర్వాత మా ఆఫీసులోనే ప్రత్యక్షమైంది.. నాకు జూనియర్‌గా. నన్ను చూడగానే సునామీలా వచ్చి చుట్టేస్తుందనుకున్నా. అదేం జరగలేదు. నేనే వెళ్లి పలకరిస్తే నీరసంగా బదులిచ్చింది. ‘ఇన్నాళ్లు ఏమైపోయావ్‌?’, ‘ఎక్కడున్నావ్‌?’ నా ప్రశ్నల్ని మధ్యలోనే తుంచేస్తూ ‘తర్వాత చెబుతాలేరా’ అంటూ దాటవేసింది. గమనిస్తూనే ఉన్నా. మునుపటిలా.. తనలో మాటల గోదావరి గలగలలు లేవు. నేనే నెగ్గాలనే పంతమూ కనపడలేదు. పని ఉంటేనే పలకరించేది. ఒకట్రెండు మాటల్తో ముగించేది. తనెందుకిలా మారిందో తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలైంది నాలో. అనుసరించడం మొదలెట్టా. ప్రతి ఆదివారం ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ వెళ్లేది. తన ఈడు వాళ్లంతా.. పార్కులో సరదాలు.. ఆనందాలు వెతుక్కుంటుంటే.. తనేమో పార్కు బయట అడుక్కునే పిల్లల్ని పట్టించుకునేది. తినుబండారాలు, బుడగలు.. ఏవేవో కొనిపెట్టేది. వాళ్లతో సాయంత్రాల దాకా ఆడుకునేది. వీలైతే.. కొన్ని అక్షరాల్ని వాళ్ల మెదళ్లలోకి ఎక్కించేది. ఇక జీతం రాగానే ఆఫీసులోని అటెండరు.. సెక్యూరిటీ గార్డు.. ఆయమ్మలకు ఠంఛనుగా కొంత మొత్తం ఇచ్చేసేది. వాళ్ల ద్వారానే తెలిసింది. ఓ అనాథ అమ్మాయినీ చదివిస్తోందని. ఆ క్షణం.. నా దృష్టిలో ఎవరెస్ట్‌ శిఖరంలా కనిపించింది. ఉండబట్టలేక ఓసారి అడిగా. ‘నీకొచ్చే జీతం మొత్తం దానధర్మాలకే వెచ్చిస్తావా.. నీకంటూ ఏమీ మిగుల్చుకోవా?’ అని. చిన్నగా నవ్వి.. విద్యుత్తు దీపాలతో అలంకరించిన ఓ బంగ్లాను చూపించింది. ‘పరిసరాలు వెలిగిపోవాలని మనం అలా ప్రతి పండక్కి ఇల్లు, ఆఫీసుల్ని ముస్తాబు చేస్తాం. కానీ మన పక్కనే ఉన్నవారి జీవితాల్లోని చీకట్లు చూడలేం. అవి తొలగించినప్పుడే కదరా అసలైన పండగ..’ అంటుంటే.. నాకో అద్భుతంలాగే అనిపించింది.

నాకే కాదు.. తన మంచితనం, పనితనంతో ఆఫీసులో అందరికీ దగ్గరవుతుంటే.. గర్వంగా అనిపించేది. తను నా క్లాస్‌మేట్‌ అని గొప్పగా చెప్పుకునేవాడిని. రోజురోజుకీ ఆ ఇష్టం పెరిగిపోయి.. తనని తప్ప మరెవర్నీ పెళ్లి చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చా. నిజానికి తను నాకు కాలేజీ రోజుల నుంచే ఇష్టం. కానీ మా సంప్రదాయాలు.. ప్రాంతాలు.. సామాజికవర్గాలు వేరు. అందుకే ధైర్యం చేయలేకపోయా. ఇప్పుడు ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. పరిణతి చెందిన మనుషులం. అదే భరోసాతో వెళ్లి అడిగా. తన మొహంలో ఓ నిర్జీవమైన నవ్వు.. రెండు క్షణాలాగి.. ‘పదా.. అలా బయటికెళ్లొద్దాం’ అంది. బస్టాపులోకి నడిచాం. ‘ఇంతకీ నాలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్‌? నేనేం పెద్ద అందగత్తెను కాదుగా’ అంది. ‘నాకు అందం కాదు.. మనసు ముఖ్యం. నీ మంచితనం...’ నా మాటలింకా పూర్తి కానేలేదు. ‘రెండేళ్ల కిందట ఇదే మాట చెప్పాడొకడు. వెంటపడ్డాడు.. ప్రేమించానన్నాడు. నువ్వులేని జీవితం నాకొద్దన్నాడు. నాదసలే జాలి గుండె కదా.. కరిగిపోయా! వాడి ప్రేమకు తలాడించా. నా ప్రతి పనీ సబబుగానే ఉంటుందని మా వాళ్లకి అతి నమ్మకం. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే ఓకే చెప్పారు. పెళ్లై ఆరునెలలు గడవకముందే వాడి అసలు నైజం బయటికొచ్చింది. వ్యాపారం చేస్తానన్నాడు. నాకు నగలు చేయిస్తానన్నాడు. ఆ ఖర్చూ ఈ ఖర్చూ అన్నాడు. దాదాపు ఇరవై లక్షల దాకా వాడి చేతిలో పోశారు నాన్న. మొత్తం మింగేశాడు. పైగా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. అన్నింటికన్నా ఘోరం.. వాడికి ఇంతకుముందే వేరే అమ్మాయితో పెళ్లైంది. ఆ విషయం తెలిశాక ఇంకా రాజీ పడలేక విడాకులు తీసుకున్నా’ చెప్పడం పూర్తయ్యేసరికి తన కళ్లలో తడి. బయట బస్సుల రొదలాగే నా గుండెల్లో గందరగోళం.

ఆ రాత్రి నా కనురెప్ప వాలలేదు. ‘ఆ మోసగాడిని నా జీవితంలోంచి తరిమేసినందుకు హ్యాపీగానే ఉన్నా. నువ్వో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలన్నదే ఫ్రెండ్‌గా నా కోరిక’ తను చెప్పిన ఈ మాటలే పదేపదే గుర్తొచ్చాయి. బాగా ఆలోచించాక ఓ నిర్ణయానికొచ్చా. తనే నా అర్ధాంగి అని ఫిక్స్‌ అయ్యా. తనపై జాలితో తీసుకున్న నిర్ణయం కాదది. బాగా చదువుకున్న, మంచి మనసున్న అమ్మాయి నా జీవితంలోకి రావాలనేది నా కోరిక. ఆ లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. ఇక తన జీవితంలో జరిగిన ఆ సంఘటన దురదృష్టకరం.. తన ప్రమేయం లేనిది. ఇదే మాట చెప్పి, ఆ మంచి మనసున్న అమ్మాయిని మనువాడాలనుకుంటున్నా. తను సానుకూలంగా స్పందిస్తుందనే అనుకుంటున్నా.
హరీష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని