ఈ కన్నీటి వరదకు అడ్డుకట్ట ఎప్పుడో..?

ఈమధ్యే చదివా.. ప్రేమించిన అబ్బాయితో తమ కూతురు వెళ్లిపోవడం తట్టుకోలేక ఓ తల్లి ఉరేసుకోవడం. డబ్బు కోసం కన్నతండ్రినే ఒకబ్బాయి కడతేర్చిన ఘోరం.

Updated : 07 Oct 2023 07:14 IST

ఈమధ్యే చదివా.. ప్రేమించిన అబ్బాయితో తమ కూతురు వెళ్లిపోవడం తట్టుకోలేక ఓ తల్లి ఉరేసుకోవడం. డబ్బు కోసం కన్నతండ్రినే ఒకబ్బాయి కడతేర్చిన ఘోరం. ఇలాంటివి వింటుంటే.. మనసు భగ్గుమంటుంది. వాళ్లకేం తెలుసు? అమ్మానాన్నలు లేని జీవితం ఎంత నరకమోనని, కన్నవాళ్లని కనిపించే దైవాలుగా భావించడం పిల్లల బాధ్యతని. ఇరవై ఏళ్లుగా నేను అనుభవిస్తున్న బాధ చదివాకైనా.. వాళ్లు మారతారని ఆశిస్తున్నా.

అప్పుడు నాకు మూడేళ్లు. చెల్లి పదకొండు నెలల పసిపాప. ఓరోజు అమ్మ మమ్మల్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తోంది. ‘పిల్లల్ని బయటకు తీసుకెళ్లండి’ అంటున్నారెవరో. అది విని మమ్మల్ని మరింత దగ్గరికి లాక్కుంటూ.. ‘మన కోసం మీ నాన్నని రమ్మని చెప్పమ్మా’ అని గుండెలు బాదుకుంటోంది. అచేతనంగా ఉన్నారు నాన్న. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదో, నా చిట్టిబుర్రకు అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉన్నా. కాసేపటికి మొత్తం పూల దండలతో నిండిపోయారాయన. ‘చిట్టితల్లీ.. మీ నాన్న చచ్చిపోయారు’ అన్నారో బంధువు నాతో. తర్వాత నాన్న మళ్లీ కనపడలేదు.

ఇది మర్చిపోకముందే మరో విషాదం. నాన్న దూరమైన బాధలో నన్ను, చెల్లిని అమ్మ పట్టించుకోవడం లేదని మమ్మల్ని ట్యూషన్‌లో పెట్టింది నానమ్మ. ఓరోజు అక్కడ్నుంచి తిరిగొచ్చి ఎప్పట్లాగే అమాంతం అమ్మ కౌగిలిలో వాలిపోవాలనుకున్నా. ఎంత పిలిచినా అమ్మ తలుపు తీయట్లేదు. నా ఏడుపు విని నానమ్మ పరుగెత్తుకొచ్చింది. తర్వాత తలుపులు బద్దలు కొట్టారు. నానమ్మ అమ్మను చూసి గట్టిగా అరిచింది.. ఏడ్చింది. జనమంతా గుమిగూడారు. అమ్మా.. నాన్నలాగే పడి ఉంది. ఆయన ఎడబాటు తట్టుకోలేక ఉరేసుకుందట. నాన్న చనిపోయిన 21వ రోజు మమ్మల్ని వదిలేసి, ఆయన దగ్గరికి వెళ్లిపోయింది.

అమ్మానాన్నా కనిపించక మాకు చాలా దిగులుగా ఉండేది. తనూ వెళ్లిపోతే మమ్మల్ని చూసేవాళ్లుండరని.. మా నాన్న తమ్ముడికి, అమ్మ చెల్లినిచ్చి పెళ్లి చేసింది నానమ్మ. వరుసకి బాబాయి, పిన్ని అయినా.. వాళ్లే మా అమ్మానాన్నలయ్యారు. మాకోసం పిల్లల్ని కూడా వద్దనుకున్నారట. నానమ్మే బలవంతం చేయడంతో వాళ్లకో బాబు పుట్టాడు. అంటే మాకో బుల్లి తమ్ముడు వచ్చాడన్నమాట.
అంతా బాగానే ఉండేది.. అయినా ఏదో చెప్పలేని వెలితి. ముఖ్యంగా ఎవరైనా మీ అమ్మానాన్నలు చచ్చిపోయారని అంటుంటే.. ఏడుపు ఆగకపోయేది. వాళ్ల జ్ఞాపకాలు మమ్మల్ని బాధించకుండా.. పిన్నీబాబాయిలు చాలానే ప్రయత్నించేవాళ్లు. ఇంట్లో టీవీపైన అమ్మనాన్నల ఫొటో ఒకటి ఉండేది. టీవీ చూస్తూ తినడం అలవాటు కదా.. అలా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు తెలికుండానే నా కళ్లు ఆ ఫొటోపైకి మళ్లేవి. నోట్లో పెట్టుకున్న అన్నం ముద్దకు గొంతులోని బాధ అడ్డు పడేది. గుండెల్ని చీల్చుకొని వచ్చిన కన్నీళ్లు నా చెక్కిలిపై జారేవి. ఇంట్లో వాళ్లు ‘ఏమైంది ఏమైంది?’ అని ఆతృతగా అడిగేవాళ్లు. ఏం చెప్పను?

రాత్రీపగలు గడుస్తున్నాయి. రోజులు ఏళ్లవుతున్నాయి. నా కన్నీటి జ్ఞాపకాల చెమ్మ మాత్రం ఆరడం లేదు. అమ్మ బతికి ఉంటే మమ్మల్ని ఏ ముద్దు పేర్లతో పిలిచేది? మేం పెద్దమనిషి అయితే ఇరుగూపొరుగుని పిలిచి ఎంత హడావుడి చేసేది? పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బాగా ముస్తాబు చేసేదేమో! అందరిలాగే నాన్న తన చిటికెన వేలు పట్టుకొని మమ్మల్ని బడికి తీసుకెళ్లేవారా? మేం బాగా చదివితే, జీవితంలో ఎదిగితే.. గుండెలకు హత్తుకొనేవారా? ఎప్పుడూ ఇవే మనసుని తొలిచేస్తూనే ఉన్నాయి. పోనీ అమ్మానాన్నలతో గడిపిన సంతోష క్షణాలేమైనా గుర్తు చేసుకుందామంటే, ఒక్కటీ లేదాయే! ‘మీ నాన్నను మన కోసం రమ్మను’ అన్న అమ్మ ఏడుపు.. పూలదండల్లో ఒరిగిపోయిన నాన్న శరీరం తప్ప.

ఎన్నాళ్లిలా? ఎంతవరకిలా? చాలాసార్లు ప్రశ్నించుకున్నా. వయసు తెచ్చిన పెద్దరికమో.. మాలాంటి వాళ్లు ఈ ప్రపంచంలో కోకొల్లలు అనే వాస్తవం గ్రహించడమో.. మెల్లగా నాలోనూ మార్పు మొదలైంది. నాకు నేనే ధైర్యమయ్యా. నన్ను నేనే ఓదార్చుకున్నా. కానీ ఎంత ప్రయత్నించినా.. అప్పుడప్పుడు పాత రోజులు జడివానలా చుట్టేస్తుంటాయి. నా మనసుని కన్నీటి వరదలో ముంచేస్తుంటాయి. దీనికి అడ్డుకట్ట పడేదెప్పుడో? బహుశా నేను అమ్మానాన్నల్ని చేరేదాకా అనుకుంటా! కానీ.. నేను మా అమ్మలా కాదు. ఎన్ని కష్టాలొచ్చినా జీవితంతో పోరాడుతూనే ఉంటా.
విమల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని