ఎలా చెప్పను? ఆ పేరు వెనక కథని..

అందరి ప్రేమ స్నేహంతో మొదలైతే.. నా ప్రేమ మౌనంతో పట్టాలెక్కింది. తను నా క్లాస్‌మేట్‌ చిన్నా. కారణం తెలీదు.. తనకి ఫిదా అయిపోయాను. నేను తనని చాటుమాటుగా చూస్తుంటే..

Updated : 17 Feb 2024 06:59 IST

అందరూ ఆకర్షణ అన్నారు. ‘కాదు ప్రేమే’ అని నమ్మాన్నేను. నా నమ్మకమే నిజమైంది. కానీ ఆ ప్రేమ ఇప్పుడు నా సొంతం కాదు. లేత ప్రాయంలో మొదలైన నా ప్రేమ.. పెళ్లికి చేరువ కాలేకపోయింది. అయినా అతడి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో పదిలంగానే ఉన్నాయి.

అందరి ప్రేమ స్నేహంతో మొదలైతే.. నా ప్రేమ మౌనంతో పట్టాలెక్కింది. తను నా క్లాస్‌మేట్‌ చిన్నా. కారణం తెలీదు.. తనకి ఫిదా అయిపోయాను. నేను తనని చాటుమాటుగా చూస్తుంటే.. తన కళ్లు నాకోసం వెతికేవి. చూపులు కలుసుకున్నవేళ మా గుండెల్లో కలవరం చెలరేగేది. మనసులు మాట్లాడుకునేవి.
పదికొచ్చేశాం. తను తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. కనిపించని రోజు ప్రాణం గింజుకునేది. కనిపిస్తే.. పండగే. ఓసారి తన పుట్టినరోజని తెలిసింది. మాట్లాడాలని మనసు పోరు పెట్టింది. అతడి ఫ్రెండ్‌ దగ్గర నంబర్‌ తీసుకున్నా. ఎన్నో కబుర్లు చెప్పాలని కాల్‌ చేశా. ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ చిన్నా’ అని మాత్రం అనగలిగా. అప్పట్నుంచి ఫోన్‌ కబుర్లు తర్జుమా అయ్యేవి. పది పూర్తై వెళ్లిపోతుంటే ఎందుకో తెలియదు.. ‘ఇంక నాకు నువ్వు ఫోన్‌ చేయొద్దు’ అన్నాడు. కన్నీళ్లాగలేదు. అలా మా మధ్య దూరం పెరిగింది. మాటలు తగ్గాయి. కొద్దిరోజులకు నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి ‘నీతో మాట్లాడకుండా చిన్నా ఉండలేకపోతున్నాడట. వీలైతే ఓసారి కాల్‌ చెయ్‌’ అంది. ప్రాణం లేచొచ్చింది. మోడు వారింది అనుకున్న ప్రేమ మళ్లీ చిగుళ్లు వేసింది. అప్పట్నుంచి మా మధ్య మౌనం కనుమరుగైంది. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యేదాక మాట్లాడుకునేవాళ్లం.
కాలం గడుస్తోంది. మా చదువులు సాగుతున్నాయి. పెళ్లీడుకొచ్చేశాం. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌. ‘నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నా. నన్ను మర్చిపో’ అన్నాడోసారి సడెన్‌గా. నా గుండె ముక్కలైంది. దాదాపు పదేళ్ల ఇష్టం.. తను నా సొంతం అనే నమ్మకం.. ఎలా వదులుకోను? కుదరదన్నాను. ‘నా మనసులో ఆ అమ్మాయే ఉంది’ అన్నాడు. నాకూ కొంచెం చోటివ్వమని బతిమాలాను. నేను నచ్చలేదన్నాడు. వెంటపడి వేధించకన్నాడు. ఆత్మాభిమానం చంపుకొని మరీ కనీసం రెండో భార్యగానైనా ఉండనివ్వమన్నాను. నాకు పిచ్చి పట్టిందన్నారు తెలిసినవాళ్లు. నిజమే! తనంటే పిచ్చిలాగే ఉండేది. అదే సమయంలో నాకో పెళ్లి సంబంధం వచ్చింది. ఈ విషయం చెబితేనైనా కరుగుతాడనుకున్నా. ‘అసలు నువ్వెవరు? నీకు సంబంధం వస్తే నాకేంటి?’ అంటూ బూతులు తిట్టాడు. ఓపికకైనా హద్దుంటుందిగా! నా ప్రేమ అనే చెరసాల నుంచి చిన్నా అనే ఖైదీని విడుదల చేయాలనుకున్నా. తనకి ఫోన్‌ చేసి విసిగించడం మానేశా. కానీ ప్రేమించడం కాదు.
సరిగ్గా రెండేళ్ల తర్వాత తనే ఫోన్‌ చేశాడు. నా గుండెలో వణుకు మొదలైంది. తప్పు చేశానన్నాడు. నేను కావాలన్నాడు. ‘అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం’ అన్నాడు. ఒకప్పుడు తనకోసం నేను ఎంత తపించానో.. అంతకన్నా రెట్టింపు ఆత్రం తనలో. ఎందుకిలా మారాడో తెలియదు. తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైంది. చివరికి ‘ఒక్కసారి కలుద్దాం’ అన్నాడు. వెళ్లాను. నన్ను చూడగానే తన కళ్లు జలపాతాలయ్యాయి. నేనూ కరిగిపోయాను. కొద్దిసేపు మా మధ్య నిశ్శబ్దం. తర్వాత ఏవో కొన్ని మాటలు. వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఎవరిది తప్పో తెలియదు.. విధి మమ్మల్ని విడదీసింది. కానీ మా మధ్య అల్లుకున్న జ్ఞాపకాల్ని దూరం చేయలేకపోయింది. ఇప్పటికీ మా ఊరెళితే నా కళ్లు తన కోసం వెతుకుతూనే ఉంటాయి. నా చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి నా కొడుకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు.. ‘అమ్మా నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకు?’ అని. తనకి ఎలా చెప్పను? వాడికి ‘చిన్నా’ అనే పేరు ఎందుకు పెట్టానో..!

హనీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని