Manasulo Maata: ఆమె చేయిస్తే.. ఈమె చేయందుకుంది

మంద్రంగా వినిపిస్తున్న గుడి గంటల చప్పుడు.. పక్కనే నిశ్చలమైన కోనేరు.. చెట్లపై పక్షుల కిలకిలారావాలు.. ఆ సాయంత్రం వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అయినా నా గుండెలో అల్లకల్లోలం చెలరేగుతోంది. నా భవిష్యత్తు నిర్ణయించడానికి ఒకమ్మాయి వస్తోంది మరి! చెప్పాలంటే అది నా పెళ్లిచూపుల సందర్భం. పెద్దలే ఏర్పాటు చేశారు.

Updated : 02 Dec 2023 10:12 IST

మంద్రంగా వినిపిస్తున్న గుడి గంటల చప్పుడు.. పక్కనే నిశ్చలమైన కోనేరు.. చెట్లపై పక్షుల కిలకిలారావాలు.. ఆ సాయంత్రం వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అయినా నా గుండెలో అల్లకల్లోలం చెలరేగుతోంది. నా భవిష్యత్తు నిర్ణయించడానికి ఒకమ్మాయి వస్తోంది మరి! చెప్పాలంటే అది నా పెళ్లిచూపుల సందర్భం. పెద్దలే ఏర్పాటు చేశారు. తనతో ఎలా మాట కలపాలి? ఏమడగాలి? ఆమెకి నచ్చుతానో, లేదో..? ఈ సందేహాలతో బుర్ర తిరిగిపోతోంది. ఆ ఆలోచనల్లో ఉండగానే కారు దిగిందామె. భువి నుంచి దివికి వచ్చిన అప్సరసలా. చిలకాకుపచ్చ రంగు చీరలో మెరిసిపోతోంది. నన్ను సమీపిస్తున్నకొద్దీ గుండె వేగం రెట్టింపవుతోంది. అలా గుడ్లప్పగించి చూస్తుండగా.. సరాసరి నా దగ్గరికొచ్చి ‘హలో మాస్టారూ.. ఇక్కడే ఉన్నారా?’ అంది. నా ఆందోళనని మటుమాయం చేస్తూ చొరవగా మాట్లాడింది. పది నిమిషాలు అనుకుంటే.. కబుర్లతో గంట కరిగిపోయింది. కాలం ఆగిపోయి.. తను అక్కడే నా సొంతమైతే బాగుండు అనిపించింది.

‘మీరు నాకు బాగా నచ్చారు.. మరి నేనో..?’ నా ప్రశ్నకి ఇంటికెళ్లాక సమాధానం చెబుతానంది. ఉసూరుమన్నా. ఆరోజే కాదు.. మర్నాడు.. వారాలు గడిచినా తన గొంతు నన్ను చేరలేదు. అదే బాధలో ఉన్న నాకు మంచి కంపెనీ నుంచి జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ రావడం కొంత ఊరటనిచ్చింది. అదీ కొంతకాలమే. ఆఫీసులో చేరిన తర్వాత మళ్లీ ఆమె ఆలోచనలే వెంటాడేవి. అక్కడ ఏ అమ్మాయిని చూసినా తనే గుర్తొచ్చేది. ఓరోజు మా టీమ్‌లో కొత్త అమ్మాయి చేరింది. అచ్చం తనలాగే ఉండేది. తనని తాను జాహ్నవిగా పరిచయం చేసుకుంది. అందరితో కలిసిపోయే తను నాతో మరింత క్లోజ్‌గా ఉండేది. ఎంతలా అంటే.. తన షాపింగ్‌, సరదాలు, సంతోషాలు, బాధలు పంచుకోవడాలు.. అన్నిచోట్లా నేను ఉండాల్సిందే. అయితే ఒక్కోసారి నేను పరధ్యానంగా ఉండటం తను గమనించింది. ‘ఏంటీ.. ఒక్కోసారి ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తావు.. ప్రేమ ఫెయిల్యూరా?’ అందోసారి. నా పెళ్లిచూపుల ప్రేమ.. తనని మర్చిపోలేక పడుతున్న వేదన తన ముందుంచా. ‘హ్మ్‌.. ఈమాత్రానికేనా ఇంత బాధ? నీలాంటి మంచి అబ్బాయిని వదులుకున్నందుకు తనది బ్యాడ్‌లక్‌’ అంది. నా బాధ కొంచెం తగ్గింది.

కొన్నాళ్లకే జాహ్నవి పుట్టినరోజు వచ్చింది. రాత్రి 12కి ఫోన్‌ చేసి విష్‌ చేశా. ‘నీ కాల్‌ వస్తుందని ఊహించా. దానికోసమే ఎదురు చూస్తున్నా. ఆలస్యం చేయకుండా ఓ మాట చెప్పనా.. నువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందామా?’ అనడంతో నాకు షాక్‌. మౌనమే నా సమాధానం కావడంతో తనే మళ్లీ అందుకుంది. ‘నువ్వో అమ్మాయిని ఇష్టపడుతున్నావని తెలుసు. కానీ.. ఆ గతం నుంచి బయటికొస్తేనే నీ వర్తమానం బాగుంటదనుకుంటున్నా’ అంటూ పెట్టేసింది. తన మాటలు నిజంగానే నా కళ్లు తెరిపించాయి. నేను కోరుకున్న అమ్మాయి దక్కనప్పుడు నన్ను కోరుకున్న అమ్మాయిని కాదనుకోవడం సరికాదనిపించింది. ఇంట్లోవాళ్లని ఒప్పించి తొందర్లోనే మేం ఆలుమగలమయ్యాం.

హైదరాబాద్‌ వచ్చి ఇద్దరం ఒకే కంపెనీలో చేరాం. ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉంటున్నాం. ఓరోజు మేం రెస్టరంట్‌లో ఉండగా నా పెళ్లిచూపుల అమ్మాయి కనపడింది.. చేతిలో ఓ పాపతో. పాత జ్ఞాపకాలన్నీ చుట్టుముట్టడంతో నా మొహం చిన్నబోయింది. జాహ్నవి గమనించింది. ‘తనతో ఒకసారి మాట్లాడు. చేదు జ్ఞాపకాలన్నీ తుడిచేసుకొనిరా’ అంది. ఆమె దగ్గరికెళ్లి నేరుగా విషయంలోకి వెళ్లా. ‘ఎందుకు ఆనాడు ఏ సమాధానమూ చెప్పలేదు. కనీసం నచ్చలేదని చెప్పినా మీకోసం ఎదురుచూసేవాడిని కాదు కదా’ అన్నా. కాసేపు అలాగే చూసి ఓ నిట్టూర్పు విడిచింది. ‘మీరు నాకూ నచ్చారు. కానీ సంపాదన తక్కువనీ.. నన్ను బాగా చూసుకోలేరని మావాళ్లు చెప్పారు. అంతే..’ చాలా క్యాజువల్‌గా చెప్పి వెళ్లిపోయింది. తనకోసం నేను ఎంత ఆలోచించాను. ఎంత పరితపించాను. దాదాపు ఏడాదిన్నర బాధ పడ్డాను. తనేమో అదసలు పెద్ద విషయమే కాదన్నట్టుగా ఉంది. ఆ క్షణం నాపై నాకే సిగ్గేసింది. ఇలాంటి అమ్మాయి కోసమా ఇంత బాధ పడిందీ అని. నన్నెంతో అర్థం చేసుకునే జాహ్నని నా దృష్టిలో మరింత ఎత్తుకు ఎదిగింది. తనని ఎప్పటికీ కష్టపెట్టకూడదని, అపురూపంగా చూసుకోవాలని తన చేయందుకున్నా.

ప్రసాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని