ప్రేమలో మునిగి.. జీవితం చేజారి

చలాకీగా కనిపించే ఏ టీనేజీ అమ్మాయిని చూసినా నా గతం నన్ను జ్ఞాపకాల్లోకి లాక్కెళ్తుంది. నా చెక్కిలిపై కన్నీటి చుక్కలు రాల్చేలా చేస్తుంది. ఎందుకిలా అంటే నా కథ వినాల్సిందే.

Updated : 30 Mar 2024 07:09 IST

చలాకీగా కనిపించే ఏ టీనేజీ అమ్మాయిని చూసినా నా గతం నన్ను జ్ఞాపకాల్లోకి లాక్కెళ్తుంది. నా చెక్కిలిపై కన్నీటి చుక్కలు రాల్చేలా చేస్తుంది. ఎందుకిలా అంటే నా కథ వినాల్సిందే.

నేను మంచి మార్కులతో పది పాసైనప్పుడు ఇంట్లో పెద్ద పండగే చేశారు. అప్పుడే, బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానని నాన్నకి మాటిచ్చా. తర్వాత ట్రిపుల్‌ ఐటీలో సీటొచ్చింది. కానీ.. అక్కడి వాతావరణం నచ్చక.. అమ్మానాన్నల్ని వదిలి ఉండలేక తిరిగొచ్చేశా. సొంతూరులోనే ఇంటర్లో చేరా. కొన్నాళ్లయ్యాక ఓసారి మా బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్లాం. అక్కడే నన్నో అబ్బాయి చూశాడట. తనకి తొలి చూపులోనే నచ్చేశానని ఇంటిదాకా వచ్చేశాడు. ‘నువ్వు ఎంతలా మాయ చేశావో తెలుసా? నిన్ను చూసిన దగ్గర్నుంచి నాకు నిద్రే లేదంటే నమ్ము’ అంటుంటే నా మనసులో ఏదో గందరగోళం. ఎలా స్పందించాలో తెలియక అక్కడ్నుంచి పారిపోయా. అయినా ఆ అబ్బాయి వదల్లేదు. వెంటపడేవాడు. నన్ను పొగుడుతూ ఏవేవో కబుర్లు చెప్పేవాడు. ఆ మాటలకు మెల్లమెల్లగా నాలోనూ అలజడి మొదలైంది. అతడి మాట వినాలనీ.. తను మళ్లీ కనబడాలని ఆత్రంగా ఉండేది. కొన్నాళ్లకే ఎంతలా తన మైకంలో పడిపోయానంటే.. అతడు నాకు ప్రపోజ్‌ చేయాలని ఎదురుచూసేంత. ఆరోజూ తొందరగానే వచ్చేసింది. ఓసారి సరాసరి మా వీధిలోకే వచ్చి.. నా చేతిలో గులాబీ పెట్టి ‘ఐలవ్యూ’ అన్నాడు. నా కళ్లు మెరిశాయి. పెదాలు అదిరాయి. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్ని చెప్పాడని..! నన్ను రాణిలా చూసుకుంటా అన్నాడు. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లాడతానన్నాడు. అన్నింటికన్నా ఎక్కువగా నాకు గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చేదాకా చదివిస్తాననే మాట బాగా నచ్చింది. ఇంక ‘నో’ అనడానికేముంది?
తనే నాకో ఫోన్‌ కొనిచ్చాడు. అప్పట్నుంచి పొద్దంతా ప్రేమ కబుర్లే. చాటుమాటుగా కలుసుకునేవాళ్లం కూడా. ఓసారి అలాగే చెల్లికి దొరికిపోయాం. అమ్మానాన్నలకు చెప్పి రచ్చ చేసింది. నేనూ మాకు పెళ్లి చేయమని మొండికేశా. అప్పటికి నాకు పదిహేడేళ్లే. ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ముందు చదువు పూర్తి చేయమన్నారు. ఫోన్‌ లాక్కున్నారు. అమ్మ చనిపోతానని బెదిరించింది. ప్రాణంలా చూసుకునే నాన్న నాతో మాట్లాడ్డమే మానేశారు. వాళ్లు నన్ను ఎంత ఆపాలని ప్రయత్నిస్తే.. అతడిపై ప్రేమ అంతలా పెరిగిపోయేది. ఆ సమయంలో మావాళ్లు నాకు విలన్లలా కనిపించారు.

కన్నవాళ్లు పెళ్లి చేసేలా లేరని నేనే అడుగు బయటపెట్టా. నచ్చినవాడితో ఏడడుగులు నడిచా. కొత్త మురిపెం.. మొదట్లో బాగానే ఉండేది. కానీ రెండు మనసులు కలవడానికి ప్రేమ చాలు.. రెండు జీవితాలు గడవాలంటే.. డబ్బు కావాలనే విషయం తొందర్లోనే బోధపడింది. తనకా.. ఉద్యోగం, సంపాదన లేదు. పైగా తన అన్నాతమ్ముడూ కన్నవాళ్లపైనే ఆధారపడి బతుకుతున్నారు. నాకేమో చదువు ఆగిపోతోందనే బాధ. ఓసారి గట్టిగానే నిలదీశా. ‘నా దగ్గర డబ్బులెక్కడున్నాయ్‌? అయినా నువ్వు బయటికెళ్తే అందరి కళ్లూ నీమీదే ఉంటాయ్‌. నేను కాపలా కాస్తుండాలా? నువ్వు చదవాల్సిన పనేం లేదు’ అన్నాడు. నువ్వే నా ప్రాణం... నీకోసం ఏమైనా చేస్తా.. అన్న వ్యక్తి ఇంతలా దిగజారిపోతాడనుకోలేదు. ఇదికాక అత్త, తోడికోడలు రోజూ సూటిపోటి మాటలనేవారు. నా పరిస్థితి ఇలా అయితే మావాళ్లది మరో వ్యధ. కూతురు వెళ్లిపోయిందనే బాధలో నాన్న తాగుడుకు అలవాటయ్యారట. అమ్మకి ఆరోగ్యం పాడైంది. ఆ సమయంలో చెల్లినే ఇంటి బాధ్యతలు తనపైన వేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చదువు కోసం నా మనసు చంపుకొని మరీ.. కన్నవాళ్లని సాయం అడగా లనుకున్నాను. ‘వెళ్తే వెళ్లు.. కానీ తిరిగిరాకు’ అంటూ.. ఆ మనిషి ముఖం మీదే చెప్పేశాడు. అప్పుడైతే ప్రేమ మీదే అసహ్యం వేసింది.

గుండెల్లో గునపం దించినా.. కన్నవాళ్లు నన్ను మళ్లీ ఆదరించారు. తర్వాత మా బంధం నిలపాలనీ ప్రయత్నించారు. నా భర్తను మా ఇంటికే తీసుకొచ్చారు. కానీ తనేం చేసేవాడు? ముప్పొద్దులా తినడం.. హీరోలా పోజులు కొట్టడం. కనీసం ఏదైనా పని చేద్దామని ప్రయత్నించేవాడు కాదు. నేను నిలదీస్తే అరవడం.. తిట్టడం.. ఒక్కోసారి కొట్టడం. ఈ కష్టాల సుడిగుండంలోనే నాకో పాప పుట్టింది. ఏళ్లు గడుస్తున్నాయి. అయినా తను బాధ్యతలు తెలుసుకుంటేగా! మరోవైపు నా చెల్లి మంచి ఉద్యోగం సాధించింది. కన్నవాళ్లు చూసిన సంబంధం చేసుకొని మంచి జీవితం గడుపుతోంది. చదువులేక.. మంచి జీవితం దక్కక నేను రెంటికీ చెడ్డ రేవడినయ్యా. ‘అతడికి విడాకులు ఇచ్చెయ్‌. మా దగ్గరే ఉండు.. కనీసం ప్రశాంతత అయినా దక్కుతుంది’ అని ఎన్నో సార్లు బతిమాలింది చెల్లి. కానీ ఇదంతా నా స్వయంకృతం. శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నా. ప్రస్తుతం కుటుంబం గడవడానికి ఓ కౌన్సెలింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నా. ఆడ పిల్లలకు చదువు విలువ తెలియజేస్తూ.. తెలిసీ తెలియని వయసులో ప్రేమ మైకంలో పడొద్దని చెబుతున్నా. ఇదంతా చదివాక కొందరైనా ప్రేమకి బానిసలు కాకుండా.. చదువు, కెరియర్‌ విలువ తెలుసుకుంటారని ఆశిస్తున్నా.

జాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని