ఆ ఆశతోనే బతుకుతున్నా!

మాదో కోతిమూక లాంటి గ్యాంగ్‌. ఓసారి అందరం సినిమాకని బయల్దేరాం. రోడ్డుమీదకి రాగానే ధడేల్‌మని పెద్ద శబ్దం. మేం నిల్చున్నచోట కొద్దిదూరంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. పరుగెత్తుకెళ్లాం. అక్కడి దృశ్యం భీతావహంగా ఉంది

Updated : 02 Mar 2024 07:16 IST

కొన్ని బంధాలు ఎప్పుడెలా మొదలవుతాయో తెలియదు..  సర్వస్వం అనుకునేలోపే దూరమై.. జీవితాంతం వగచేలా చేస్తాయి.

 మాదో కోతిమూక లాంటి గ్యాంగ్‌. ఓసారి అందరం సినిమాకని బయల్దేరాం. రోడ్డుమీదకి రాగానే ధడేల్‌మని పెద్ద శబ్దం. మేం నిల్చున్నచోట కొద్దిదూరంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. పరుగెత్తుకెళ్లాం. అక్కడి దృశ్యం భీతావహంగా ఉంది. వెహికిల్‌ మీద ఉన్న ఇద్దరు భార్యాభర్తలు స్పాట్‌లోనే చనిపోయారు. వాళ్ల బాబు తల్లిదండ్రుల శవాల దగ్గర గుక్కపెట్టి ఏడుస్తుంటే.. నాకు కన్నీళ్లాగలేదు. నేనెళ్లి వాడ్ని ఎత్తుకున్నా. కాసేపటికే పోలీసులొచ్చారు. సాయంత్రమైనా వాళ్లకు సంబంధించినవాళ్లు రాలేదు. ‘ఎవరూ రాకపోతే నేనే పెంచుకుంటా. అందుక్కావల్సిన ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేస్తా. మీరు ఎప్పుడు పిలిచినా వస్తా’ అని పోలీసులతో చెప్పి వాడ్ని తీసుకొచ్చా.పిల్లాడిని చూడగానే మావాళ్లు కంగారు పడ్డారు. జరిగినదంతా వివరించా. కానీ ఆరోజు నుంచే మొదలయ్యాయి ఇరుగూపొరుగూ ఆరాలు. ‘ఆ అబ్బాయెవరు?’, ‘ఎందుకు తీసుకొచ్చారు?’ ‘పెళ్లి కాని అమ్మాయి దగ్గరుంటే తనకి పెళ్లవుతుందా?’ ఇలా ఎన్నో. కొన్ని సలహాలు, ఇంకొన్ని వెక్కిరింపులు. మొదట్లో మావాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత భయపడసాగారు. ఎంతైనా కన్నవాళ్లు కదా! పిల్లాడ్ని అనాథాశ్రమంలో చేర్పిద్దామన్నారు. నేనొప్పుకోలేదు. ‘కనీసం నీ పెళ్లి అయ్యేవరకైనా వాడ్ని ఎక్కడైనా దూరంగా ఉంచు’ అంది అమ్మ. నేనూ ఓ షరతు పెట్టా. నన్ను చూడటానికొచ్చిన అబ్బాయితో ఈ పిల్లాడి విషయం చెప్పాలని. తర్వాతే అనాథాశ్రమంలో చేర్పించాం. కొన్నాళ్లకి నాకో మంచి సంబంధం వచ్చినా.. బాబుని వాళ్లతో ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు. నేనా సంబంధం వదులుకున్నా. ఇక కొన్నాళ్లు పెళ్లి వాయిదా వేయాలనుకున్నా. ఏమాత్రం తీరిక దొరికినా.. వెళ్లి బాబుతో ఆడుకునేదాన్ని. కొన్నాళ్లకి ఆఫీసు ప్రాజెక్టువర్క్‌ కోసం ముంబయికి వెళ్లా. బుడ్నోడ్ని వదిలి వెళ్తుంటే.. చెప్పలేనంత దిగులు. అయితే అక్కడే నా జీవితం మరో మలుపు తిరిగింది. మా ఆఫీసులో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అచ్చం నాలాగే ఆలోచించేవాడు. బాగా సాయం చేసే గుణం.  బాగా నచ్చేవాడు. తనూ నాకు దగ్గరవడానికి చేసే ప్రయత్నాలు గమనిస్తూనే ఉన్నా. తీరా నేను తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. సెండాఫ్‌ ఇవ్వడానికి అంతా వచ్చారు. నా కళ్లు మాత్రం అతడికోసం వెతుకు తున్నాయి. ఇంతలో ఎక్కడ్నుంచి ప్రత్యక్షం అయ్యాడో.. నా ముందుకొచ్చి నిల్చున్నాడు. ఓ గులాబీ నా చేతిలో పెట్టి.. ‘నా జీవితాన్ని కడదాకా నీతో కలిసి ప్రయాణించే అవకాశం ఇస్తావా?’ అన్నాడు. నేను సిగ్గుల మొగ్గయ్యా. విషయమేంటంటే.. తనదీ హైదరాబాదే. తనకి ప్రపోజల్‌కి అంగీకరించా. దాంతోపాటే పిల్లాడి విషయం చెప్పా. ‘నాకు నువ్వు ఎంతో.. తనూ అంతే. వాడికి ఏ లోటూ రాకుండా చూసుకునే బాధ్యత నాది’ అన్నాడు.

తనూ నాతోపాటు అప్పుడప్పుడు పిల్లాడి దగ్గరికి వచ్చేవాడు. ముగ్గురం కలిసి బాగా ఆడుకునేవాళ్లం. మా పెళ్లయ్యాక వాడ్ని మా  దత్తత తీసుకోవాలనుకున్నాం. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. మా మధ్య అల్లుకున్న బంధం చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో! ఓరోజు అర్థరాత్రి ఆయా ఫోన్‌ చేసింది. ‘బాబుకి ఆరోగ్యం అస్సలు బాగా లేదు. ఆసుపత్రిలో చేర్చాం’ అంది. నాకు కాళ్లూచేయీ ఆడలేదు. పరుగెత్తుకెళ్లా. ఐసీయూలో ఉన్నాడు. శ్వాస తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. వాడి తల నిమిరి.. నా చేతుల్లోకి తీసుకున్న కొద్దిక్షణాల్లోనే శ్వాస ఆగిపోయింది. ఆ క్షణం తల్లిదండ్రుల శవాల ముందు పిల్లాడు ఏడ్చినట్టే నేనూ ఏడ్చా. ఆ లేత బుగ్గల మీద నా చేత్తో మట్టి వేస్తున్నప్పుడు అయితే గుండెలు పగిలేలా రోదించా.  రోజులు, నెలలు గడిచినా వాడి ముఖమే గుర్తొచ్చేది. తప్పనిసరై ఆఫీసుకు వెళ్లినా.. వాడు అరిచినట్టు, మాట్లాడినట్టు.. నన్ను ప్రేమగా కౌగిలించుకున్నట్టు కళ్లముందు దృశ్యాలు కదలాడేవి. ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నాక్కాబోయే భర్త కంటికి రెప్పలా చూసుకున్నాడు. నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నన్ను వాడి ఆలోచనల నుంచి బయట పడేసే ప్రయత్నం చేశాడు. ఇంతమంచి అబ్బాయి నా జీవితంలోకి వస్తున్నాడని సంతోషించాలా.. ప్రాణం అనుకున్నవాడు దూరమయ్యాడని ఏడవాలా? ఏమీ అర్థం కావడం లేదు. అయినా.. తన తోడ్పాటుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. మనకి అత్యంత ఇష్టమైన వ్యక్తులు.. ఏదో రూపంలో మన జీవితంలోకి మళ్లీ వస్తారని చెబుతుంటారు. నేనూ అదే ఆశతో.. నాక్కాబోయే భర్త అండతో బతుకుతున్నా.
- శ్రీవర్షిణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని