Manasulo Maata: ఈ ఎడబాటు.. మళ్లీ రానివ్వను!

అందరు అమ్మాయిల్లాగే పెళ్లంటే నాకూ ఎన్నో ఆశలు.. ఆలోచనలు. కానీ వాళ్లలా.. నా రాకుమారుడు రెక్కల గుర్రం ఎక్కి వచ్చి నన్ను తీసుకుపోవాలి అని ఏనాడూ ఊహించుకోలేదు

Updated : 16 Dec 2023 09:38 IST

అందరు అమ్మాయిల్లాగే పెళ్లంటే నాకూ ఎన్నో ఆశలు.. ఆలోచనలు. కానీ వాళ్లలా.. నా రాకుమారుడు రెక్కల గుర్రం ఎక్కి వచ్చి నన్ను తీసుకుపోవాలి అని ఏనాడూ ఊహించుకోలేదు. నా రెక్కలు తెంచేయకుండా.. నేను నిర్మించుకున్న నా చిన్ని ప్రపంచాన్ని కూల్చేయకుండా ఉంటే చాలనుకున్నా. నా ఆత్మాభిమానం, వ్యక్తిత్వం గుర్తించాలనుకున్నా. ఆ సమయంలోనే నా జీవితంలోకి వచ్చాడు రామ్‌. నేనంటే అతడికి ఎందుకంత ఇష్టమో ఇప్పటికీ తెలియదు.

రామ్‌ మాకు దూరపు బంధువు. వరుసకి బావ. ఓ శుభకార్యానికి పిలవడానికి మా ఇంటికొచ్చాడు. అదే మొదటిసారి చూడటం. నన్ను చూస్తూ మెలికలు తిరిగిపోవడం గమనించా. తొలిచూపు ప్రేమ కాదుగానీ.. పద్ధతిగా ఉన్న అతడి మాటలతో నాకూ ఓ పాజిటివ్‌ ఫీలింగ్‌ కలిగింది. తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకి అత్త నుంచి ఫొన్‌ వచ్చింది. ‘మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. తనని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోడట’ అని. అమ్మానాన్నలకు వాళ్లతో సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయం మొహమ్మీదే చెప్పలేక ‘అమ్మాయి ఇంకా చదువుకుంటానంటోంది’ అన్నారు. అయినా వాళ్లు వదిలితేగా! పెళ్లిళ్లు, వేడుకలు.. ఎక్కడ కలిసినా మరోసారి ఆలోచించమని పోరు పెట్టేవాళ్లు. మావాళ్లు ఏదోలా మాట దాటవేసేవారు. వాళ్లు ఎటూ స్పందించకపోయేసరికి ఓరోజు నేరుగా అమ్మకే ఫోన్‌ చేసి, ఇంటికొచ్చేశాడు బావ. మూడునెలలు ఆగమంది. ఏడాది ఎదురు చూసి మళ్లీ అడిగాడు. ‘మీ సంబంధం కలుపుకోవడం మావయ్యకి ఇష్టం లేద’ని అసలు విషయం తేల్చి చెప్పేసింది. అయినా వెనక్కి తగ్గలేదు బావ. ఆర్నెల్లయ్యాక మరోసారి వచ్చి బతిమాలాడు. ‘ఇంతలా వెంటపడుతున్నావ్‌.. అసలు నా కూతురిలో నీకేం నచ్చింది? ఏం తెలుసని ఇంతలా ప్రేమించావు?’ అని నిలదీసింది అమ్మ. ఏం మాయ చేశాడోగానీ అమ్మ కరిగిపోయింది. కష్టపడి నాన్ననూ ఒప్పించింది. అమ్మ ద్వారానే ఈ విషయాలన్నీ నాకు తెలిసేవి.

 పెళ్లిచూపులప్పుడు.. ‘ఓయ్‌.. మరదల్‌ పిల్లా.. నేను నచ్చానా?’ అంటూ మొదటిసారి మాట కలిపాడు. ఆరేళ్లు పట్టుబట్టి ఇక్కడిదాకా తీసుకొచ్చిన తనని ఏ అమ్మాయైనా కాదనుకుంటుందా? నేను సిగ్గుల మొగ్గవుతుండగా.. నా మనసులోని మాట గొంతు దాటలేదు. మర్నాడు కాల్‌ చేశా. అవతలివైపు ఫోన్‌ ఎత్తగానే నాలో మళ్లీ అదే కలవరం. ‘హలో హర్షిణీ.. నువ్వేనా?’ అంటూ భలే కనిపెట్టేశాడు. రెండు సెకన్లు గ్యాప్‌ తీసుకొని మాట కలిపా. అలా మొదలైన మా మాటలు నిరంతర ప్రవాహంలా సాగేవి.

 బావకి డిగ్రీలో ఉండగానే ఉద్యోగం వచ్చింది. మాదసలే పల్లెటూరు. పైగా చాదస్తం. భార్య.. భర్తకన్నా ఎక్కువ చదవొద్దని నన్ను డిగ్రీతోనే ఆపేశారు. బాధతోపాటు చాలా కోపమొచ్చింది. ‘నీవల్లే నా చదువు ఆగిపోయింద’ంటూ బావని తిట్టేశా. తనకిష్టం లేకపోయినా నన్నూ ఎంబీఏలో చేర్చాడు. అదయ్యాక నాకు ఉద్యోగం చేయాలనిపించింది. దానికి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాకు రోషం పొడుచుకొచ్చింది. ఉద్యోగం వద్దనడం నన్ను చిన్నచూపు చూసినట్టుగానే భావించా. తన మాట కాదని హైదరాబాద్‌ వెళ్లి కొలువులో చేరా. అలకపాన్పు ఎక్కాడు. ఫోన్‌ చేస్తే కట్‌ చేసేవాడు. వాట్సప్‌కి వస్తే ఆఫ్‌లైన్‌. కొద్దిరోజుల్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటే.. అది జరగలేదు. బావ బెట్టు వీడకపోయేసరికి నా ప్రేమకి నేనే విలన్‌ అయ్యాననిపించింది. ఒంటరయ్యాననే బాధ కుంగదీసేది. అప్పుడప్పుడు ఊరెళ్లినా తను పట్టించుకోకపోయేసరికి నాలో పంతం మరింత పెరిగింది. పెళ్లా? ఆత్మాభిమానమా? అని ఆలోచించుకునే స్థాయికీ వెళ్లిపోయాను. ఆఖరికి తనే దిగొచ్చాడు. జాబ్‌ చేసినా ఫర్వాలేదన్నాడు. అప్పట్నుంచి నేనెలాగైతే నా జీవితం నా చేతుల్లోనే ఉండాలనుకున్నానో అలాంటి స్వేచ్ఛనే ఇచ్చాడు. అన్నట్టు నేను తనకి దూరమవుతాననే ఉద్దేశంతోనే ఉద్యోగానికి వెళ్లొద్దన్నాడట. ఆ విషయం విన్నాక విలవిల్లాడిపోయా. నేనెంత మూర్ఖంగా ఆలోచించానో అర్థమైంది. నాకోసం ఆరేళ్లు ఎదురు చూసిన ఆ ఓపికకి.. నేరుగా అమ్మానాన్నలతో మాట్లాడిన ఆ తెగువకి.. నాకోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే ఆ ప్రేమకి ఫిదా అయ్యా. తనకోసం నా స్వేచ్ఛ, ఆత్మాభిమానాన్ని వదులుకోవడమూ తప్పు కాదనిపించింది. అన్నట్టు ఈరోజే నా రాకుమారుడి పుట్టినరోజు. మా మధ్య మళ్లీ ఎలాంటి ఎడబాటు రాకూడదని కోరుకుంటూ.. ‘హ్యాపీ బర్త్‌ డే బావా’.
హర్షిణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని