ప్రేయసి గాయం.. అర్ధాంగి లేపనం!

నాన్నపై పట్టలేనంత కోపం. గట్టిగా అరవాలనిపించింది. అదే ఊపుతో విసురుగా బయటికొచ్చా. ఆయన ఓ బంధువుతో మాట్లాడుతున్నారు. మొహంలో ఎన్నడూ చూడనంత సంతోషం. పెద్ద బాధ్యత తీరిపోతుందనే నిశ్చింత.

Updated : 16 Mar 2024 07:06 IST

నాన్నపై పట్టలేనంత కోపం. గట్టిగా అరవాలనిపించింది. అదే ఊపుతో విసురుగా బయటికొచ్చా. ఆయన ఓ బంధువుతో మాట్లాడుతున్నారు. మొహంలో ఎన్నడూ చూడనంత సంతోషం. పెద్ద బాధ్యత తీరిపోతుందనే నిశ్చింత. నిశ్చలంగా ఉన్న ఆ మొహాన్ని నా మాటలతో చెల్లాచెదురు చేయడం ఇష్టం లేక అడుగు వెనక్కు వేశా. నిజానికి ఆరోజు నా నిశ్చితార్థం. అందరి మొహాల్లో సంతోషం ఉంటే నాలో దుఃఖం. కారణం.. నేను ప్రేమించిన అమ్మాయికి కాకుండా ఎవరో అపరిచితురాలి వేలికి ఉంగరం తొడగడం. దానిక్కారణం నాన్నే. మాట మాత్రమైనా చెప్పకుండానే నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.

నా మనసులో ఉన్నదేమో వైష్ణవి. తను మంచి మనసున్న అమ్మాయే కాదు.. తెలివైంది కూడా. మంచీచెడుల విచక్షణ తెలియని చిన్న వయసులోనే.. మా పరిచయం మొదలైంది. ఆటలు.. మాటలు.. గిల్లికజ్జాలు.. అన్నీ తనతోనే సాగేవి. మామధ్య బంధం ఎంతలా అల్లుకుంది అంటే.. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేనంత. ఒంట్లోకి కౌమారం ప్రవేశించిన ప్రాయంలోనే మా మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అలా సవ్యంగా సాగిపోతున్న నా జీవితంలో ఓ పెద్ద కుదుపు. పదహారేళ్లు ఉన్నపుడు మా అమ్మ చనిపోయింది. అప్పుడు మేం ఉన్న ఇల్లు అమ్మేసి వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అసలే అమ్మ పోయిందన్న దుఃఖం. దానికితోడు తను దూరమవడం. ఆ సమయంలో ఒడ్డున పడ్డ చేపపిల్లలా గిలగిలలాడాం. అయితే ఆ సందర్భం మా మధ్య భౌతికంగా దూరం పెంచినా.. మానసికంగా మరింత దగ్గరయ్యాం. చూస్తూచూస్తూనే మా అనుబంధంలో ఏళ్లు క్షణాల్లా కరిగిపోయాయి. నా చదువు పూర్తవగానే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. మరోవైపు నాన్న ఆరోగ్యం క్షీణించసాగింది. ‘ఒక్కగానొక్క కొడుకు. తల్లి లేని బిడ్డ. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. పెళ్లి చేసేస్తే వాడు సుఖంగా ఉంటాడు’ ఇలా ఇంటికొచ్చిన ప్రతి బంధువుకూ చెబుతుండేవారు నాన్న. ఆయన ఆరాటం నాకు అర్థమవుతూనే ఉంది. కొంచెం సెటిలవగానే.. ఓ మంచిరోజు చూసుకొని వైష్ణవి గురించి చెబుదాం అనుకునే వాడిని. కానీ ఆ అవకాశం ఇవ్వనేలేదు. సడెన్‌గా ఓరోజు మావయ్య కూతురుతో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.

నిశ్చితార్థమైనా పెళ్లి ఆపాలనే ఆలోచన వచ్చింది. కానీ నాన్న పరిస్థితేంటి? ఆందోళనతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే నేను తట్టుకోలేను. ఏం చేయాలో అర్థం కాక అలా ఒంటరిగా కూర్చున్నా. అప్పుడే నాన్న వచ్చారు. ‘నిశ్చితార్థం అయితే సగం పెళ్లి అయినట్టేరా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది’ అన్నారు. ‘తల్లి లేని బిడ్డవి.. నీ జీవితం ఏమవుతుందోనని ఎంతో కంగారుగా ఉండేది. కానీ ప్రయోజకుడివి అయ్యావు. నన్ను కష్టపెట్టకుండా ఓ కొత్త జీవితాన్నీ ప్రారంభిస్తున్నావు’.. చెప్పుకొంటూ పోతున్నారు. ఇంక నేనేం చేయను? బాధో.. సంతోషమో.. ఆయన్ని మనసారా కౌగిలించుకొని అలాగే ఉండిపోయా.

ఇప్పుడు నా పెళ్లై ఏడాది దాటింది. మొదట్లో చాలా బాధగా ఉండేది. ఆ సమయంలో నా బాధలకి నా భార్యే లేపనం పూసింది. వైష్ణవినిగానీ.. అమ్మనిగానీ మిస్‌ అవుతున్నానే ఆలోచనే రాకుండా చేసింది. విలువైంది ఏదో చేజారిందని బాధ పడుతూ కూర్చుంటే.. మనం పొందిన అతి విలువైనదాన్ని మిస్‌ అవుతాం. ఆ విషయంలో కొన్నాళ్లకే నేను రియలైజ్‌ అయ్యా. నేనే ప్రాణంగా బతుకుతున్న నా భార్యతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నా. ఇక వైష్ణవి విషయానికొస్తే.. మేం ఎంత ప్రేమగా ఉన్నా.. నేనెప్పుడూ తనతో హద్దులు దాటలేదు. ఇద్దరి మనసుల్లో పెళ్లి ఆలోచనలు ఉన్నా.. అది ఆచరణసాధ్యం కాకపోవడంతో హుందాగానే విడిపోవాలనుకున్నాం. ఆమె క్షేమం కోరే వ్యక్తిగా తనకీ మంచి జీవితం దక్కాలని ఆశిస్తున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా.. నా మనసు గాయాన్ని మాన్చి.. నా అన్ని సంతోషాలకూ కారణమైన నా అర్థాంగి పేరు ఆద్య.

ఆదిత్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని