ఇప్పటికీ.. ఆ బంధానికి పేరేంటో తెలియదు!

డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం దండయాత్ర సాగిస్తున్న రోజులవి. నా ఒంటిపైకి ఏళ్లు ఎగబాకుతున్నాయిగానీ ఒక్క నోటిఫికేషనూ రావట్లేదు! కానీ పక్కింటి పిన్ని.. ఎదురింటి అంకుల్‌తో సహా.. అందరికీ నామీదే చూపు. ‘నెక్ట్స్‌ ఏంటి?’ అంటూ ప్రశ్నలతో గుచ్చేవాళ్లు.

Updated : 13 Apr 2024 08:55 IST

డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం దండయాత్ర సాగిస్తున్న రోజులవి. నా ఒంటిపైకి ఏళ్లు ఎగబాకుతున్నాయిగానీ ఒక్క నోటిఫికేషనూ రావట్లేదు! కానీ పక్కింటి పిన్ని.. ఎదురింటి అంకుల్‌తో సహా.. అందరికీ నామీదే చూపు. ‘నెక్ట్స్‌ ఏంటి?’ అంటూ ప్రశ్నలతో గుచ్చేవాళ్లు. లైట్‌ తీసుకునేవాడిని. ఓరోజు.. ‘నీకన్నా చిన్న వాళ్లు సెటిలవుతున్నారు. అంతా నీ గురించే అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాన్రా’ నాన్న మాటలని మాత్రం లైట్‌ తీసుకోలేక పోయా. తెలియకుండానే నా కళ్లలో కన్నీటి సుడులు. ఇంక ఫిక్సయ్యా. సర్కారో, ప్రైవేటో.. ఏదో ఒక కొలువు అర్జెంటుగా సాధించాలని. అప్పుడే నాకు తెలిసిన ఓ చెల్లి తను పనిచేసే మీడియా సంస్థలో నోటిఫికేషన్‌ వచ్చిందని చెప్పింది. వెంటనే దరఖాస్తు చేశా. నాలుగు దశల్లో పరీక్ష. ఎంపికైతే జీతమిస్తూ.. శిక్షణనిస్తారు. ఒక్కో అడుగూ దాటుతుంటే చెప్పలేనంత సంతోషం. భరించలేనంత టెన్షన్‌. మొత్తానికి ఎంపికయ్యా. అప్పుడు నాకన్నా మావాళ్లే ఎక్కువ సంతోషించారు.

బ్యాగు సర్దుకొని ఒంటరిగా హైదరాబాద్‌ వచ్చేశా. అంతా కొత్త ప్రపంచం. కొన్నాళ్లకి అక్కడ పని చేసే నా చెల్లి ఒకమ్మాయిని పరిచయం చేసింది. పొడవాటి కళ్లు.. ఆకట్టుకునే ముఖం.. అటూఇటూ చూస్తూ మాట్లాడుతుంటే.. మేఘాల్లోకి వెళ్లి వస్తూ దోబూచులాడుతున్న చందమామలాగే అనిపించింది. కానీ కొద్దిసేపటికే మొహమాటాలు పక్కన పెట్టేసి గలగలా మాట్లాడుతుంటే ఆమె పెదాల వైపే చూస్తున్నా. ముడుచుకుంటూ.. విచ్చుకుంటూ మాయాజాలమే చేస్తున్నాయవి. కొన్నాళ్లకే తను బాగా దగ్గరైంది. ‘గారు’, ‘మీరు’ కాస్తా.. ‘మామా’ అని పిలుచుకునేలా మారింది. తను ఎవరితో ఎలా ఉన్నా, నాతో మాత్రం నిజాయతీగా ఉండేది. నన్ను నవ్వించేది.. ఏడిపించేది.. నాకిష్టమని అప్పుడప్పుడు చికెన్‌ కర్రీ తీసుకొచ్చేది. నేనూ ఆమెకి చాక్లెట్లు తెచ్చిచ్చే వాడిని. ఇచ్చిపుచ్చుకోవడాలే కాదు.. కష్టసుఖాల్లోనూ నా చేయి వదలకపోయేది. మా సాన్నిహిత్యం కొందరికి నచ్చలేదు. కొందరైతే అభాండాలు వేశారు. తట్టుకోలేక.. ఓసారైతే, నన్ను దూరంగా ఉండమని ఏడ్చింది. కానీ అప్పటికే మేం ఒకర్నొకరం చూడకుండా, మాట్లాడుకోకుండా ఉండలేని స్థితికొచ్చాం. ఎవరేమనుకున్నా అలాగే కొనసాగాలనుకున్నాం. ఇంక నాతో ఎవరైనా అమ్మాయి మాట్లాడితే చాలు.. బాగా కోప్పడేది. ఎందుకని ఓసారడిగా. ‘నువ్వు చాలా మంచోడివి. అమాయకుడివి. నిన్ను ఎవరైనా ఇట్టే మోసం చేస్తార్రా’ అనేది.

 నా శిక్షణ పూర్తయ్యాక తనకి కాస్త దూరంగా ఉండే డెస్కులో పోస్టింగ్‌ ఇస్తామన్నారు సర్‌. ఇక్కడే ఉండేలా ప్రయత్నించొచ్చుగా అని బాధ పడింది. ‘మరీ దూరమేం కాదు.. మనం కలిసి మాట్లాడుకోవడానికి అడ్డేముందిలే’ అని సర్దిచెప్పా. ఇంతలో నాకు మళ్లీ ఫోన్‌. ఈసారి వేరే రాష్ట్రంలో పోస్టింగ్‌ అని బాంబు పేల్చారు సంస్థవాళ్లు. తన రియాక్షన్‌ ఊహించుకుంటేనే భయమేసింది. ఎలా చెప్పాలా? అని ఉద్యోగంలో చేరే రోజు దాకా ఆలోచిస్తూనే ఉన్నా. ఆఖరికి చెప్పక తప్పలేదు. కన్నీటి పర్యంతమైంది. తననలా చూసేసరికి నాకూ ఏడుపాగలేదు. ‘సర్‌ని రిక్వెస్ట్‌ చేయొచ్చుగా.. నువ్వడిగితే కాదనరు’ అంది. కానీ ఎలా? నేను ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమని ట్రైనింగ్‌ మొదట్లోనే చెప్పేశాను. ఏదేమైనా.. జీవితంలో ఒక కొత్త అడుగు వేస్తున్నాను.. సంతోషంగా సాగనంపొచ్చుగా అనడిగా. బాధని దిగమింగుతూ.. మొహంపై నవ్వు పులుముకొని వీడ్కోలు పలికింది. ‘నన్ను నేను మర్చిపోతానేమోగానీ.. నిన్ను మర్చిపోవడం కష్టం మామా’ అంది. ఆ మాటని నా గుండెల్లో నింపుకొని బస్సెక్కా. రోజులు.. నెలలు గడిచినా.. తనని చాలా మిస్‌ అవుతున్నాననే బాధ మాత్రం పోవడం లేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే మేం ఒక్కసారి కూడా ఐలవ్యూ చెప్పుకోలేదు. ప్రేమ అనే పదం మా మధ్య రాలేదు. అయినా మా బంధానికి ఏం పేరు పెట్టుకోవాలో ఇప్పటికీ తెలియడం లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే.. ముందే పరిచయమై జీవితాంతం నీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నా మామా.

రామ్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని