Andhra News: సీఎం చర్యలు నేరగాళ్లకు ప్రాణభయం కలిగించాలి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 23 Apr 2022 16:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు 3 పేజీల లేఖ రాశారు. మహిళల పట్ల హింస, అత్యాచారాలు పెరగడానికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి విజయవాడ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటన నిదర్శనమన్నారు. కూతురు కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో.. ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. 

‘‘జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడో వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఏమయ్యాయి? రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? ఈ చట్టం ప్రకారం ఎన్ని కేసులను నమోదు చేసి ఎంతమందిని శిక్షించారు? సీఎం ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదు. గంజాయి, డ్రగ్స్‌, మద్యం వంటివి రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యం జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా తీసుకునే చర్యలు, పాటించే విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలి.

రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించాలి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు ఇల్లు, జీవనోపాధి కల్పించాలి. బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయమని కోరితే బాధ్యతను మర్చిపోయి తమపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని