
రంగంలోకి జిల్లాల కలెక్టర్లు
కొత్త జీతాల బిల్లులు సమర్పించాలని ఒత్తిళ్లు
ఈనాడు, అమరావతి: కొత్త పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారమే ఉద్యోగులకు జనవరి జీతాలు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను రంగంలోకి దింపింది. జనవరి 28 తేదీ గడిచినా ఉద్యోగులు ఎవరూ కొత్త వేతన సవరణ ప్రకారం బిల్లులు సమర్పించేందుకు ముందుకు రాలేదు. చాలామంది ఉద్యోగులు తమ డ్రాయింగు డిస్‌బర్స్‌మెంటు అధికారులకు ‘కొత్త జీతాలు వద్దు- పాత జీతాలే ఇవ్వాలి’ అంటూ లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించారు. ఫలితంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనేకమంది డీడీవోలు ఇప్పటికీ బిల్లులను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు అన్ని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీడీవోలు బిల్లులను సమర్పించేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అధికారుల ఒత్తిడితో డీడీవోలు సందిగ్ధంలో పడ్డారు.
* కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాలు పొందేవారు సుమారు 4 లక్షల పైమాటే. శుక్రవారం సాయంత్రం వరకు లక్ష మంది ఉద్యోగుల జీతాల బిల్లులు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బిల్లులు సమర్పించేందుకు గడువు ముగిసినా ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి 31 వరకు కూడా స్వీకరించే అవకాశమున్నట్లు తెలిసింది. ఆ లోపు బిల్లులు సమర్పించకపోతే ప్రతినెలా 5 తర్వాత సప్లిమెంటరీ జీతాల బిల్లుగా పరిగణిస్తారు. ఈసారి ఆ నిబంధననూ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.