జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమార్జన రూ.1.4 కోట్లు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేసిన అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు ఆయన అక్రమార్జన....

Updated : 08 Dec 2021 05:20 IST


వెంకట వరప్రసాదరావు

రాజమహేంద్రవరం నేరవార్తలు, ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేసిన అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు ఆయన అక్రమార్జన రూ.1.4 కోట్లుగా గుర్తించారు. విశాఖపట్నంకు చెందిన జమ్ము వెంకటవరప్రసాదరావు తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖలో జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. దీంతో అనిశా అధికారులు ఆయనకు సంబంధించిన 7 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసం, ఆత్రేయపురంలోని కార్యాలయం, కాకినాడ, విజయవాడ సమీపంలోని గుణదల, తెలంగాణలోని మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. 2 ఫ్లాట్లు, జీ ప్లస్‌-2 భవనం, 2 ఇంటి స్థలాలు, కారు, ద్విచక్ర వాహనం, బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.5 కోట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో రూ.1.4 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వెంకట వరప్రసాదరావును రాజమహేంద్రవరం అనిశా కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని