AP News: ఇలాంటి ప్రభుత్వం వస్తుందనుకుంటే పాత రసీదులు దాచేవాళ్లం

‘‘ముప్పై ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటికి రుణం రూ.6 వేలు. అందులో రూ.3 వేలు రాయితీ ఇచ్చారు. మిగతా రూ.3 వేల అప్పును నెలవారీగా రూ.50, రూ.100 చొప్పున కట్టించుకున్నారు.

Updated : 22 Jan 2022 09:13 IST

ఓటీఎస్‌ సిబ్బందితో వాపోయిన తూగో వాసి

సీతానగరం, న్యూస్‌టుడే: ‘‘ముప్పై ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటికి రుణం రూ.6 వేలు. అందులో రూ.3 వేలు రాయితీ ఇచ్చారు. మిగతా రూ.3 వేల అప్పును నెలవారీగా రూ.50, రూ.100 చొప్పున కట్టించుకున్నారు. అప్పు తీరిపోయిందని చెప్పి డబ్బులు కట్టించుకున్న పాసుపుస్తకాలను కూడా తీసుకుపోయారు. మళ్లీ మీరొచ్చి రూ.9,480 ఇంటి అప్పు తీర్చాల్సి ఉంది. కట్టాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. తీర్చేసిన అప్పును మళ్లీ తీర్చాలంటూ భయపెట్టడం సరైన విధానం కాదు. ఈ ప్రభుత్వం పోయి కొత్తగా మరో ప్రభుత్వం వస్తే మళ్లీ వాళ్లకూ కట్టాలా...’’ అంటూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన పెన్నాడ వీరభద్రరావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు డబ్బులు కట్టినట్లు రసీదులు చూపిస్తే, వాటిని తీసుకెళ్లి గృహనిర్మాణ సంస్థకు అప్పగిస్తే అప్పుపై నిర్ణయం తీసుకుంటారని సిబ్బంది సూచించారు. ఇలాంటి ప్రభుత్వం వస్తుందని ముందుగా తెలిస్తే 30 ఏళ్ల కిందటి రసీదులను భద్రపరుచుకునేవాళ్లమంటూ వీరభద్రరావు కుటుంబీకులు మండిపడ్డారు. ఓటీఎస్‌లో భాగంగా రూ.10 వేలు కట్టించుకునేందుకు వీఆర్వో నందీశ్వరరావు, వెల్ఫేరే అసిస్టెంట్‌ జ్యోత్స్న, మహిళా పోలీసు జహీరా, వాలంటీర్లు... శుక్రవారం ఉదయం వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. ‘‘30 ఏళ్ల క్రితం కష్టపడి కూలి పనులు చేసుకునే సమయంలో రూ.10 వేలు కూడబెట్టుకుని ఇంటిని నిలబెట్టుకున్నాం. అప్పటి నుంచి కనీసం సిమెంటు పూసేందుకు కూడా డబ్బుల్లేక గోడలు బీటలు వారుతున్నా... బిక్కుబిక్కుమంటూ పిల్లలతో గడుపుతున్నాం’’ అని వాపోయారు. ఓటీఎస్‌కు వెళ్లిన సిబ్బందిని ఇంట్లోకి తీసుకెళ్లి వారి దయనీయ పరిస్థితులు చూపించారు. ప్రస్తుతం తాను అనారోగ్యం బారినపడి రోడ్డుపక్కన కూర్చుని పొగాకు ముక్కలు అమ్ముకుంటుంటే రోజుకు రూ.100 వస్తోందని, దాంతో తన భార్యను, మనవడ్ని పోషించుకుంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మీరు డబ్బులు కట్టిన రసీదులు ఉన్నా ఇవ్వండని, అవి లేకుంటే మాత్రం అప్పును కట్టాల్సిందేనంటూ సిబ్బంది అనడంతో... ‘కట్టే ప్రసక్తే లేదు. ఇళ్లు వదిలేసి ఏ చెట్టుకిందకో పోతాం’ అంటూ వీరభద్రరావు స్పష్టంచేశారు. డబ్బులు చూసి ఉంచండి.. మళ్లీ రేపొస్తామంటూ సిబ్బంది ముందుకెళ్లారు. అప్పట్లో అప్పుగా రూ.3వేలు ఉండేదని లబ్ధిదారులు నెలకు రూ.50 నుంచి రూ.100లోపు చెల్లించేవారని వీటి రికార్డులు లేవని గృహనిర్మాణ సంస్థ డీఈఈ పరశురామ్‌ సైతం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని