జనవరి జీతాలపై గరం గరం

కొత్త వేతన సవరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు, పింఛన్లు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకు ఆర్థిక, ఖజానా శాఖల అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కొత్త జీతాలు

Published : 28 Jan 2022 02:59 IST

సీఎఫ్‌ఎంఎస్‌లోనే పింఛను బిల్లులు
ట్రెజరీ అధికారులు సరిచూసి పంపాలని ప్రభుత్వ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: కొత్త వేతన సవరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు, పింఛన్లు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకు ఆర్థిక, ఖజానా శాఖల అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కొత్త జీతాలు, పింఛన్లు వద్దని పీఆర్సీ సాధన సమితి నాయకులు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగీ తమకు పాత విధానంలోనే జనవరి జీతాలు ఇవ్వాలని కోరుతూ తమతమ డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించాలని సూచిస్తున్నారు. ఇందుకు ఒక నమూనా సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఆర్థిక, ఖజానా శాఖల ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఖజానా అధికారులు, ఉద్యోగుల బిల్లులు సమర్పించేందుకు జనవరి 28 (నేటి వరకు) ప్రభుత్వం గడువు విధించింది. డీడీవోలు ఎన్ని బిల్లులు సమర్పించారు? ఎంతమంది అధికారులు వాటిని ప్రాసెస్‌ చేశారన్న విషయాలపై గురువారం మధ్యాహ్నం ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు సమీక్షించారు. అన్ని జిల్లాల అధికారులు, సబ్‌ట్రెజరీ అధికారులతో వీడియో సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 3,57,528 మంది పింఛనర్ల జనవరి నెల పింఛన్లు కొత్త వేతన స్కేళ్ల ప్రకారమే ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సీఎఫ్‌ఎంఎస్‌లో ఆ బిల్లులన్నీ సిద్ధమయ్యాయి.

జీతాల పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలోని 18,000 డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారుల్లో ఎంతమంది బిల్లులు సమర్పించారనే అంశాన్ని ఉన్నతాధికారులు సమీక్షించారు. ప్రధానంగా వచ్చిన బిల్లుల్లో అధికం పోలీసుశాఖవే ఉన్నాయని తెలిసింది. ఏ సబ్‌ట్రెజరీ పరిధిలో డీడీవోలు ఎన్ని బిల్లులు సమర్పించారో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి కొందరితో నేరుగా మాట్లాడారు. బిల్లుల ప్రక్రియ ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ఎస్‌ఆర్‌లు పంపాలని కోరితే వారి నుంచి రాలేదని, అందువల్ల వాటిని తాము ప్రాసెస్‌ చేయలేకపోతున్నామని వారిలో కొందరు చెప్పారు. ఎస్‌ఆర్‌లు రాకున్నా ఖజానా అధికారుల వద్ద ఉన్న ఫ్లైలీఫ్‌ ఆధారంగా ఆ పని పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఖజానా అధికారులు ఆ శాఖ బిల్లులు ఎందుకు సిద్ధం చేయలేదనీ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. జనవరి 28 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందని, లేకుంటే చర్యలు తీసుకుంటారని అధికారులు వారికి చెప్పినట్లు తెలిసింది.


పింఛన్లు తీసుకోవద్దు

‘పాత పీఆర్సీ విధానంలోనే తమకు పింఛన్లు ఇవ్వాలని రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కొత్త విధానంలో పింఛన్లు ఇచ్చినా, సోదర ఉద్యోగులు ఆందోళన విరమించి అనుమతించే వరకూ ఆ సొమ్ములు డ్రా చేయకూడదని నిర్ణయించాం. ఈ మేరకు పింఛనుదారులకు విన్నవిస్తున్నాం.’

- ఈదర వీరయ్య, రాష్ట్ర పింఛనుదారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని