పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో గందరగోళం

ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పీజీ వైద్య విద్య ప్రథమ సంవత్సరం (ఎండీ/ఎంఎస్‌)లో ప్రవేశాలకు సంబంధించి తాత్కాలిక సీట్ల

Updated : 03 Feb 2022 04:07 IST

ఉత్తమ ర్యాంకర్లకు దక్కని చోటు
విద్యార్థుల ఆందోళన.. జాబితా రద్దుచేసిన ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ
కొత్తగా ఆప్షన్లను ఇచ్చుకోవాలని సూచన!
సీట్ల కేటాయింపులో ‘తాత్కాలికం’పై అభ్యంతరాలు

ఈనాడు, అమరావతి, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం : ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పీజీ వైద్య విద్య ప్రథమ సంవత్సరం (ఎండీ/ఎంఎస్‌)లో ప్రవేశాలకు సంబంధించి తాత్కాలిక సీట్ల కేటాయింపు(నాన్‌-సర్వీస్‌)లో తప్పులు దొర్లాయి. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లకు విరుద్ధంగా సీట్లు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తమ ర్యాంకులు వచ్చినప్పటికీ కొందరు విద్యార్థులకు అసలు సీట్లే దక్కలేదు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. చివరికి సాంకేతిక కారణాలతో సీట్ల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు బుధవారం రాత్రి విశ్వవిద్యాలయం ప్రకటించింది. మళ్లీ విద్యార్థులు బుధవారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని కూడా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రకటించడం గమనార్హం. వైద్య విద్యలో పరిమితంగా ఉండే పీజీ సీట్ల కోసం గట్టి పోటీ ఉంది. ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పటి నుంచే పీజీ కోర్సుల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు ఉంటారు. ఈ పరిస్థితుల్లో సీట్ల కేటాయింపు జరిగిన తీరుపై వారంతా ఆందోళన చెందుతున్నారు.

కావాల్సినంత సమయం ఉన్నా తప్పులేనా?

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్‌ (ఎండీ/ఎంఎస్‌) ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియను గత డిసెంబరులోనే విశ్వవిద్యాలయం మొదలుపెట్టింది. ఈ బాధ్యతను కొత్తగా క్యూ-వెంచర్స్‌ అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. సీట్‌ మ్యాట్రిక్స్‌, రిజర్వేషన్‌ దామాషా ప్రకారం విద్యార్థులకు కళాశాలలు, స్పెషాల్టీల వారీగా సీట్ల కేటాయింపు జరగాలి. కానీ ఈ ప్రక్రియ మొత్తం గందరగోళంగా తయారైంది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చి చివర్లో సబ్మిట్‌ చేశారు. ఓటీపీ నంబర్‌ నమోదు చేశాక దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లు పూర్తిస్థాయిలో సర్వరులో నమోదుకాలేదు. దీనివల్ల సీట్ల కేటాయింపు అస్తవ్యస్తంగా తయారైందని తెలుస్తోంది. జనవరి 24 నాటికి విద్యార్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ముగిసింది. అప్పటి నుంచి సీట్ల కేటాయింపునకు తగిన సమయం తీసుకున్నా తప్పులు దొర్లడం గమనార్హం. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చేంత వరకు విశ్వవిద్యాలయం మేల్కొనకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ తప్పుల వెనుక ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జరిగిన తాత్కాలిక సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాల నోట్‌ను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ నుంచి బుధవారం తొలగించారు. సీట్ల కేటాయింపులో ‘తాత్కాలికం’ అని ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల అయోమయం!

ఇప్పటికే పీజీ వైద్య విద్యలో ప్రవేశాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై విచారణ కారణంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంలో తీవ్ర జాప్యం జరిగింది. దీనివల్ల తగిన సమయం అందుబాటులో ఉన్నా విశ్వవిద్యాలయం ఉపయోగించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపు జాబితా రద్దుచేసిన అధికారులు అందుకు దారితీసిన కారణాలు చెప్పడం లేదు. వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందించలేదు.

మరోవైపు జాతీయ స్థాయిలో సీట్లు పొందిన అభ్యర్థులు ఫిబ్రవరి మూడో తేదీలోగా అవసరంలేని సీట్లను వదులుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో మెరుగైన సీటు వస్తే జాతీయ స్థాయి సీటు వదులుకోవాలని చూసిన విద్యార్థులకు తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ బాధ్యతలను చూసే సంస్థ సామర్థ్యం ఎంతుంది? అసలెందుకు ఇలా జరిగింది? పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారు? అన్న దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగడం తొలిసారి అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఇదీ తెలియదా!

తెలంగాణలోని ఇన్‌సర్వీసు వైద్యులకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పీజీ సీట్ల భర్తీలో విశ్వవిద్యాలయం అవకాశాన్ని కల్పించలేదు. ప్రత్యేక కమిటీ ద్వారా ఇన్‌సర్వీస్‌ వారికి సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, విశ్వవిద్యాలయం ఉపకులపతి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు వెలువడిన ఉత్తర్వులను తెలంగాణలోని ఇన్‌సర్వీస్‌ వైద్యులు న్యాయస్థానంలో సవాల్‌చేశారు. దీంతో వారికి సానుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరి సీట్ల కేటాయింపును పక్కనపెట్టి నాన్‌ సర్వీస్‌ కోటా కింద 687 మంది విద్యార్థులతో కూడిన జాబితాను ‘తాత్కాలికం’ పేరుతో మంగళవారం రాత్రి వర్సిటీ ప్రకటించింది. రద్దుచేసింది. ఇది కూడా ఆందోళనలకు కారణమైంది.

ఇప్పటికే జాతీయ స్థాయిలో మొదటి విడత నీట్‌ పీజీ ప్రవేశాలు పూర్తి కాగా తరగతులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడ అభ్యర్థులకు సీట్ల కేటాయింపులే చేయలేదు. తమ పరిస్థితి ఏంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

యూజీ ప్రవేశాల్లోనూ గందరగోళం!

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, హోమియో, యునానీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన నోటిఫికేషన్‌ తర్వాత నుంచి విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థులు తమ వివరాలు నమోదు చేయడంలో మల్లగుల్లాలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ చేద్దామనుకుంటే నీట్‌ ర్యాంకులు మళ్లీ నమోదు చేయండని వస్తోంది. అలాగే కొంత మందికి అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు సంబంధించి ఓటీపీలు రావడంలేదు. మెయిల్స్‌ రావడంలేదని, విశ్వవిద్యాలయం నుంచి ఎటువంటి సమాచారం లేదని, ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వడం లేదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తు గడువు ఈనెల నాలుగో తేదీతో ముగియనున్న తరుణంలో గడువు పొడిగించాలని కోరుతున్నారు. జాతీయ వైద్య కమిషన్‌ ఈ నెల 14 నుంచి ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts