Gautam Sawang:ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌?

డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. ఆ పోస్టులో చేరేందుకు సవాంగ్‌ కూడా

Updated : 18 Feb 2022 05:35 IST

ఐపీఎస్‌కి రాజీనామా చేసి చేరాల్సిందే

ఈనాడు, అమరావతి, ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. ఆ పోస్టులో చేరేందుకు సవాంగ్‌ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో... సర్వీసులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ పోస్టులో చేరాలంటే సర్వీసుకు రాజీనామా చేయాలి. సవాంగ్‌ ఐపీఎస్‌కి రాజీనామా చేశాకే... ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలి. సవాంగ్‌ పదవీ విరమణకు 2023 జులై వరకు గడువు ఉంది. అంటే ఇంకా 17 నెలలకుపైగా సర్వీసు ఉంది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఆరేళ్లు గానీ, 62 ఏళ్ల వయసు వరకు గానీ కొనసాగవచ్చు. ఐపీఎస్‌కి రాజీనామా ప్రక్రియ పూర్తి చేసుకుని ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పోస్టులో ఆయన మూడున్నరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.  


సవాంగ్‌కు లేని బాధ వాళ్లకెందుకో: మంత్రి బాలినేని

‘రాష్ట్ర డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ రెండున్నరేళ్లు పనిచేశారు. అంత కాలం పనిచేసిన ఏ అధికారినైనా బదిలీ చేయడం సహజం. ఆయన బాగానే ఉన్నారు.. మధ్యలో వీళ్లకొచ్చిన బాధేంటో’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఒంగోలులో గురువారం విలేకర్లతో మాట్లాడారు. సవాంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేయలేదన్నారు. ఆయనను అత్యంత కీలకమైన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించనుందని తెలిపారు. ‘ఆయన బాగానే ఉన్నారు. సీఎంను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ బాధ్యతల్నీ సంతోషంగా స్వీకరించబోతున్నారు. మధ్యలో వీళ్లకేంటో బాధ’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ జీవితంలో బదిలీలు అత్యంత సర్వసాధారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు 9 గంటలపాటు పగటి పూటే ఉచిత విద్యుత్తును ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని