నా సస్పెన్షన్‌ ఎత్తివేత జీవో అసంపూర్ణం

తన సస్పెన్షన్‌ ఎత్తేస్తూ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో అసంపూర్ణంగా ఉందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. 2020

Published : 20 May 2022 04:20 IST

న్యాయస్థానాల ఆదేశాల్ని సరిగ్గా చదవలేదా?

ఐఏఎస్‌లకు ఒక న్యాయం.. మాకో న్యాయమా?

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

ఈనాడు, అమరావతి: తన సస్పెన్షన్‌ ఎత్తేస్తూ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో అసంపూర్ణంగా ఉందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచే సస్పెన్షన్‌ ఎత్తివేత వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, ఇది సరికాదని చెప్పారు. అధికారులు న్యాయస్థానాల ఆదేశాల్ని సరిగ్గా చదవలేదా? లేకుంటే న్యాయాభిప్రాయమే అలా వచ్చిందా? అనేది తనకు తెలియదని వివరించారు. ‘మీరిచ్చిన ఆదేశాలు అసంపూర్ణంగా ఉన్నాయి. వాటిని సరిచేయండి. లేకుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పదు’ అనే విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనను కలవాలనుకున్నానని, సీఎస్‌ కార్యాలయంలో అందుబాటులో ఉన్నప్పటికీ తనను కలవటానికి ఇష్టపడలేదని వివరించారు. ప్రతి అంశం అమలు కోసం కోర్టును ఆశ్రయించాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయని తెలిపారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసి జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వటానికి వెళ్లాను. ఆ రిపోర్టు తీసుకుని పంపించేయాలంటూ సీఎస్‌ చెప్పారని ఆయన పీఏ తెలిపారు. సివిల్‌ సర్వీసెస్‌ సంప్రదాయం ప్రకారం జూనియర్‌ అధికారులకు సీనియర్లు రిపోర్టు చేయరు. అందుకే సీఎస్‌ను కలవాలనుకున్నా. సీఎస్‌ పదవీ విరమణ వయసు అయిపోయి పొడిగింపుపై కొనసాగుతున్నారు. నాకు ఇంకా రెండేళ్లు సర్వీసు ఉంది. నేనూ ఆయనలాగే అదే యూపీఎస్సీ పరీక్ష రాసే వచ్చాను కదా! నాలాగే పోస్టింగు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచిన కొందరు ఐఏఎస్‌ అధికారులకు మాత్రం జీతాలు ఇచ్చారు. నాకు మాత్రం ఏడు నెలల పాటు ఇవ్వలేదు. చివరికి కోర్టును ఆశ్రయిస్తే తప్ప నాకు జీతం ఇవ్వలేదు. ఐఏఎస్‌లకు ఓ న్యాయం, మాకో న్యాయమా?

సంవత్సరాల తరబడి వీఆర్‌లో పెట్టారు..
కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ ర్యాంకు అధికారుల వరకూ చాలామందిని సంవత్సరాల తరబడి వీఆర్‌లో పెట్టారు. తర్వాత పోస్టింగు ఇచ్చినా వీఆర్‌లో ఉన్న కాలానికి జీతాలు ఇవ్వలేదు. తాము ఫలానా కులానికి చెందిన వాళ్లం కాబట్టి వీఆర్‌లో పెట్టారని కొందరు, అప్పట్లో నిఘా విభాగంలో పని చేసినందున పక్కన పెట్టారని మరికొందరు.. మీ దగ్గర పని చేశామని మీకు బాగా దగ్గరగా ఉన్నామనే కారణంతో తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ మరికొందరు నాతో చెప్పి వాపోయారు. నిజంగా వారు తప్పు చేస్తే శిక్షించండి. అంతే తప్ప వేతనంపైనే బతికే ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతం ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారు? ఇవన్నీ సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా.

మూడేళ్లుగా అధికారంలో ఉన్నారు.. ఏం పీకారు?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల నాపై కొన్ని ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా వారే అధికారంలో ఉన్నారు కదా! ఏం పీకారు? సుప్రీం కోర్టు ఆదేశిస్తే తప్ప నాపై ఏడాదిన్నర పాటు కనీసం అభియోగపత్రం నమోదు చేయలేకపోయారు. అందులోని అంశాలేవి నిరూపించలేకపోయారు. ఇప్పటికే మూడేళ్లు అయిపోయింది. నాపై చేసిన ఆరోపణల వ్యవహారాన్ని ఇప్పటికైనా త్వరగా తేల్చండి. గతంలో ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యంపై దాడి వ్యవహారంలో కేసు నమోదు చేయాలనే నేను పట్టుబట్టా. అప్పట్లో విజయవాడ సీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ కేసు ఎందుకు నమోదు చేయలేదో ఆయన్నే సజ్జల అడగాలి. కనీసం ఆయన డీజీపీ అయ్యాకైనా సరే ఎందుకు కేసు నమోదు చేయలేకపోయారో సమాధానం చెప్పాలి. నేను నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో నా దృష్టికి వచ్చిన అనేక అంశాల్లో అమానవీయ పనులు చేయొద్దనే పోలీసులకు చెప్పేవాణ్ని. దీంతో అప్పటి ప్రతిపక్షానికి కొమ్ముకాస్తున్నానంటూ నాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఏదైనా అనే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి.

2020 ఫిబ్రవరి 8 నుంచి వేతనాలు, భత్యాలు చెల్లించాలి
హైకోర్టు ఆదేశాల మేరకు 2020 ఫిబ్రవరి 8 నుంచి ఇప్పటివరకూ పూర్తి వేతనాలు, భత్యాలు చెల్లించాలి. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాను. నేను జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చేశాను. పోస్టింగ్‌ ఇస్తారా.. ఇవ్వరా అనేది ప్రభుత్వ ఇష్టం. నాకు పోస్టింగు ఇవ్వకపోతే ప్రజాధనం వృథా అయినట్లే. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి నా అక్రమ సస్పెన్షన్‌కు కారణమైన అధికారులు, అధికారేతరుల నుంచి కోర్టు ఖర్చులు వసూలు చేయాలని సీఎస్‌కు లేఖ రాశాను.

తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై దావా
ఎన్నికల సంఘానికి నాపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసిన ఘటనలో పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరాను. నిర్దేశిత కాలపరిమితి దాటిపోయినందున ఆ అనుమతి లభించినట్టే లెక్క. ఈ వ్యవహారంలో కొంతమందికి నోటీసులు కూడా పంపించాను’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని