జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలోని కాసానగర్‌ వద్ద జాతీయ రహదారి- 216పై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన అయిదుగురు దుర్మరణం

Published : 27 May 2022 05:48 IST

పెళ్లికి వెళ్తున్న ట్రక్‌ ఆటో బోల్తా

అయిదుగురు దుర్మరణం 

మోపిదేవి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలోని కాసానగర్‌ వద్ద జాతీయ రహదారి- 216పై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. వారంతా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామానికి చెందినవారు. వివాహ సందర్భంగా పెళ్లి కుమార్తె తరఫు బంధువులు 21 మంది చింతలమడ గ్రామం నుంచి మోపిదేవి మండలం పెదప్రోలులో వరుడి ఇంటికి ట్రక్‌ ఆటోలో బయలుదేరారు. చల్లపల్లి దాటిన తర్వాత కాసానగర్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవరు సడన్‌ బ్రేక్‌ వేయటంతో వాహనం అదుపు తప్పింది. ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ప్రయాణికులందరూ ఒకవైపు పడిపోవడంతో వాహనం అటువైపు ఒరిగిపోయి దాదాపు 20 మీటర్ల దూరం అలాగే దూసుకుపోయింది. అప్పటికే రహదారి పక్కన చాన్నాళ్లుగా ప్రమాదకరంగా ఒరిగిపోయి ఉన్న వ్యాపార ప్రకటన ఫ్లెక్సీ యాంగ్లర్‌ను ఢీకొట్టి ఇనుప రాడ్డు తగిలి ఆగింది. లేకుంటే ఆటో మరింత దూరం దూసుకుపోయి ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. ఈ దుర్ఘటనలో గుర్రం విజయకుమారి (50), బూరేపల్లి రమణ (52), బూరేపల్లి వెంకటేశ్వరమ్మ (50), కోన వెంకటేశ్‌ (70) తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని విజయవాడ తరలిస్తుండగా ఎం.మాధవరావు (65) అనే వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతావారు బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవరు అతివేగంగా నడిపి వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని అవనిగడ్డ డీఎస్‌పీ మహబూబ్‌ బాషా తెలిపారు. అతడు మద్యం మత్తులో ఉండి ఉంటాడని అనుమానిస్తున్నామని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని