మట్టి మింగేస్తున్నారు

కొండల్ని పిండి చేస్తున్నారు.. చెరువుల్ని చెరబడుతున్నారు.. కాలువ కట్టల్నీ కొల్లగొడుతున్నారు.. ఖాళీ భూమి కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. మట్టి, గ్రావెల్‌, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు

Updated : 07 Jul 2022 06:51 IST

అధికార పార్టీ నాయకులకు రూ.కోట్లు కురిపిస్తున్న అక్రమ తవ్వకాలు

రోజూ వేల టిప్పర్లలో మట్టి, గ్రావెల్‌, కంకర తరలింపు

కార్యకర్తల నుంచి రాష్ట్ర నేతల వరకూ దందాలో భాగస్వాములే

ఫిర్యాదిస్తే అంతుచూస్తామని బెదిరింపులు.. అడ్డుకుంటే దాడులు

గేదెల భరత్‌కుమార్‌

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

కొండల్ని పిండి చేస్తున్నారు.. చెరువుల్ని చెరబడుతున్నారు.. కాలువ కట్టల్నీ కొల్లగొడుతున్నారు.. ఖాళీ భూమి కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. మట్టి, గ్రావెల్‌, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు.

ఇది ఓ ఊరికో, ఓ జిల్లాకో పరిమితం కాలేదు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ అక్రమ తవ్వకాలే. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపులే. వీటన్నింటి వెనుకా కొంతమంది అధికార పార్టీ నేతలదే ప్రధాన హస్తం. పలువురు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరూ ఈ దందాలో భాగస్వాములే. ఈ అక్రమాలపై ఫిర్యాదు ఇచ్చినవారిని అంతుచూస్తామని హెచ్చరికలు.. అడ్డుకున్నవారిపై దాడులు.. తనిఖీలకు వస్తే ఊరుకునేది లేదని బెదిరింపులు.. కావాల్సింది తీసుకుని మిన్నకుండిపోవాలంటూ ప్రలోభాలు నిత్యకృత్యమైపోయాయి. అందుకే అధికార గణం అటు వైపు కన్నెత్తే చూడదు. ఫిర్యాదులొచ్చినా పట్టించుకోదు. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఈ అక్రమాల్ని బయటపెట్టేందుకు వెళితే అడుగడుగునా అడ్డంకులే. దారి పొడవునా దాడులే. దీన్ని అడ్డుకోవటానికి కొందరు హైకోర్టు మెట్లెక్కారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ తవ్వకాలపై ‘ఈనాడు’ ఇటీవల చేసిన క్షేత్రస్థాయి పరిశీలన కథనం..

కొండా, గుట్టా తేడా లేదు..

కాలువా, చెరువా అని చూసే పనేలేదు

మట్టి దొరికితే మేసేయడమే. కంకర కనిపిస్తే తోడేయడమే.

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

పగలూ, రాత్రీ తేడాలేకుండా సాగుతున్న అక్రమ తవ్వకాలతో కాసులు కళ్లజూస్తున్న అధికార పార్టీ నేతలు.. వారి పేరు చెప్పుకొని దొరికినకాడికి దోచుకుంటున్న దిగువ స్థాయి నాయకులు.. సహజ వనరులను చెరబట్టేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చినా, అడ్డుకోవడానికి అధికారులొచ్చినా బెదిరింపులు.. మాట వినకపోతే మూకదాడులతో మట్టి మాఫియా చెలరేగిపోతున్న తీరు రాష్ట్రమంతటా కనిపిస్తోంది.


మా వాళ్లు తవ్వుకుంటారు.. మీరు మాట్లాడొద్దు
మా వాళ్లు మట్టి తవ్వుకుంటారు. తనిఖీలు, జరిమానాలు, కేసులు అంటూ ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. ఇక్కడ పని చేయటం ఇష్టం లేకపోతే వేరే చోటకు వెళ్లిపోండి

- ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు ఇటీవల రెవెన్యూ డివిజన్‌, మండల స్థాయి అధికారులకు చేసిన హెచ్చరిక


మేం ఎమ్మెల్యే మనుషులం..
మీకు దిక్కున్నచోట చెప్పుకోండి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురంలో మట్టి అక్రమ తవ్వకాల్ని అడ్డుకోబోయిన దళిత సర్పంచి విజయలక్ష్మితో వైకాపా నాయకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భర్త, కుమారుణ్ని చంపేస్తామని హెచ్చరించారు. ‘మాకు ఎమ్మెల్యే మద్దతు ఉంది. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ బెదిరించారని విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.


కప్పం కడితేనే..  టిప్పరు కదిలేది

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం, శేకూరు, శుద్ధపల్లి, వేజండ్ల, చేబ్రోలు పరిధిలో రైతుల నుంచి భూమి కొని కొందరు ఎర్రమట్టి తవ్వుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో మట్టి తవ్వుకున్నందుకు వీరి దగ్గర నుంచి స్థానిక అధికార పార్టీ నేత రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి అనుచరులూ ఇక్కడ దందా సాగించారు.

* గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలాల్లో మట్టి ఎవరు తవ్వుకోవాలన్నా అధికార పార్టీ నేతల ప్రతినిధి అనుమతి తప్పనిసరి.

* ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడికి.. పంచాయతీ పరిధిలో ఎవరు మట్టి తరలించినా కప్పం కట్టడం తప్పనిసరి.


అక్రమ తవ్వకాలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. నియోజకవర్గ నేతలు, కొందరు ప్రజాప్రతినిధుల అండతో మండల స్థాయి నాయకులు కనపడిన చోటల్లా జేసీబీలు దించి, మట్టి, కంకర, గ్రావెల్‌ తోడేస్తున్నారు. ట్రాక్టరుకు ఇంత, టిప్పరుకు ఇంతని రేటు పెట్టి అమ్మేస్తున్నారు.

* చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లె, బోగరబావిగుట్ట, మేలుపట్ల చెరువులో మట్టి అక్రమంగా తవ్వి నేతిగుట్టపల్లె రిజర్వాయర్‌ పనుల్లో ఉపయోగించారు. దీని వెనుక అధికార పార్టీ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధిదే కీలకపాత్ర.

* కడప జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరి సిఫార్సుతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నున్న, గన్నవరం, నూజివీడు ప్రాంతంలో పోలవరం కట్టలపై మట్టి తవ్వకాలకు కడప జిల్లా వాసులు అనుమతులు పొందారు. పరిమితికి మించి చాలారెట్లు అధికంగా తవ్వేశారు.

* పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం సంగంగోపాలపురంలో రాష్ట్ర స్థాయి నేత సిఫార్సుతో గ్రావెల్‌ను అనుమతికి మించి తవ్వేశారు. వేమూరు నియోజకవర్గం చినగాదెలవర్రు, మోదుకూరు చెరువుల్లో అక్రమ తవ్వకాలకూ అధికార పార్టీ నేతలదే అండాదండ.

* ఇద్దరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొండపావులూరు, మాదాలవారిగూడెం, సూరంపల్లి, గొల్లనపల్లిల్లో గుట్టలు, కొండ పోరంబోకుల్లో ఇష్టానుసారం తవ్వేసి మట్టి, గ్రావెల్‌ తరలించారు.


అక్రమాలు బయటపెడితే దాడులే..

అక్రమ తవ్వకాలను బయటపెట్టేందుకు వెళితే మూకదాడికి సిద్ధపడుతున్నారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం చినగాదెలవర్రు చెరువులో అధికార పార్టీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించిన నక్కా లక్ష్మయ్యపై కొంతమంది దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో చేరారు. 

* ఏలూరు జిల్లా చేబ్రోలులోని తిమ్మయ్యపాలెం దారిలో లారీల్లో మట్టిని తరలిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ నాయకులు వారిని బెదిరిస్తున్నారు.

* ముదినేపల్లి మండలం ఊటుకూరులో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వి, ప్రైవేటు చెరువుకు రహదారి వేశారు. అడ్డుకోబోయిన సర్పంచి భర్తపై దాడికి యత్నించారు.

* తిరుపతి జిల్లా మదనంజేరి అటవీ ప్రాంతం నుంచి మట్టి తరలిస్తున్నారంటూ ఆందోళన చేసిన వ్యక్తులపైనే పోలీసులు కేసు కట్టారు.

* గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను పరిశీలించటానికి ఇటీవల తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ప్రయత్నిస్తే వైకాపా నాయకులు రాళ్లతో దాడిచేసి కారు అద్దం పగులగొట్టారు. మరోసారి పోలీసులు, వైకాపా కార్యకర్తల అడ్డంకులను దాటుకుని అక్కడికి వెళ్లిన నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం చేశారు.


బెదిరింపులు, భౌతిక దాడులు

పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మట్టి తరలింపును అధికారులు అడ్డుకుంటున్నారంటూ అధికార పార్టీ కార్యకర్తలు తమ నాయకుడితో చెప్పారు. మీకు నచ్చిన చోటికి మట్టి తరలించుకోండి ఎవడు అడ్డొస్తాడో చూద్దాం అంటూ ఆయన వారికి వంతపాడారు.

* కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం జువ్వలపాలెంలోని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని వైకాపా నాయకులు చుట్టుముట్టారు. ఆ దౌర్జన్యాన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్‌ బాలకృష్ణను తలపై కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.

* కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆర్‌ఐ జాస్తి అరవింద్‌పై మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడైన వైకాపా నాయకుడు గంటా లక్ష్మణరావు.. దాడికి దిగారు. మీడియాలో విస్తృత ప్రచారమవటంతో ఆర్‌ఐ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు కట్టారు. ఆర్‌ఐ రూ.లక్ష లంచం అడిగారని గంటా లక్ష్మణరావు ఫిర్యాదు ఇచ్చారంటూ నాలుగు రోజుల తర్వాత రివర్స్‌ కేసు నమోదు చేయడం గమనార్హం.


ఒక్క చెరువు.. 15 రోజుల్లో కోటి రాబడి

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని వెల్వడం చెరువులో మట్టి తవ్వకాలతో అధికార పార్టీ నేత ఒకరు కేవలం  15 రోజుల్లోనే రూ.కోటికి పైగా ఆర్జించారు.

* కడప సమీపంలోని చలమారెడ్డిపల్లె ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా మట్టి తవ్వి, టిప్పర్‌ రూ.15 వేలకు అమ్మేశారు. రోజూ వందల ట్రిప్పులు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.

* అధికార పార్టీ స్థానిక నాయకులు పల్నాడు జిల్లా పిన్నెల్లిలోని నల్లచెరువులో 3 నెలలపాటు ట్రాక్టర్లు, టిప్పర్లతో వేల ట్రక్కుల మట్టిని తరలించారు.\

* ప్రకాశం జిల్లాలోని యరజర్ల, మల్లవరం, కందులూరు, బూరేపల్లి కొండల్లో మట్టి తవ్వి గత రెండేళ్లలో రూ.50 కోట్లు పోగేసుకున్నారు. దీనిలో ఓ ప్రజాప్రతినిధి వియ్యంకుడి పాత్రపై ఆరోపణలున్నాయి.


బంధువులు, అనుచరులు అందరిదీ హవాయే

* చిత్తూరు మండలం బండపల్లెలోని గుట్టపై అక్రమంగా తవ్వి రోజుకు 50- 70 టిప్పర్ల చొప్పున నెలపాటు తరలించారు. నియోజకవర్గ స్థాయి నేత బంధువు ఒకరు ఈ వ్యవహారం నడిపించారు.

* సత్యవేడు పరిధిలో అక్రమ తవ్వకాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడు, బంధువుదే కీలకపాత్రన్న ఆరోపణలు ఉన్నాయి.

* ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ అధికార పార్టీ నాయకుల అండతో.. నందికొట్కూరు, పగిడ్యాల పరిధిలో కృష్ణా వెనుక జలాలు తగ్గినప్పుడు ముంపు భూముల్లోని సారవంతమైన మట్టిని రెండు వేల ట్రక్కులు తరలించేశారు. కుందూ విస్తరణ పనుల్లో వస్తున్న మట్టినీ రాత్రిళ్లు తరలిస్తున్నారు. 

* కావలి నియోజకవర్గ స్థాయి నేతతోపాటు నామినేటెడ్‌ పోస్టులో ఉన్న ఓ నాయకుడి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కౌరుగుంటలో దగదర్తి- ముంగమూరు కట్టను తవ్వేశారు.

* బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం చినగాదెలవర్రు, మోదుకూరు చెరువుల్లో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.


అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యాలు

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై అబ్బయ్య చౌదరి, అనుచరులకు హైకోర్టు నోటీసులిచ్చింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ, ఎడ్లలంకల్లో రాజకీయ నేతల ప్రమేయంతో ఇసుక, బుసక, మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారంటూ మరో పిల్‌ దాఖలైంది.


కొండ తవ్వి.. చెరువు చేశారు

ఇవి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలోని గ్రావెల్‌ కొండలు. అక్రమార్కుల చేతిలో పడి ఇప్పుడిలా చెరువుల్లా మిగిలాయి. ఇక్కడ 23 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. 20 నుంచి 30 అడుగుల ఎత్తున ఉన్న కొండల్ని చదును చేస్తామంటూ రంగంలోకి దిగిన కొందరు అధికార పార్టీ నాయకులు.. గ్రావెల్‌, మట్టి మొత్తం భోంచేశారు. 30-40 అడుగుల లోతు వరకూ తవ్వి, కాసులు పోగేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని