NTR Daughter: ఎన్టీఆర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌

Updated : 02 Aug 2022 07:10 IST

చిన్న కుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణం

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-జూబ్లీహిల్స్‌, ఉస్మానియా ఆసుపత్రి: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 9లో భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌, చిన్నకుమార్తె దీక్షిత, అల్లుడు రాహుల్‌ చౌదరితో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె విశాల, ఆమె భర్త అమెరికాలో ఉంటున్నారు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉమామహేశ్వరి.. కుమార్తె, అల్లుడితో కొద్దిసేపు మాట్లాడారు. 10 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమార్తె భోజనానికి పిలవగా ఎంతకూ తలుపు తీయలేదు. కుమార్తె, అల్లుడు తలుపు గట్టిగా కొట్టడంతో గడియ ఊడిపోయింది. లోపల ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. కిందకు దించి పరిశీలించగా.. అప్పటికే ఆమె మృతి చెంది ఉన్నారు. ఘటన సమయంలో ఇంట్లో కుమార్తె, అల్లుడితో పాటు ఆడపడుచు నిరుపమ, పనిమనిషి ఉన్నారు. బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి వివరాలు సేకరించారు. అనారోగ్యంతో పాటు ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుమార్తె దీక్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉమామహేశ్వరి కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి వైద్యులు నేత్రాలను సేకరించారు. వ్యాపార రీత్యా ఏపీలోని అనంతపురం జిల్లాకు వెళ్లిన శ్రీనివాస ప్రసాద్‌.. భార్య మరణవార్త తెలుసుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉమామహేశ్వరి రెండో కుమార్తె దీక్షిత వివాహం మూడు నెలల క్రితమే జరిగింది. ఇంతలోనే తల్లి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉమామహేశ్వరి పార్థివదేహానికి సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలతో పాటు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, సోదరి భువనేశ్వరి, నారా లోకేశ్‌, బ్రాహ్మణి, నందమూరి సుహాసిని, కల్యాణ్‌రామ్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెదేపా తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్‌రావు, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తదితరులు నివాళి అర్పించారు.

ఇటీవలే ఆనందంగా గడిపాం.. ఇంతలోనే విషాదం: చంద్రబాబు
ఉమామహేశ్వరి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇటీవలే కుటుంబ సభ్యులందరం కలుసుకొని ఆనందంగా గడిపాం. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం. ఎన్టీఆర్‌ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.


‘చిన్నమ్మ మృతి బాధాకరం’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘‘ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ దగ్గరుండి జరిపించేవారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని