సంక్షిప్త వార్తలు (5)

ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ జీతభత్యాలను గ్రంథాలయాల పన్ను నిధుల నుంచి చెల్లించాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 13 Aug 2022 05:46 IST

గ్రంథాలయ పన్ను నిధుల  నుంచి ఛైర్మన్‌ జీతభత్యాలు

ఈనాడు, అమరావతి: ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ జీతభత్యాలను గ్రంథాలయాల పన్ను నిధుల నుంచి చెల్లించాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి స్థానిక సంస్థలు వసూలు చేసే గ్రంథాలయ పన్నుల నుంచి చెల్లించాలని పేర్కొన్నారు. జీతభత్యాలను ‘ఆర్‌’ కేటగిరీలో పెట్టారు. నెలకు సుమారు రూ.2లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రజా గ్రంథాలయాల డైరెక్టర్‌ను ఆదేశించారు.


నేర దర్యాప్తులో ప్రతిభకు కేంద్ర హోంశాఖ పతకాలు
రాష్ట్రం నుంచి అయిదుగురు పోలీసు అధికారుల ఎంపిక

ఈనాడు, అమరావతి: నేరాల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 2022 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. సీతారామయ్య (డీఎస్పీ), కన్నుజు వాసు (ఇన్‌స్పెక్టర్‌), షేక్‌ ఖాదర్‌ బాషా (ఎస్సై), కొల్లి శ్రీనివాసరావు (ఏసీపీ), ముత్యాల సత్యనారాయణ (ఇన్‌స్పెక్టర్‌)లకు ఈ పతకాలు లభించాయి. ‘‘యూనియన్‌ హోమ్‌ మినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’’ పేరిట ఈ పతకాల్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 151 మంది పోలీసు సిబ్బందికి ఈ పతకాలు లభించగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పైన పేర్కొన్న అయిదుగురు అధికారులు ఉన్నారు.


శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తాం

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులపై ఏపీవీవీపీ కమిషనర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్పెషలిస్ట్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా నియమితులైన వైద్యులకు వేతన స్కేలు, ఇతర అలవెన్సులు లభిస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 50% అదనపు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు.


‘పదవీ విరమణ వయసు  పెంపును ఉద్యోగులందరికీ వర్తింపజేయాలి’

ఈనాడు, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు కోరారు. గత జనవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు చెందిన ఉద్యోగులకు ఇది వర్తించడం లేదని పేర్కొన్నారు.


పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో నర్సింగ్‌, ఫిజియోథెరపీ, ల్యాబ్‌ టెక్నాలజీ డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ల్యాబ్‌ టెక్నాలజీ, న్యూరో ఫిజియాలజీ, ఆప్టొమెట్రిక్‌, రీనాల్‌ డయాలసిస్‌, కార్డియాక్‌ కేర్‌, అనస్తీషియాలజీ, ఇమేజింగ్‌, ఎమెర్జీన్సీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్సులకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని