ముఖ్యమంత్రి వస్తున్నారని తిరుపతిలో అన్నీ బంద్‌

ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో

Updated : 28 Sep 2022 06:43 IST

జనం ఇళ్లలోంచి బయటకు రాకుండా నిర్బంధం

దుకాణాల మూత.. మార్కెట్‌ గేట్లు మూసివేత

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు; తిరుపతి (తాతయ్యగుంట), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6.35 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. అసలే శ్రీనివాస సేతు పనులు జరుగుతుండగా ఉన్న మార్గాల్లో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో సామాన్యులకు కష్టాలు తప్పలేదు. తొలుత ఎంఆర్‌పల్లి నుంచి బాలాజీ కాలనీ, ఎన్టీఆర్‌ కూడలి, గాంధీ రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయ కూడలి ప్రాంతాల్లో గంటకు పైగా రాకపోకలు నిలిపివేశారు. మున్సిపల్‌ కార్యాలయ కూడలి మీదుగా తుడా రోడ్డులో వాహనాలను పూర్తిగా నిషేధించారు. తాతయ్యగుంట ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉదయమే పోలీసులు దుకాణాలు మూసేశారు. మళ్లీ తెరవకుండా అక్కడే తిష్ఠ వేశారు. సీఎం వెళ్లిన తర్వాతే తెరుచుకున్నాయి. ప్రజలను సైతం ఇళ్లలో నుంచి బయటకు రానీయకుండా నిలువరించారు. పలువురు తెదేపా నేతలను అరెస్టు చేశారు. కొంతమందిని గృహ నిర్బంధంలో ఉంచారు. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మంగళవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సీఎం పర్యటన నేపథ్యంలో సామాన్యులకు దర్శనాలు నిలిపివేశారు.

మార్కెట్‌ గేట్లూ మూసేసి..
సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌ గేట్లను మూసేశారు. కూరగాయలు కొనుక్కోడానికి వచ్చినవారిని బయటకు వెళ్లనివ్వలేదు. పోలీసులను వేడుకున్నా ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత పంపిస్తామంటూ తేల్చిచెప్పారు. సీఎం కాన్వాయ్‌ అలిపిరికి బయలుదేరిన అనంతరం సాయంత్రం 6.35 గంటలకు బారికేడ్లు తెరవడంతో జనం బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. తాతయ్యగుంట ఆలయ సమీపంలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం బోసిపోయింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడంతో వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు.

అర్జీలు ఇద్దామన్నా నిరాశే  
ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్జీల రూపంలో తమ సమస్యలను విన్నవించేందుకు పరిసర జిల్లాల నుంచి కొందరు వచ్చారు. ఉదయం నుంచే నిరీక్షించినా వారికి నిరాశే ఎదురైంది. జేసీ బాలాజీ వాటిని తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని