వర్సిటీల నిధులపై సర్కారు కన్ను!

‘విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లోనూ ఫీజు రీయింబర్స్‌ చేస్తాం. అవి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందుతాయి’

Published : 29 Sep 2022 03:33 IST

రూ.2,000 కోట్లు తీసుకునేందుకు వివరాల సేకరణ

ఇప్పటికే రూ.150 కోట్లు ఎస్‌ఎఫ్‌ఎస్‌సీలో డిపాజిట్‌

‘విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లోనూ ఫీజు రీయింబర్స్‌ చేస్తాం. అవి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందుతాయి’

- 2021 అక్టోబరు 25న ఉన్నత విద్య సమీక్షలో సీఎం జగన్‌

వాస్తవం: తాము ఇచ్చిన వాటితోపాటు, పిల్లలు చెల్లించిన ఫీజుల డబ్బులనూ ప్రభుత్వమే లాగేసుకుంటోంది. రాష్ట్ర ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ అని చెబుతున్నా ప్రభుత్వం వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. నిధులు లేకపోతే విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటి?


ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల నిధులను ఇతర కార్యకలాపాలకు మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఒకసారి వర్సిటీల నుంచి రూ.150 కోట్లను రాష్ట్ర ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో (ఎస్‌ఎఫ్‌ఎస్‌సీ) డిపాజిట్‌ చేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరోమారు నిధులపై దృష్టి పెట్టింది. అన్ని విశ్వవిద్యాలయాల నుంచి రూ.2వేల కోట్లను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశ్వవిద్యాలయాల ప్రొఫైల్‌ పేరుతో ఉన్నత విద్యా మండలి ద్వారా ఆర్థిక వివరాలను సేకరిస్తోంది. కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేస్తే అవి వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే వర్సిటీలు గగ్గోలు పెడుతున్నాయి. మీ వర్సిటీలో ఎంత మంది పని చేస్తున్నారు? ఎంతమంది పింఛనర్లు ఉన్నారు? ఏడాదికి జీతాలు, పింఛన్లకు ఎంత చెల్లిస్తున్నారు? మీ ఆదాయ వనరులేంటి? ఇప్పటివరకు ఎంత నిల్వ ఉంది? ఏయే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు? కాలపరిమితి ఎప్పటికి పూర్తవుతుంది? అంతర్గత ఆదాయవనరులతో చేస్తున్న అభివృద్ధి కార్యకలాపాలేంటి? అనే వివరాలను అందించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.

పదవీ విరమణ ప్రయోజనాలకూ కష్టమే

విశ్వవిద్యాలయాలు, బోర్డులలోని నిధులను కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కొంత మొత్తం డిపాజిట్‌ చేశారు. అంతా డిపాజిట్‌ చేస్తే వెనక్కి రావని కొన్నింటిని అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు వాటినీ లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పింఛన్లు, జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్‌ సరిపోకపోవడంతో సొంత నిధులను ఖర్చుచేస్తున్నాయి. పిల్లల ఫీజుల డబ్బులనూ వదలడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పదవీవిరమణ చేస్తున్న ఉద్యోగులకు మూడేళ్లుగా ప్రయోజనాలను అందించట్లేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నిధులనూ తీసేసుకుంటే భవిష్యత్తులో ఈ వర్సిటీ పరిస్థితి ఏంటి? రూ.40 కోట్లు పదవీవిరమణకు చెల్లించాల్సి ఉంది.

* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పింఛనర్లు సుమారు 4వేల మంది ఉన్నారు. వీరికి చెల్లించేందుకు ఏడాదికి రూ.210కోట్లు కావాలి. ప్రభుత్వం అన్నింటికీ కలిపి రూ.200కోట్లు ఇస్తోంది. దీంతో విశ్వవిద్యాలయానికి ఫీజులు, ఇతర ఆదాయం నుంచి ఏటా రూ.100కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల నిధులు కలిపి సుమారు రూ.400కోట్లు ఉన్నాయి. ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది పదవీవిరమణ పొందితే విశ్వవిద్యాలయం నిధుల నుంచి చెల్లిస్తున్నారు.

* జేఎన్‌టీయూ అనంతపురం ఇప్పటికే కార్పొరేషన్‌లో రూ.50కోట్లు డిపాజిట్‌ చేసింది. వర్సిటీ కార్యకలాపాలు, పదవీవిరమణ ప్రయోజనాలు, నిర్వహణకు రూ.400కోట్ల వరకు ఉంచుకున్నారు. నిధుల కోసం ప్రభుత్వం వర్సిటీపై ఒత్తిడి తీసుకొస్తే భవిష్యత్తు కార్యకలాపాలను నిలిపివేయాలి. జేఎన్‌టీయూ కాకినాడ మొదటివిడతగా రూ.70కోట్లు డిపాజిట్‌ చేసింది. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో దీనికి ఆదాయం ఎక్కువ. ఇక్కడ సుమారు రూ.450కోట్ల వరకు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని