‘గాలి’ కేసులో రోజువారీ విచారణ

‘గాలి జనార్దన్‌రెడ్డి కేసు విచారణ రోజువారీ జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నాం. కేసు పురోగతిని జనవరిలో సమీక్షించాలనుకుంటున్నాం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం’

Updated : 30 Sep 2022 05:51 IST

జనవరిలో పురోగతిని సమీక్షిస్తాం

సూచనప్రాయంగా వెల్లడించిన సుప్రీంకోర్టు

బళ్లారికి వెళ్లడానికి అనుమతివ్వద్దని సీబీఐ వాదనలు

షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషిన్‌ వేయలేదే అన్న ధర్మాసనం

ఈనాడు, దిల్లీ: ‘గాలి జనార్దన్‌రెడ్డి కేసు విచారణ రోజువారీ జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నాం. కేసు పురోగతిని జనవరిలో సమీక్షించాలనుకుంటున్నాం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం’ అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కడప, అనంతపురం, బళ్లారి వెళ్లకుండా ఉండాలనే తన బెయిల్‌ షరతులు సడలించాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు. ‘గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ సడలించవద్దు. ఈ అంశంలో ఆయనపై తీవ్రమైన అభియోగాలున్నాయి. ఓ న్యాయమూర్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెయిల్‌ కోసం రూ.40 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. బెయిల్‌ సమయంలో పెట్టిన షరతులన్నింటినీ ఆయన ఉల్లంఘించారు’ అని తెలిపారు. గాలి తరఫున సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ‘జనార్దన్‌రెడ్డికి షరతులతో బెయిల్‌ ఇవ్వడానికి సీబీఐ గతంలో ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. ఆరేళ్లపాటు బెయిల్‌పై ఉన్న ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో 26సార్లు బళ్లారి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. అప్పుడు కోర్టు విధించిన షరతులను జనార్దన్‌రెడ్డి ఉల్లంఘించలేదు. అయినప్పటికీ షరతుల సడలింపునకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన కుటుంబం అంతా బళ్లారిలోనే ఉంటున్నా అక్కడికి వెళ్లేందుకు అనుమతివ్వడం లేదు. ట్రయల్‌ కోర్టులో జనార్దన్‌రెడ్డి డిశ్చార్జి పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. 300 మంది సాక్షుల్లో కేవలం 20 మందే బళ్లారిలో ఉన్నారు. అయినా వారిని ప్రభావితం చేస్తారని సీబీఐ వాదిస్తోంది. ఈ కేసులో వంద మందికి పైగా సాక్షులు బెంగళూర్‌, హైదరాబాద్‌ల్లో ఉంటున్నారు. అక్కడ అభ్యంతర పెట్టని సీబీఐ బళ్లారి విషయంలో వ్యతిరేకంగా వాదిస్తోంది’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

విచారణ ఆలస్యానికి కారణమెవరు?
ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ట్రయల్‌ కోర్టులో విచారణ ఆలస్యానికి కారణం ఎవరు? నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జి పిటిషన్లు వేయడం, స్టేలు కోరడం కాదా అని ప్రశ్నించారు. మైనింగ్‌ వ్యవహారానికి సంబంధించి కర్ణాటకలో అయిదు కేసుల విచారణ వేగంగా సాగుతోందని, హైదరాబాద్‌లో విచారణ పదకొండేళ్లుగా పురోగతి లేదని గాలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇతర నిందితులు డిశ్చార్జి పిటిషన్లు ఇక్కడ ఆలస్యానికి కారణం కావచ్చన్నారు. ఏఎస్‌జీ మాధవి దివాన్‌ స్పందిస్తూ ‘బళ్లారి, అనంతపురం, కడప వెళ్లకూడదనే షరతులతోనే 2015లో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. కానీ నాటి తీర్పులోని షరతులన్నింటిని ఆయన ఉల్లంఘించారు’ అని విన్నవించారు. షరతులు ఉల్లంఘించినప్పుడు బెయిల్‌ రద్దు చేయాలని ఎందుకు పిటిషన్‌ వేయలేదు? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? అసలు మీరు (సీబీఐ) ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారా అని సీబీఐ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. తాను 2021 నుంచి ఈ కేసులో వాదిస్తున్నానని, షరతులు ఎత్తివేయాలని వారు పిటిషన్‌ వేసినప్పటి నుంచి తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని మాధవి దివాన్‌ ధర్మాసనానికి తెలిపారు. అధికారులు సీరియస్‌గానే ఉన్నారని విన్నవించారు. విచారణ వేగవంతమయ్యేందుకు జనార్దన్‌రెడ్డి సహకరించలేదని, సహ నిందితులు విచారణకు గైర్హాజరవుతున్నారని చెప్పారు.  న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ కేసులో విచారణ రోజువారీ జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.


ఆయన కుమార్తె ప్రసవించింది.. బళ్లారి వెళ్లనివ్వండి

గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె రెండు రోజుల క్రితం ప్రసవించిందని, ఆయన నాలుగు వారాలు బళ్లారిలో ఉండేందుకు అనుమతివ్వాలని మీనాక్షి అరోరా కోరారు. దీనిపై తమకు సమాచారం లేదని, జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళితే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అవసరమనుకుంటే పిటిషనర్‌ ఇంటి ఎదుట అధికారిని ఉంచాలని మీనాక్షి అరోరా చెప్పారు. స్పందించిన న్యాయమూర్తి ‘మాకు మీపై విశ్వాసం ఉంది. అయితే పిటిషనర్‌ కుమార్తె ప్రసవించిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించాలి’ అంటూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని