ప్రైవేటు చేతికే దసపల్లా భూములు!

విశాఖ నగరంలో అత్యంత విలువైన దసపల్లా భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. మూడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న ఈ వ్యవహారంపై

Published : 30 Sep 2022 04:59 IST

తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సీసీఎల్‌ఏ ఆదేశం

రూ.2వేల కోట్ల భూములపై చక్రం తిప్పిన వైకాపా నేత

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ నగరంలో అత్యంత విలువైన దసపల్లా భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. మూడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న ఈ వ్యవహారంపై గురువారం రాత్రి కీలక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర భూ పరిపాలన వ్యవహారాల ముఖ్య కమిషనర్‌ మెమో 01ను జారీ చేశారు. ఈ భూముల విషయంలో కలెక్టర్‌ తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే 15 ఎకరాల విషయంలో వైకాపా కీలక నేత ఒకరు చక్రం తిప్పారని, అందువల్లే ఈ భూములు ప్రైవేట్‌పరం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని ‘ఈనాడు’ ముందుగానే గ్రహించింది. ‘దసపల్లా భూములు ప్రైవేటు పరం?’ శీర్షికన ఈ నెల 8నే ప్రధాన సంచికలో కథనం ప్రచురించడం గమనార్హం.

టౌన్‌ సర్వే సంఖ్య 1027, 1028, 1196, 1197ల్లో ఉన్న భూముల వ్యవహారంలో తదుపరి చర్యలను తీసుకోవాలని కలెక్టర్‌ను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూముల వ్యవహారంలో కలెక్టర్‌ గత ఏడాది ఆగస్టు 27న రాసిన లేఖకు అనుగుణంగా సీసీఎల్‌ఏ కార్యాలయం తదుపరి ఆదేశాలు వెలువరించింది. దసపల్లా భూ వ్యవహారం 1990 నుంచి వివిధ న్యాయస్థానాల్లో నలుగుతూ వచ్చింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భూముల యజమాని అయిన రాణి కమలాదేవికి అనుగుణంగా తీర్పులు వెలువడ్డాయి. 1998లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. 2012లో ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్‌పీని, 2012లో వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయా అంశాలపై న్యాయ విభాగం, అడ్వకేట్‌ జనరల్‌తో జరిపిన సంప్రదింపుల మేరకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సలహా ఇచ్చిందని, అందువల్ల తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నట్లు సీసీఎల్‌ఏ మెమోలో పేర్కొన్నారు. ఈ మేరకు 22ఎ జాబితా నుంచి దసపల్లా భూములను మినహాయించే విషయమై కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దసపల్లా భూముల్లో ప్రస్తుతం 15 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ముఖ్యనేత కన్ను ఈ భూములపై పడింది. ఆ నేత తన అనుచరులతో రాణికమలాదేవి నుంచి భూములు కొన్నవారితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకొనేలా చూశారు. ఆ ప్రకారం 70:30 నిష్పత్తిలో ముఖ్య నేత అనుచరులైన విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి (ఉమేష్‌), నగరంలో దుస్తుల వ్యాపారి (గోపీనాథ్‌రెడ్డి) కలిపి ఒప్పందం చేసుకున్నారు. ఆ వెంటనే ప్రభుత్వ స్థాయిలో చక్రం తిప్పారు. ఫలితంగా కలెక్టరేట్‌ నుంచి దస్త్రాలు అమరావతికి వెళ్లి, అక్కడ జరగాల్సిన తంతు చకచకా పూర్తయింది. వెంటనే ఆదేశాలు వెలువడ్డాయి. ఇక కలెక్టర్‌ తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఆయా భూములు ప్రైవేటు వ్యక్తులకు దక్కనున్నాయి. కొంతకాలంగా ఆయా భూములపై రాజకీయ పక్షాలు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు కీలక ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts