వెంకయ్యనాయుడి సేవలు ఆదర్శనీయం

‘వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, మాతృభూమికి సేవ చేయడంలో అంకితభావం, ప్రజా జీవితంలో వారి సుదీర్ఘ ప్రస్థానం, అన్నింటికి మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న వారి అలుపెరగని ఉత్సాహం నేటి యువతకు ఆదర్శనీయం...’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కొనియాడారు.

Published : 04 Oct 2022 05:17 IST

ఆయన్ను చూసే స్ఫూర్తి పొందాను
ఆత్మీయ అభినందనోత్సవంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
నిజాయతీపరులతోనే ప్రజాస్వామ్యం పటిష్ఠం: వెంకయ్యనాయుడు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వెంకటాచలం, న్యూస్‌టుడే: ‘వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, మాతృభూమికి సేవ చేయడంలో అంకితభావం, ప్రజా జీవితంలో వారి సుదీర్ఘ ప్రస్థానం, అన్నింటికి మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న వారి అలుపెరగని ఉత్సాహం నేటి యువతకు ఆదర్శనీయం...’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కొనియాడారు. అంత్యోదయ మార్గంలో గ్రామీణులు, యువత, అణగారినవర్గాలకు స్వర్ణభారత్‌ ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు, నెల్లూరు కస్తూర్బా గార్డెన్స్‌లో జరిగిన వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందనోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘వెంకయ్యనాయుడును విద్యార్థి దశ నుంచి చూస్తూ పార్టీలో ఎదిగాను. ఈ తరానికి స్ఫూర్తిని పంచే నాయకుల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు. దశాబ్దాలుగా వేలాది మంది కార్యకర్తల జీవితాలను ప్రభావితం చేయడం.. రాజకీయంగా వారిలో ఉన్నత విలువలు పెంపొందించేలా తీర్చిదిద్దిన నాయకుల్లో ఒకరు. పదవీవిరమణ చేసినా.. తమదైన విలక్షణ మార్గంలో ప్రజలకు నిత్యం దగ్గరగానే ఉన్నారు...’ అని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు.

‘రాజకీయ నాయకుల్లో ఓర్పు, నేర్పు, కూర్పు ఉండాలి. ప్రత్యర్థులను శత్రువులుగా చూడకూడదు. గౌరవించాలి. ప్రజాప్రతినిధుల్లో నీతి, రీతి బాగుంటేనే ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉంటుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. నేను ఎవరినీ శత్రువులుగా చూడలేదు. అందుకే శాంతియుతంగా, సంతృప్తిగా జీవిస్తున్నా...’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘సమాజం నేర్పిన వ్యక్తిత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ నేర్పిన సంస్కారం, ఏబీవీపీ మార్గదర్శకం, భాజపా అందించిన ప్రోత్సాహం, నెల్లూరు ప్రజల అభిమానంతోనే ఈ స్థాయికి ఎదిగాను. ఇప్పటివరకు నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను పూర్తి చేసే సంతృప్తిగా నెల్లూరుకు చేరుకున్నాను. పార్టీలకు దూరంగా ఉంటాను. కానీ రాజకీయాలపై మాట్లాడతాను...’ అని పేర్కొన్నారు. రోజూ నిద్రించే ముందు తాను చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకుని.. మరుసటి రోజు దాన్ని సరిచేసుకున్నప్పుడే రాజకీయాల్లో రాణిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సేవకు తావు లేని జీవితం, రుచిలేని భోజనం లాంటిదన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అభినందనోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, ట్రస్టీ దీపా వెంకట్‌, ముప్పవరపు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ హర్షవర్ధన్‌, గంగాధర్‌శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని