సంక్షిప్త వార్తలు (6)

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 5 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ మరో 66,154 క్యూసెక్కుల వరదను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Updated : 05 Oct 2022 05:13 IST

శ్రీశైలం జలాశయ 5 గేట్లు ఎత్తివేత

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 5 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ మరో 66,154 క్యూసెక్కుల వరదను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 1,16,516 క్యూసెక్కుల వరద వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు, నీటినిల్వ 214.8450 టీఎంసీలుగా నమోదైంది.


గ్రూపు-1 ప్రిలిమినరీ డిసెంబరు 18న

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో డిసెంబరు 18న నిర్వహించనున్నట్లు ప్రాథమికంగా వెల్లడించింది. ప్రధాన రాత పరీక్షను వచ్చే ఏడాది మార్చి 15 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రిలిమినరీకి ప్రధాన పరీక్షకు మధ్య ఎక్కువ సమయం లేదని, దీన్ని పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.


ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు.. పైపు లైన్‌తో నీటి సరఫరా
రూ.288 కోట్ల పనులకు త్వరలో శంకుస్థాపన

ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు నీటి సరఫరా కోసం మొదటి దశలో రూ.288 కోట్లతో పైపు లైను పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చేపట్టనుంది. ఈ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌ఆర్‌ఎస్‌ సంస్థ పనులను టెండరు విధానంలో దక్కించుకుంది. ఈ పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల అవసరాల కోసం ముచ్చుమర్రి నుంచి 1.41 టీఎంసీల నీటిని తీసుకోవడానికి వీలుగా పైపులైను పనులను ఏపీఐఐసీ ప్రతిపాదించింది. ఈ నీటిని శ్రీశైలం వరద జలాల నుంచి ఏడాదిలో 100 రోజుల పాటు తీసుకునేలా అధికారులు ప్రతిపాదన రూపొందించారు. జలాశయాలు, ఇన్‌టేక్‌ వెల్‌, పైపు లైను, మోటార్ల ఏర్పాటుకు మొత్తం రూ.452 కోట్లతో పనులను ప్రతిపాదించారు.


రాష్ట్రం సుసంపన్నంగా వెలగాలి: గవర్నర్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి, జగన్మాత అనుగ్రహం, కరుణా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నమై వెలగాలి’ అని ఆయన ఆకాంక్షించారు.


దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి: చంద్రబాబు

ఈనాడు, అమరావతి: దుర్గమ్మ ఆశీస్సులతో సకల జనులకు మంచి జరగాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. దసరా సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ కరుణాకటాక్షాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై ఉండాలని, ఆ తల్లి చల్లని చూపులతో రాష్ట్రం సుభిక్షమై, సుసంపన్నమై వెలిగే రోజులు రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


రాక్షసపాలనను అంతమొందించాలని ప్రార్థిస్తున్నా: పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘‘విజయ దశమి అంటే రాక్షస పాలనకు చరమాంకం. రాక్షస పాలన ఉన్న చోట ప్రజలను ఆ పరమేశ్వరి కాపాడాలని, అటువంటి పాలనను అంతమొందించాలని ప్రార్థిస్తున్నా. ఈ విజయదశమి ప్రజలందరికీ ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని