ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు

రాజధాని అమరావతి విషయంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దని అఖిలపక్ష ప్రజాసంఘాలు ప్రభుత్వానికి సూచించాయి.

Published : 07 Oct 2022 03:18 IST

ప్రభుత్వానికి అఖిలపక్షం సూచన
అమరావతి రైతులకు మద్దతు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి విషయంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దని అఖిలపక్ష ప్రజాసంఘాలు ప్రభుత్వానికి సూచించాయి. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఈ నెల 16న రాజమహేంద్రవరానికి చేరుకోనున్న నేపథ్యంలో గురువారం నగరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని తీర్మానించారు. పాదయాత్రకు గోదావరి ప్రజానీకం మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. యాత్రపై రాష్ట్ర మంత్రులతో ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని సమావేశంలో పాల్గొన్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమన్వయ సమితి సభ్యుడు జి.స్వరాజ్యరావు విమర్శించారు. అమరావతిని నిర్మిస్తే 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, 16 వేల పడకలతో ఆసుపత్రులు ఏర్పడేవని రాజధాని ఐక్యకార్యాచరణ సమితి సభ్యుడు గద్దె బుచ్చి తిరుపతిరావు వివరించారు. విశాఖకు రాజధానిని తరలిస్తే నీటి సమస్య వస్తుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. రాజధాని విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా దులిపేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకే రాజధాని ఉండాలని వైకాపా నాయకులు సైతం కోరుకుంటున్నారని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎన్‌.చినరాజప్ప అన్నారు. భాజపా, తెదేపా, సీపీఐ, జనసేన, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమావేశంలో పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని