Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి

ప్రభుత్వాలు చేయలేని ఎన్నో బృహత్తర కార్యాలను సత్యసాయిబాబా చేసి చూపించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 24 Nov 2022 07:25 IST

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పుట్టపర్తి: ప్రభుత్వాలు చేయలేని ఎన్నో బృహత్తర కార్యాలను సత్యసాయిబాబా చేసి చూపించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి 97వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన అనంతపురం కష్టాలను చూసిన బాబా.. భక్తుల సహకారంతో ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. ఒడిశా లాంటి ప్రాంతాల్లోనూ తాగునీటి సదుపాయాలు కల్పించారని తెలిపారు. ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించిన ఘనత బాబాకు దక్కుతుందన్నారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో ఎన్నో ప్రాజెక్టులను సత్యసాయి ఒంటిచేత్తోనే పూర్తి చేశారని గుర్తు చేశారు. ఆయనకు 153 దేశాల్లో భక్తులు ఉన్నారని.. ఆయన బోధనల స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. 2025లో సత్యసాయి శత జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వివరించారు.

ప్రధాని శుభాకాంక్షలు

సత్యసాయి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్టుకు లేఖ రాశారు. మనుషుల్లో తగ్గిపోతున్న మానవత్వాన్ని బాబా నిస్వార్థ సేవ మేల్కొలిపిందని పేర్కొన్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అని బాబా చెప్పిన సూక్తి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. తాను బాబా ఆశీర్వాదాలు తీసుకోవడం గొప్ప వరంగా భావిస్తున్నానని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని