‘ముఖ్యమంత్రి గారూ సాయం చేయండి’

విద్యుత్‌ స్తంభం ఎక్కి వైకాపా ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో వెన్నెముక విరిగిందని.. అప్పటి నుంచి జీవనం కష్టంగా మారి యాచిస్తూ బతుకుతున్నానని.. ముఖ్యమంత్రి ఆదుకోవాలని విజయవాడకు చెందిన కొండ శ్రీను కోరారు.

Updated : 03 Dec 2022 08:15 IST

ఈనాడు, కడప, పులివెందుల, న్యూస్‌టుడే: విద్యుత్‌ స్తంభం ఎక్కి వైకాపా ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో వెన్నెముక విరిగిందని.. అప్పటి నుంచి జీవనం కష్టంగా మారి యాచిస్తూ బతుకుతున్నానని.. ముఖ్యమంత్రి ఆదుకోవాలని విజయవాడకు చెందిన కొండ శ్రీను కోరారు. వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు శుక్రవారం వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తన భార్య లక్ష్మితో కలిసి రాగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పీబీర్‌ జలాశయం సమీపంలోని వంతెన ఫుట్పాత్‌పై కూర్చుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో వైకాపా ఫ్లెక్సీలు కట్టే క్రమంలో విద్యుత్తు స్తంభంపై నుంచి కింద పడి వెన్నెముక దెబ్బతిందన్నారు. అప్పు చేసి ఆపరేషన్‌ చేయించుకున్నానని వివరించారు. అనంతరం వైకాపా అధికారంలోకి రాగానే తనకు సాయం చేయాలంటూ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి  లేఖ రాశానన్నారు. అక్కడి అధికారులు, అప్పటి విజయవాడ కలెక్టర్‌ స్పందించి ట్రై సైకిల్‌ ఇప్పిస్తామని లెటర్‌ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ముగ్గురు కలెక్టర్లకు, 25 సార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతులు పంపానని.. 200 సార్లు 1902కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, వార్డు కార్పొరేటర్‌ను కలిసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానని..  ఇప్పటికైనా సీఎం స్పందించి సాయమందించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని