విద్యుత్తు తీగల శిక్ష.. పరిష్కారం సమీక్షా?

విద్యుత్తు ప్రమాదం సంభవించినప్పుడల్లా ఆ శాఖ మంత్రి సమీక్షిస్తారు.

Updated : 03 Dec 2022 06:07 IST

ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా
సమావేశాలతో సరిపెడుతున్న మంత్రి
ఆదేశాలు పాటించని అధికారులు 

ఈనాడు, అమరావతి: విద్యుత్తు ప్రమాదం సంభవించినప్పుడల్లా ఆ శాఖ మంత్రి సమీక్షిస్తారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేస్తారు... అంతటితో సరి. ఆ ఆదేశాలేవీ క్షేత్ర స్థాయిలో అమలు కావట్లేదు. నెల వ్యవధిలోనే అనంతపురం, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు విద్యుత్తు ప్రమాదాలు సంభవించాయి. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా స్పందించే అధికారులే కరవయ్యారు. ప్రమాదాలు జరిగాక కొందరికి పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం తప్పించి... నివారణకు డిస్కంలు చేపట్టిన చర్యల్లేవు. 2019-20, 2020-21లో రాష్ట్రంలో సంభవించిన విద్యుత్తు ప్రమాదాల్లో 675 మంది మరణించారు. 

ఇళ్లపై నుంచే విద్యుత్తు తీగలు

రాష్ట్రంలో ఇప్పటికీ చాలాచోట్ల ఇళ్లపై నుంచి, చేతికి అందేంత ఎత్తులో తీగలు వెళ్తున్నాయి. ఎప్పుడో ఏళ్ల కిందట సబ్‌స్టేషన్లకు విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటు చేసిన తీగలు... పట్టణ, నగర పరిధులు విస్తరించడంతో ఇళ్ల మధ్య నుంచే వెళ్తున్నాయి. కొన్నిచోట్ల మనుషుల్ని తాకేలా ఉన్నా... అధికారులు వాటి ఎత్తు పెంచడం.. మరోచోటుకు మార్చడం వంటి పనుల్ని చేపట్టడం లేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో దర్శిత్‌కు జరిగిన ప్రమాదమే అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. మూడేళ్ల బాలుడు ఎంత ఎత్తు ఉంటాడు? ఆ బాలుడినే తాకేంత ఎత్తులో తీగలు ఉన్నాయంటే ప్రమాదమే కదా? ఈ తీగలను మార్చాలని పదేళ్లుగా... అధికారులకు పదేపదే వినతిపత్రాలు పంపినా పట్టించుకోలేదు. అప్పుడే స్పందించి ఉంటే మూడేళ్ల బాలుడి ప్రాణం నిలిచేది. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందగానే స్పందించాలని మంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం అంటే ఇదేనా?

* అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరులో పెళ్లయిన 8 నెలలకే వివాహిత విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. పొలంలో మోటారు స్విచ్‌వేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇదే తరహాలో గత నెల కడప జిల్లాలో ముగ్గురు రైతులు చనిపోయారు.

* అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులోనే విద్యుత్తు తీగలు తెగిపడి ఐదుగురు కూలీలు మృతి చెందిన దుర్ఘటన ఇటీవల చోటు చేసుకుంది. మళ్లీ కొన్నిరోజుల తర్వాత అదే చోటులో విద్యుత్తు తీగ తెగడం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు