ఆలయ పాలకవర్గాల్లో ధర్మకర్తలుగా నాయీబ్రాహ్మణులు

ఆలయ పాలకవర్గాల్లో ఓ ధర్మకర్తగా నాయీబ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉండగా, వీటన్నింటిలో నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది.

Updated : 07 Feb 2023 04:57 IST

ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఆలయ పాలకవర్గాల్లో ఓ ధర్మకర్తగా నాయీబ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉండగా, వీటన్నింటిలో నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది. దేవాదాయశాఖకు చెందిన 97 ఆలయాల్లో 1,121 మంది నాయీ బ్రాహ్మణులు క్షురకులుగా ఉన్నారని, 1,169 ఆలయాల్లో భజంత్రీలుగా పనిచేస్తున్నారని, 100 మంది చెవులు కుట్టేవారు, 500 మంది పల్లకీ మోసే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. దేవాలయ సంప్రదాయాలతో వీరికి అనుబంధం ఉండటంతో.. నిర్వహణలో వీరికి భాగస్వామ్యం కల్పించేలా ప్రతి ట్రస్ట్‌ బోర్డులో ఒకరికి సభ్యుడిగా అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 3న జారీ అయిన ఈ ఆర్డినెన్స్‌ సోమవారం బయటకొచ్చింది.

క్షురకులకు కనీస వేతనం ఏదీ?

దేవాదాయశాఖకు చెందిన ఆలయాల్లో కమీషన్‌ విధానంలో పనిచేస్తున్న క్షురకులకు కనీస వేతనం ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పనిచేస్తున్న వెయ్యి మంది ఐకాసగా ఏర్పడి పోరాడుతున్నారు. ఒక్కో తలనీలాలకు వసూలు చేసే రూ.25 పూర్తిగా కమీషన్‌ రూపంలో క్షురకులకే ఇవ్వాలని గత ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి అది అమలవుతోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆయా ఆలయాల్లోని అటెండర్ల మాదిరిగా కనీస జీతం రూ.24 వేలు చొప్పున ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరిని పొరుగుసేవల కింద తీసుకొని, ఏ నెలలో అయినా కమీషన్‌ కింద రూ.10 వేలు కంటే తక్కువ వస్తే, వారికి ఆ నెల రూ.10 వేలు ఇస్తామని దేవాదాయశాఖ ప్రతిపాదించింది. దీనికి వారంతా నిరాకరించారు. కొద్దినెలల కిందట కమిషనరేట్‌లో సమీక్షకు వచ్చిన ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణను ముట్టడించారు. ఆలయాల్లో ఇప్పటికే కమీషన్‌ ప్రాతిపదికన పనిచేసే తమకు కనీస వేతనం అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆలయాల పాలకవర్గాల్లో సభ్యులుగా నియమించేలా ఆర్డినెన్స్‌ ఇవ్వడం మంచిదేనని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని