రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి ప్రకటించారు.

Updated : 08 Feb 2023 06:10 IST

2019 నాటికి రూ. 2,64,451 కోట్ల రుణభారం
సగటున యేటా రూ.44,497.75 కోట్ల అప్పు
రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి ప్రకటించారు. మంగళవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లమేర ఉన్న ఏపీ అప్పులు రాష్ట్రం ఇచ్చిన లెక్కల ప్రకారం 2023 మార్చి నాటికి రూ.4,42,442 కోట్లకు చేరినట్లు వివరించారు. రాష్ట్రప్రభుత్వం 2019 మార్చి తర్వాత యేటా సగటున రూ.44,497.75 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.1,77,991 కోట్ల అప్పు చేసినట్లు కేంద్రమంత్రి సమాధానం ద్వారా వెల్లడైంది. బడ్జెటేతర మార్గంలో 2021-22లో రూ.6,287.74 కోట్లు, 2022-23లో (అంచనా) రూ.1,300.80 కోట్ల రుణం తీసుకున్నట్లు సీపీఎం సభ్యుడు జాన్‌బ్రిటాస్‌ అడిగిన మరో ప్రశ్నకు కేంద్రమంత్రి పంకజ్‌చౌధరి బదులిచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఈ రుణాలను కంపెనీలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ ద్వారా తీసుకొని వాటి అసలు, వడ్డీని బడ్జెట్‌ ద్వారా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రుణ పరిమితులను నిర్ణయించే సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, తెలంగాణ, కేరళ, సిక్కిం రాష్ట్రాలు కోరినట్లు తెలిపారు. ఇలా బడ్జెటేతర మార్గాల నుంచి రుణాలు తీసుకొని వాటిని రాష్ట్రబడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నా, రాష్ట్రప్రభుత్వానికి వచ్చే పన్నులు, సుంకాలు, ఇతర ఆదాయాన్ని అందుకు కేటాయించినా వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) కింద రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులుగానే పరిగణించనున్నట్లు కేంద్రమంత్రి పంకజ్‌ చౌధరి స్పష్టం చేశారు.

కేంద్ర పన్నుల్లో వాటా కింద నాలుగేళ్లలో రూ.1,39,361 కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు గత నాలుగేళ్లలో రూ.1,39,361.18 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆమె మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు 4.047% వాటా చొప్పున 2020-21లో రూ.24,460.59 కోట్లు, 2021-22లో రూ.35,385.83 కోట్లు, 2022-23లో రూ.38,176.74 కోట్లు అందించినట్లు చెప్పారు. 2023-24లో రూ.41,338.02 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

వివిధ మార్గాల్లో అయిదేళ్లలో ఏపీకి రూ.2.10 లక్షల కోట్లు

కేంద్రపన్నుల్లో వాటా, ఆర్థికసంఘం నిధులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, ప్రత్యేకసాయం, మూలధన వ్యయం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2017-18 నుంచి 2021-22 మధ్య అయిదేళ్లలో రూ.2,10,308 కోట్లను కేంద్రం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందులో కేంద్రపన్నుల్లో వాటా కింద రూ. రూ.1,49,877.09 కోట్లు, ఆర్థికసంఘం నిధుల రూపంలో రూ.53,555 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.8.64 కోట్లు, ప్రత్యేకసాయం కింద రూ.3,501.2 కోట్లు, మూలధన వ్యయం కింద గత మూడేళ్లలో రూ.3,366.54 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.

ఏపీలో ప్రభుత్వ సంస్థల విద్యుత్తు బకాయిలు రూ.12,294 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వం నుంచి విద్యుత్తు సంస్థలకు రూ.12,294.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు