ఇనాం భూముల చట్ట సవరణతో జాగ్రత్త!

రాష్ట్రంలో ఇనాం భూముల చట్ట సవరణ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి సూచించారు.

Published : 20 Mar 2023 04:38 IST

అధికారపార్టీ ఎమ్మెల్యేల సూచనలు
ఆ పేరుతో ఆలయాలకు నష్టం జరగకుండా చూడాలి
తిరుపతిలో 60 వేల మంది సమస్యకు ఎప్పుడు పరిష్కారం?
ఇనాం, చుక్కల భూములు తదితర రెవెన్యూ చట్ట సవరణలకు ఆమోదం

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఇనాం భూముల చట్ట సవరణ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ అధికారుల అవకతవకలపై ఎలాంటి చర్యలూ ఉండటం లేదని మరో అధికార పక్ష ఎమ్మెల్యే విమర్శించారు. ప్రతి భూమీ ఎవరో ఒకరి ఆధీనంలో ఉందని రెవెన్యూ అధికారులు నివేదికలు ఇస్తూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ల్యాండ్‌ బ్యాంకు మిగలదన్నారు. చుక్కల భూములకు సంబంధించి చట్ట సవరణ బిల్లు, భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు 2023 సవరణ బిల్లు, ఇనాం రద్దు, రైత్వారీగా మార్పు చేస్తూ 2023 చట్ట సవరణ బిల్లులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టడంతో పాటు సభ చర్చించి ఆమోదించింది. ఈ సందర్భంగా చేపట్టిన చర్చలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలువురు మాట్లాడారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇనాం భూముల్లో వివిధ రకాలవి ఉన్నాయని చెబుతూ ఆలయాలకు కూడా ఇనాం భూములు ఉన్నాయని, ఈ చట్ట సవరణతో ఆలయాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాల్సి ఉంటుందన్నారు. గుడులు, గోపురాలకు ఉన్న ఇనాం భూములు బదలాయిస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. మరో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీకేటీ భూములు అమ్ముకోడానికి చట్టం తీసుకువస్తున్నారా అని ప్రశ్నించారు. ఎసైన్‌మెంట్‌ కమిటీలు క్రియాశీలకంగా లేవన్నారు. భూ పంపిణీకి సంబంధించి ఎలాంటి సమాచారం ఎమ్మెల్యేలకు ఉండటం లేదన్నారు. భూముల పంపిణీ విషయంలో ఎసైన్‌మెంట్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి కూడా ఎసైన్‌మెంట్‌ కమిటీల అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ రెవెన్యూశాఖలో అవకతవకలపై విచారణలు, చర్యలు ఉండటం లేదన్నారు. అసలు రెవెన్యూ అధికారులు భూములను సంరక్షించేందుకే ఉన్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు చట్టం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో ఎప్పటి నుంచో కొర్లగుంట, కొమ్మగుంట, తాతయ్యకుంట వంటి చోట్ల అనేక మంది ఇళ్లు నిర్మించుకున్నారని, వాటిని రెగ్యులరైజ్‌ చేయాల్సి ఉన్నా ఎప్పటి నుంచో అది పెండింగులో ఉందన్నారు. దీంతో దాదాపు 60 వేల మంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మఠం భూముల్లోనూ నిర్మాణాలు జరిగాయని వాటి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని సూచించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సమాధానమిస్తూ రెవెన్యూలో అవినీతిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చుక్కల భూముల చట్ట సవరణ వల్ల రెండు లక్షల ఎకరాలకు  ప్రయోజనం కలుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని