వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి ఏదీ?

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 21 Mar 2023 05:33 IST

సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
దర్యాప్తు అధికారిని ఎందుకు మార్చకూడదని ప్రశ్న
తాజా స్థితిపై నివేదిక అందజేయాలని ఆదేశం
ఈనాడు - దిల్లీ

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు ఏ దశలో ఉందో తెలియజేస్తూ తమకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందజేయాలని  ఆదేశించింది. వివేకా హత్య కేసును సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సతీమణి తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను సోమవారం విచారణకు చేపట్టింది. దర్యాప్తు అధికారి మూడునాలుగేళ్ల  తరవాత కూడా దర్యాప్తును పూర్తి చేయలేకపోతే ఆయనను మార్చమని సీబీఐ డైరెక్టర్‌ను కోరాలని జస్టిస్‌ షా సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌కు సూచించారు. కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తులశమ్మ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఏడాదిన్నరగా తమ క్లయింట్‌ (తులశమ్మ భర్త శివశంకర్‌రెడ్డిని ఉద్దేశించి) జైలులో ఉన్నారని తెలుపగా జోక్యం చేసుకున్న జస్టిస్‌ షా తాము ఇప్పుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారించడం లేదన్నారు. తాము కూడా దర్యాప్తు వేగంగా ముగించాలనే కోరుకుంటున్నామని తులశమ్మ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి లేనప్పుడు దర్యాప్తు అధికారిని కొనసాగించరాదని, ఆయనను ఎందుకు మార్చకూడదని జస్టిస్‌ షా ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్‌ అభిప్రాయం తీసుకొని తమకు తెలియజేయాలని ఏఎస్‌జీని ఆదేశించారు. దర్యాప్తు తాజా వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని