ఏటా 3 నెలలు భూసార పరీక్షలు

ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆ ఫలితాల ఆధారంగా జూన్‌ నాటికి రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 05:41 IST

ఈ ఏడాది రబీ ధాన్యం ఏప్రిల్‌ 15 నుంచి సేకరించాలి
వ్యవసాయ, ఉద్యానశాఖల  సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆ ఫలితాల ఆధారంగా జూన్‌ నాటికి రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ, ఉద్యానశాఖలపై సీఎం సమీక్షించారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే ప్లాంట్‌ డాక్టర్‌ విధానాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలి. భూసార పరీక్షలకు నమూనాల సేకరణ, పరీక్షలు, అవగాహన కల్పించడంపై సమర్ధమంతమైన ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌ఓపీ) రూపొందించుకోవాలి’ అని నిర్దేశించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల విస్తీర్ణ గణన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించగా.. నష్టపోయిన రైతుల జాబితాను ఏప్రిల్‌ రెండో వారానికి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. రబీ ధాన్యం ఏప్రిల్‌ 15 నుంచి సేకరించాలని సీఎం ఆదేశించారు. ‘ఆర్‌బీకేల్లో కియోస్క్‌ సేవలు పూర్తిస్థాయిలో అందేలా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఉద్యాన పంటల మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.

శిక్షణలతో దిగుబడులు పెరిగాయి

పొలంబడి శిక్షణలతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ‘శిక్షణ ఫలితంగా వరి, వేరుసెనగలో 15%, పత్తిలో 12%, మొక్కజొన్నలో 5% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. పత్తిలో 16%, మొక్కజొన్నలో 15%, వేరుసెనగలో 12% వరిలో 9% దిగుబడులు పెరిగాయి. పూర్తి సేంద్రియ సాగు పద్ధతుల దిశగా అడుగేయడానికి ఇది తొలిమెట్టు. 26 రైతు ఉత్పత్తి సంఘాలకుజీఏపీ(గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌) ధ్రువపత్రాలను ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎగుమతికి అవకాశమున్న వరి రకాల సాగును ప్రోత్సహిస్తున్నాం. 10 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున చిరుధాన్యాల క్లస్టర్లను ఏర్పాటు చేశాం. 3 ఆర్గానిక్‌ క్లస్టర్లూ ఉన్నాయి’ అని వివరించారు.

జులైలో టార్పాలిన్లు, స్ప్రేయర్లు

జులైలో టార్పాలిన్లు, జులై-డిసెంబరు మధ్య స్ప్రేయర్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ‘జులైలో 500, డిసెంబరు నాటికి మరో 1,500 డ్రోన్లు అందిస్తారు. ఏప్రిల్‌లో యంత్రాల పంపిణీ జరుగుతుంది’ అని అధికారులు వివరించారు. ఈ మేరకు రూపొందించిన షెడ్యూల్‌కు సీఎం ఆమోదం తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, ఉద్యానశాఖ సలహాదారు శివప్రసాద్‌రెడ్డి, ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని