వివేకా హత్య కేసు దర్యాప్తునకు కొత్త సిట్
మాజీ మంత్రి వివేకా హత్య కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు కొత్త అధికారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన సీబీఐ
విస్తృత కుట్రకోణంపై ఏప్రిల్ 30లోపు తదుపరి దర్యాప్తు పూర్తికి హామీ
ఇప్పటివరకు ఉన్న అధికారి రామ్‌సింగ్ తొలగింపు
ఆయన కొనసాగింపునకు న్యాయమూర్తి అభ్యంతరం
ఈనాడు - దిల్లీ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు కొత్త అధికారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని బుధవారం జస్టిస్ ఎంఆర్‌షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనానికి తెలిపింది. కేసు విచారణ వేగంగా సాగడం లేదని, దర్యాప్తు అధికారులను మార్చాలని హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్‌రెడ్డి సతీమణి తులసమ్మ వేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం సూచనల మేరకు సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్‌ను తొలగించారు. కొత్తగా ఏర్పాటుచేసిన సిట్‌ను డీఐజీ కేశవ్‌రామ్ చౌరాసియా పర్యవేక్షిస్తారు. ఎస్పీ స్థాయి అధికారి వికాస్‌కుమార్, అదనపు ఎస్పీ ముఖేష్‌శర్మ, ఇన్‌స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్‌ఇన్‌స్పెక్టర్ అంకిత్‌యాదవ్‌లను సిట్‌లో నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను బుధవారం సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ సమర్పించారు. దానికి జస్టిస్ ఎంఆర్‌షా ఆమోదం తెలిపారు. గత సోమవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఏళ్లుగా సాగుతున్నా దర్యాప్తు పూర్తి కాలేదంటూ జస్టిస్ ఎంఆర్‌షా దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐకి నిర్దేశించారు. దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని సీబీఐ చెబుతున్న సమయంలో అధికారిని మారిస్తే కొనసాగింపు దెబ్బతినడంతోపాటు దర్యాప్తు జాప్యమయ్యే అవకాశముందని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్‌షా కొత్త అధికారిని నియమించండి.. ప్రస్తుత అధికారినీ కొనసాగనివ్వండంటూ దీనిపై తదుపరి అభిప్రాయాన్ని బుధవారంకల్లా చెప్పాలని సీబీఐని ఆదేశించారు. దాన్ని అనుసరించి సీబీఐ తరఫు న్యాయవాది నటరాజన్ బుధవారం రామ్‌సింగ్ పేరునూ ఉంచి కొత్త దర్యాప్తు బృందం కూర్పును కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన జస్టిస్ ఎంఆర్‌షా అందులో రామ్‌సింగ్ పేరుపై అభ్యంతరం తెలిపారు. దర్యాప్తు బృందంలో ఆయన భాగంగానే ఉంటారని సీబీఐ న్యాయవాది బదులివ్వగా, న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఇంతవరకు ఏమీ చేయని ఆ ఏఎస్పీని ఎందుకు కొనసాగించాలి? అనవసరంగా కోర్టు ద్వారా ఎందుకు చెప్పించుకుంటారని ప్రశ్నించారు. కొత్త ఆర్డర్‌తో మధ్యాహ్నం రెండింటికల్లా కోర్టు ముందుకు రావాలని ఆదేశించారు. జస్టిస్ ఎంఆర్‌షా ఆదేశాల మేరకు మధ్యాహ్నం రెండింటికి సీబీఐ తరఫు న్యాయవాది నటరాజన్ కొత్త ఉత్తర్వులను ధర్మాసనానికి సమర్పించారు. దాన్ని పరిశీలించి న్యాయమూర్తి ఆమోదముద్ర వేశారు. ట్రయల్‌ను వేగంగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశిస్తామన్నారు. ఎప్పటిలోగా దర్యాప్తు పూర్తి చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గరిష్ఠంగా ఏప్రిల్ చివరిలోపు అని సీబీఐ న్యాయవాది బదులిచ్చారు.
తులసమ్మ భర్తకు బెయిల్ దరఖాస్తుకు నిరాకరణ
2022 జనవరిలో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ తులసమ్మ భర్త 15 నెలలుగా జైల్లో ఉన్నారని, ఆయన బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛనివ్వాలని ఆమె తరఫున సీనియర్ న్యాయవాది వి.వి.గిరి కోర్టుకు విన్నవించారు. దీనికి జస్టిస్ ఎంఆర్‌షా నిరాకరించారు. మీరు సమర్పించిన బెయిల్ దరఖాస్తును ఇటీవలే ఈ కోర్టు డిస్మిస్ చేసిందని గుర్తు చేశారు. ఇది జరిగి 4 నెలలైందని న్యాయవాది గిరి గుర్తుచేయగా, ఏడాదయ్యాక చూద్దామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశాకైనా బెయిల్ దరఖాస్తు దాఖలుకు అవకాశమివ్వాలని కోరగా.. తదుపరి దర్యాప్తు విస్తృత కుట్రకోణానికి సంబంధించిదని జస్టిస్ ఎంఆర్‌షా గుర్తుచేశారు. మీపై ఛార్జిషీట్ దాఖలైందని పేర్కొన్నారు. ఛార్జిషీట్ దాఖలై 13 నెలలైందని, ఏప్రిల్ 30 తర్వాతనైనా బెయిల్ దరఖాస్తుకు స్వేచ్ఛనివ్వాలని న్యాయవాది గిరి పదేపదే విన్నవించారు. ఈ వాదనలతో జస్టిస్ ఎంఆర్‌షా విభేదించారు. సీబీఐ తాజాగా సమర్పించిన సిట్‌ను, ఏప్రిల్ 30లోపు దర్యాప్తును పూర్తి చేస్తామన్న హామీని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణను హైదరాబాద్ ట్రయల్ కోర్టు వేగంగా చేపట్టాలని నిర్దేశించారు. ఒకవేళ నిందితులకు సంబంధం లేని ఏదైనా కారణంగా ఈరోజు నుంచి 6 నెలల్లోపు ట్రయల్ ప్రారంభం కాకపోతే ఇందులో ఏ5 (శివశంకర్‌రెడ్డి) రెగ్యులర్ బెయిల్ కోసం హైదరాబాద్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. దాన్ని చట్టప్రకారం కేసులోని మెరిట్స్ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించారు. ప్రస్తుత రిట్ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించారు.
సిట్ పర్యవేక్షణాధికారి కేశవ్‌రామ్ చౌరాసియా 2003 జమ్మూకశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై సీబీఐలో డీఐజీ హోదాలో సేవలందిస్తున్నారు. సిట్‌లోని వికాస్‌కుమార్.. 2013 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై సీబీఐలో ఎస్పీ హోదాలో ఉన్నారు.
ఒక్కోసారి ఒక్కో న్యాయవాదా?
పిటిషనర్ తులసమ్మ తరఫున ప్రతి విచారణ సమయంలో ఒక్కో కొత్త న్యాయవాది హాజరవడంపై జస్టిస్ ఎంఆర్‌షా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదివరకు నీరజ్ కిషన్‌కౌల్, నిన్న అనుపంలాల్ దాస్, నేడు వి.వి.గిరి వచ్చారని గుర్తు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ
-
Ap-top-news News
Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు