బల్లల్లేని పరీక్ష కేంద్రాలు భారమంతా హెచ్‌ఎంలపైనే!

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో డెస్క్‌ బల్లలు(విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలున్నవి) సరిపోను లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు విరాళాలు వేసుకొని పక్క ఊరి నుంచి తెప్పించుకుంటున్నారు.

Updated : 02 Apr 2023 06:19 IST

పది పరీక్షల కోసం డెస్క్‌బల్లలు తరలించేందుకు పాఠశాలల నుంచి వసూళ్లు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో డెస్క్‌ బల్లలు(విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలున్నవి) సరిపోను లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు విరాళాలు వేసుకొని పక్క ఊరి నుంచి తెప్పించుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌లో మొత్తం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,025 మంది పరీక్షలు రాయనున్నారు. ఇంతమందికి సరిపోయేలా ఆయా కేంద్రాల్లో డెస్క్‌ బల్లలు లేవు. పక్క గ్రామాల పాఠశాలల నుంచి తరలించాలని జిల్లాస్థాయి అధికారులు మండల అధికారులను ఆదేశించారు. అందుకయ్యే రవాణా, హమాలీ ఖర్చుల విషయం మాత్రం చెప్పలేదు. దీంతో ఎంఈవో పరీక్ష కేంద్రాల పరిధిలోని 18 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, కరస్పాండెంట్లతో చర్చించారు. ఒక్కో పాఠశాల రూ.1,750 ఇస్తే.. బల్లలు తరలించొచ్చని నిర్ణయించారు. ఓ ప్రధానోపాధ్యాయుడికి డబ్బు వసూళ్ల బాధ్యతను అప్పగించారు. విధిలేక కొందరు హెచ్‌ఎంలు జేబులోంచి పెట్టుకుంటున్నారు. కొందరు మాత్రం విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఎంఈవో తిమ్మప్పను సంప్రదించగా... ‘డెస్కు బల్లలు తెచ్చి, తీసుకెళ్లడానికి రూ.26 వేలు అవుతుందని అంచనా వేశాం. నిధులపై హెచ్‌ఎంలతో చర్చించాం. చందాలు ఇచ్చేందుకు వారూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. విద్యార్థుల నుంచి వసూలు చేయడం లేదు’ అని వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని